Telangana: ఆ ఊరు ఓ పూల సెలయేరు.. బతుకమ్మ పండుగ కోసమే పూల సాగు

బంతి, చామంతి, పట్టుగుచ్చు, గులాబీ ఇలా అన్ని రకాల పూలు ఆ గ్రామంలో దొరకుతాయి. బతుకమ్మ పండుగ కోసమే అక్కడి రైతులు పూల సాగు చేస్తారు.

Telangana: ఆ ఊరు ఓ పూల సెలయేరు.. బతుకమ్మ పండుగ కోసమే పూల సాగు
Thimmapur Flowers
Follow us

|

Updated on: Sep 30, 2022 | 5:10 PM

ఆ ఊరు పూల సెలయేరు. బతుకమ్మ పువ్వులకు కేరాఫ్‌ అడ్రస్‌ ఆ గ్రామం. ఊరిలో అడుగు పెడితే చాలు పూల తోటలు పలకరిస్తాయి. పూల అందాలు కనువిందు చేస్తాయి. బతుకమ్మ పండుగ కోసమే ఆ ఊళ్లో పూల సాగు చేస్తున్నారు. ఆ ఊరి పేరు చుట్టుపక్కల ఊళ్ల జనానికి తెలిసినా దానికి బతుకమ్మ పూల ఊరనే పేరు స్థిరపడిపోయింది. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ పువ్వుల సాగుకు ప్రత్యేకం. ఇక్కడ బతుకమ్మ కోసమే పూల తోటలను సాగు చేస్తూ ఉంటారు. బతుకమ్మ పండగకు నెల రోజుల ముందే నారు పోస్తున్నారు. బతుకమ్మ పండుగ వచ్చేనాటికి పూలు చేతికొస్తాయి. ఇప్పుడు అన్ని రకాల పూలు పూస్తున్నాయి. బంతి, చామంతి, పట్టుగుచ్చు, గులాబీ తదితర పూలతోటలు కనపడుతున్నాయి. రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా సీజనల్‌ పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామంలో ఎటు చూసినా పూల తోటలే పలకరిస్తున్నాయి. వాటిని చూస్తే ఒళ్లు పులకరిస్తుంది. భూతల స్వర్గం కాశ్మీర్‌లా కనిపిస్తోంది ఈ ప్రాంతం ఇప్పుడు. ఈ పూల తోటలను చూడడానికి జనం పెద్దఎత్తున వస్తున్నారు.

Flowers

సద్దుల బతుకమ్మ కోసం ముందుగానే పూలను బుక్‌ చేసుకుంటున్నారు. దసరా పండగ కోసం కూడా పూల ఆర్డర్లు వస్తున్నాయి. ఈ గ్రామంలో అధికంగా పట్టుగుచ్చును సాగు చేస్తున్నారు. బతుకమ్మను పేర్చేందుకు ప్రతి చుట్టుకు పట్టుగుచ్చు పెడతారు. దీంతో ఇక్కడ పట్టుగుచ్చు దొరుకుతుంది. తర్వాత బంతి, చామంతి వినియోగిస్తున్నారు. ఈ రెండు పంటలు కూడా ఎక్కువ సాగు చేశారు.

ఇక్కడ గులాబీ మొక్కలను కూడా పెంచారు. జనం ఇప్పటినుంచే పూలను కొనుగోలు చేసి వెళ్తున్నారు. శని, ఆదివారాలు పూల వనాల జనంతో కిటకిటలాడుతున్నాయి. ఈసారి చాలా చోట్ల భారీ వర్షాలకు తోటలు దెబ్బతిన్నాయి. దీంతో పూల ధర కొండెక్కింది. ఈ రెండు రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉంది. బతుకమ్మ పండగ కోసమే పూల తోటల సాగు చేస్తున్నామంటున్నారు రైతులు. పండగకు ఫోన్‌ ద్వారా కూడా ఆర్డర్లు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. పూలవనంగా మారిన ఊరు జనంతో నిండిపోయి కళకళలాడుతోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి