Telangana strategy: వామపక్ష తీవ్రవాదంపై తెలంగాణ ఉక్కుపాదం.. బహుముఖ వ్యూహమే విజయ రహస్యం.. ప్రభుత్వ చర్యలపై ప్రశంసలు..

వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర హోంశాఖ సోమవారం విడిగా సమావేశమైంది. నక్సలైట్ల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, మెరుగైన ఫలితాలు సాధిస్తున్న తెలంగాణ..

Telangana strategy: వామపక్ష తీవ్రవాదంపై తెలంగాణ ఉక్కుపాదం.. బహుముఖ వ్యూహమే విజయ రహస్యం.. ప్రభుత్వ చర్యలపై ప్రశంసలు..
Kcr Meet Amit Shah

Telangana Versatile strategy: వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర హోంశాఖ సోమవారం విడిగా సమావేశమైంది. నక్సలైట్ల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, మెరుగైన ఫలితాలు సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన హోంశాఖ కార్యదర్శి, ఐబీ చీఫ్ సహా మరికొందరు ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు స్వయంగా హాజరైన ఈ భేటీలో ఆయనతో పాటు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, అదనపు డీజీ (ఆపరేషన్స్ – గ్రేహౌండ్స్, ఆక్టోపస్) కే. శ్రీనివాస్ రెడ్డి సహా మరికొందరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలుచేసిన వ్యూహాలు, అనుసరించిన విధానాలపై అధికారులు కేంద్రానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

బహుముఖ వ్యూహం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి మిగతా నక్సల్ ప్రభావిత రాష్ట్రాలకు రోల్ మాడల్‌గా నిలుస్తున్న రాష్ట్రం విడిపోయిన తర్వాత సమస్యను అధిగమించడంలో మరింత విజయం సాధించింది. పటిష్టమైన నిఘా వ్యవస్థ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, క్షేత్రస్థాయిలో గెరిల్లా యుద్ధతంత్రంతో మెరుపుదాడులకు పాల్పడే నక్సలైట్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన గ్రేహౌండ్స్ వంటి బలగాలు వెరసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఫలించేలా చేశాయి. కేవలం పోలీస్ యాక్షన్‌తోనే సరిపెట్టకుండా, రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాలను అనుసరించినట్టు ఈ సమావేశంలో తెలియజేసింది. పేదరికం, వెనుకబాటుతనం, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందకోలేకపోవడమే వామపక్ష తీవ్రవాదం పెరగడానికి కారణాలని, ఈ క్రమంలో మారుమూల గ్రామాల వరకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించగలిగామని ఈ ప్రజెంటేషన్‌లో సీఎం కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. మెరుగైన విద్య, వైద్యం గ్రామీణ ప్రాంత ప్రజలకు అందిస్తూ, ఉపాధి అవకాశాలను సైతం పెంపొందించడం వల్ల కొత్తగా మావోయిస్టుల్లో చేరికలు కనిపించడం లేదన్నారు. మొత్తంగా రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని, క్యాడర్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని తెలిపారు.

పొరుగు రాష్ట్రాల్లో చర్యలు కీలకం
తెలంగాణ సరిహద్దుల్లోని చత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతం, మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతాల్లో మావోయిస్టుల సంఖ్య, కార్యకలాపాలు, హింసాత్మక ఘటనలు ఎక్కువగా ఉన్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ సహా అధికారులు కేంద్రానికి గుర్తుచేసినట్టు తెలిసింది. విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం అడపా దడపా సరిహద్దులు దాటి వచ్చి చెదురుమదురు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు తప్ప తెలంగాణలో మావోయిస్టుల కదలికలు, కార్యాకలాపాలు లేవని చెప్పినట్టు తెలిసింది. అయితే ప్రభావిత రాష్ట్రాలన్నీ కలసికట్టుగా ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్తే తప్ప ఈ సమస్యను పూర్తిస్థాయిలో అరికట్టలేమని కేంద్రానికి సూచించారు. సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లో నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు జాయింట్ ఆపరేషన్లు చేపట్టాలని సూచించారు. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ నెట్‌వర్క్ మెరుగుపర్చడంతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన చేపట్టాలన్నారు. రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణానికి పూర్తిగా కేంద్రమే నిధులివ్వాలని మరోసారి కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరారు. అలాగే పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు నిధులివ్వాలని, అదనపు కేంద్ర బలగాలను కేటాయించాలని కోరినట్టు తెలిసింది.

Read Also…  Pawan Kalyan Vs Mohan Babu Video: పవన్‌ డైలాగ్‌ VS మోహన్‌బాబు ట్వీట్‌.. ‘మా’ ఎన్నికల తర్వాత చెప్తాను.. (వీడియో)

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu