
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పరిపాలన వ్యవస్థలో కీలకమైన ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు పెద్ద ఊరట ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1,037 మంది ఔట్‌సోర్సింగ్ కార్యదర్శుల సేవలను ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన నిరాటంకంగా కొనసాగే అవకాశం లభించనుంది. పంచాయతీ కార్యదర్శుల వేతనాన్ని నెలకు రూ.19,500గా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ నియామకాల పద్ధతులన్నింటినీ ఖచ్చితంగా పాటించాలని ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ సంఖ్యను మించి ఎక్కడా కార్యదర్శులు ఉండరాదని కూడా ఆయన స్పష్టం చేశారు.
పంచాయతీ కార్యదర్శులు గ్రామీణాభివృద్ధికి వెన్నెముకలుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే మార్గం వీరే. పన్నుల వసూలు నుంచి ధృవీకరణ పత్రాల జారీ వరకు ప్రతిరోజు గ్రామ పరిపాలనలో వీరి పాత్ర ఎంతో కీలకం. రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శుల కొరత ఉన్న నేపథ్యంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందే పాలనను ముందుకు నడిపిస్తున్నారు. వారి సేవలను మరో ఏడాది పాటు కొనసాగించడం వల్ల గ్రామ స్థాయి పరిపాలనలో అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నట్లయింది. ఈ నిర్ణయం కార్యదర్శులు, వారి కుటుంబాలకు పెద్ద ఊరటగా మారింది. ఇక జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలపైనా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. క్రీడాకారుల కోటాలో పెండింగ్‌లో ఉన్న పోస్టుల భర్తీకి ఇటీవల అనుమతి ఇవ్వడం ద్వారా 172 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..