ఫార్మా విలేజ్ కోసం భూములు ఇచ్చేదే లేదని లగచర్ల రైతులు తేల్చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫార్మా విలేజ్ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ కోసం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో నిర్వహించిన గ్రామసభ రణరంగాన్ని తలపించింది. కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. భూసేకరణకు వ్యతిరేకంగా స్థానిక రైతులు గత కొంతకాలంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ప్రజాభిప్రాయసేకరణ కోసం గ్రామసభ నిర్వహించగా.. అక్కడ జరిగిన దాడిలో అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
అయితే గిరిజనుల పోరాట ఫలితంగానే ప్రభుత్వం లగచర్ల నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలోనూ.. ఈ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. అన్ని వర్గాల తరపున బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. ఇదిలావుంటే, మరి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం మరో నోటిఫికేషన్ జారీ చేస్తే రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతారా.. లేదా మళ్లీ పోరుబాట పడుతారా అన్నది చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..