Telangana: కర్నాటక, తెలంగాణ మధ్య ‘చెత్త’ వివాదం..

కర్నాటక- తెలంగాణ సరిహద్దుల్లో ‘కంపు’ వివాదం ముదిరిపాకాన పడింది. ఒకవైపు ఊపిరి సలపనివ్వని విష వాయువులు కమ్మేస్తుంటే.. మరోవైపు దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ ఖాకీలు బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో తెలంగాణ సరిహద్దు పల్లెలు ఇప్పుడు రోగాలతో అల్లాడుతున్నాయి. అసలు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? గ్రామస్తులు అంతలా అల్లాడిపోవడానికి కారణమేంటి?

Telangana: కర్నాటక, తెలంగాణ మధ్య చెత్త వివాదం..
Waste

Updated on: May 24, 2026 | 9:35 PM

తెలంగాణ- కర్నాటక బోర్డర్‌లోని న్యాల్కల్ మండలం మల్గి గ్రామ సరిహద్దు ఇప్పుడు ఒక ‘డెత్ జోన్’గా మారుతోంది. కర్నాటకలోని బీదర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిరోజూ తరలిస్తున్న టన్నుల కొద్దీ వ్యర్థాలు ఇక్కడి పర్యావరణాన్ని నిలువునా ముంచేస్తున్నాయి. బీదర్‌కి చెందిన సుల్తాన్‌పూర్ డంపింగ్ యార్డ్ సరిగ్గా తెలంగాణ బోర్డర్ గ్రామాలకు ఆనుకుని ఉంది. నిబంధనల ప్రకారం చెత్తను రీసైక్లింగ్ చేయాల్సిన మున్సిపాలిటీ.. ఇక్కడ బహిరంగంగా చెత్తకు నిప్పు పెడుతోంది. ఆ విషపూరిత పొగ మల్గి, పరిసర గ్రామాలను కమ్మేస్తోంది.

ప్రతిరోజూ బీదర్ మున్సిపాలిటీ నుంచి సుమారు 40 టన్నులకు పైగా చెత్తను సేకరించి సుల్తాన్‌పూర్ డంపింగ్ యార్డ్‌కు తరలిస్తారు. అయితే, ఈ వాహనాలన్నీ తెలంగాణ పరిధిలోని మల్గి గ్రామం మీదుగానే వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రయాణంలో వాహనాల నుంచి కుళ్ళిన మురుగునీరు రోడ్లపై కారుతూ తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది.

చెత్త వాహనాల నుంచి లీకవుతున్న మురుగునీరు పంట పొలాలను సైతం కలుషితం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు డంపింగ్ యార్డులో అక్రమంగా చెత్తను తగలబెడుతుండటంతో సరిహద్దు ప్రజలు ఊపిరాడక అల్లాడిపోతున్నారు. ఈ డంపింగ్‌ యార్డ్‌ వల్ల కుక్కల బెడద కూడా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.

పొరుగు రాష్ట్రం చేస్తున్న పర్యావరణ నేరానికి తాము బలికావాలా అంటూ మల్గి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఒక్క చెత్త బండిని కూడా పోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. దీంతో బీదర్ నగరంలో చెత్త కుప్పలు పేరుకుపోయాయి. అయితే రంగంలోకి దిగిన కర్ణాటక మున్సిపల్ అధికారులు, బీదర్ పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేయాల్సింది పోయి.. బెదిరింపులకు దిగడం ఇక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేరే ప్రత్యామ్నాయ మార్గం ఉన్నప్పటికీ, కావాలనే తమ ఊరిని నాశనం చేయడానికి ఈ రూట్‌ను ఎంచుకుంటున్నారని మల్గి గ్రామస్తులు మండిపడుతున్నారు.

బీదర్ మున్సిపాలిటీ వ్యర్థాల రీసైక్లింగ్ కోసం సుల్తాన్‌పూర్ లో ‘వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్’ నిర్మిస్తామని ఏళ్ల క్రితం ప్రకటించినా, అది నేటికీ కాగితాలకే పరిమితమైంది. ఇప్పటికైనా సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు, తెలంగాణ ప్రభుత్వం వెంటనే.. కర్నాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి, మల్గి రూట్ నుంచి చెత్త తరలింపును అడ్డుకోవాలని కోరుతున్నారు. మరి అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపుతారో లేదో చూడాలి.

Follow Us