న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య చాలా బాధ కలిగించింది.. నిందితులకు శిక్షపడేలా చేస్తాం: మంత్రి కేటీఆర్‌

న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య చాలా బాధ కలిగించిందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ సమావేశంలో ..

  • Subhash Goud
  • Publish Date - 11:44 pm, Tue, 2 March 21
న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య చాలా బాధ కలిగించింది.. నిందితులకు శిక్షపడేలా చేస్తాం: మంత్రి కేటీఆర్‌

న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య చాలా బాధ కలిగించిందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ సమావేశంలో మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. న్యాయవాదులు తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వారినే సీఎం కేసీఆర్‌ అడ్వకేట్‌ జనరల్‌గా నియమించినట్లు చెప్పారు. హైకోర్టు విభజన కోసం ప్రధాని నరేంద్రమోదీని కేసీఆర్‌ ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారని అన్నారు. హైకోర్టు విభజన తర్వాతనే తెలంగాణకు న్యాయం జరిగిందన్నారు.

దేశమే అబ్దురపరిచే విధంగా కార్యక్రమాలు జరిగాయని, తెలంగాణ వచ్చాక రైతులకు ఎంతో లబ్ది జరిగిందన్నారు. తెలంగాణ రాకముందు రైతులకు కరెంటు లేదు. ఎరువులు లేవు, రుణ కష్టాలుండేవని అన్నారు. కాగా, సాధించుకున్న తెలంగాణలో దేశమే అబ్బురపడే విధంగా అద్భుతమైన కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ చేపట్టారన్నారు.
ప్రధాన నరేంద్రమోదీ మన పథకాలను కాపీ కొట్టారని, గతంలో 24 లక్షల మందికి పింఛన్లు వస్తే ఇప్పుడు 42 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. 9 లక్షల మంది అమ్మాయిలకు రూ. లక్షా 116 ఇచ్చామని, రైతు బీమా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. రైతు ఎలా చనిపోయినా రూ.5 లక్షల బీమా ఇస్తున్నట్లు చెప్పారు. 945 గురుకులాల ద్వారా ఉచిత విద్య అందిస్తున్నామని, ఉన్నత చదువుల కోసం రూ.25 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపుతున్నట్లు చెప్పారు. కొందరు సోషల్‌ మీడియాలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాని, టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ లేకపోతే టీ బీజేపీ, టీ కాంగ్రెస్‌ ఎక్కడ ఉండేవని ప్రశ్నించారు. మీ ముఖాలకు ఎంతోకొంత విలువ వచ్చిందంటేనే అది టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ వల్లేనన్నారు.

ఇక వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించిందని చెప్పిన మంత్రి హత్య కేసులో ఆరోపణలు వచ్చిన నేతను పార్టీ నుంచి వెంటనే తొలగించినట్లు చెప్పారు. అదే విధంగా హత్యతో ప్రమేయం ఉన్న వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కఠినంగానే ఉన్నారని అన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తప్పకుండా కృషి చేస్తామన్నారు. వామన్‌రావు హత్య కేసును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నట్లు మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయవాదుల కోసం ఏం చేసిందో రాచందర్‌రావు చెప్పాలని ప్రశ్నించారు. న్యాయవాదుల కోసం తమ ప్రభుత్వం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో రూ.10 వేల కోట్లతో న్యాయవాదుల సంక్షేమం కోసం నిధి ఏర్పాటు చేయించాలన్నారు. గత పాలకుల హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు.

ఇవి చదవండి :

గాంధీలో వైద్యులు, సిబ్బందిని అభినందించిన మంత్రి ఈటల.. కరోనాపై తెలంగాణ విజయం సాధించిందన్న ఆరోగ్యశాఖ మంత్రి

అంగన్‌వాడీ యూనియన్ నేతలతో మంత్రి సత్యవతి రాథోడ్ భేటీ.. అంగన్‌వాడీల వినతిపత్రంలో ఏమేమి ఉన్నాయంటే..