వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మధ్య సమన్వయం పెరగాలి.. అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్

వ్యవసాయశాఖ కాగితం, కలం శాఖగా కాకుండా పొలం, హలం శాఖగా మారాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

  • Balaraju Goud
  • Publish Date - 10:00 pm, Sun, 24 January 21
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మధ్య సమన్వయం పెరగాలి.. అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్

CM KCR review : తెలంగాణలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్దతులు పెంపొందించేందుకు వ్యవసాయశాఖ కృషిచేయాలన్నారు సీఎం కేసీఆర్‌. వ్యవసాయశాఖ కాగితం, కలం శాఖగా కాకుండా పొలం, హలం శాఖగా మారాలన్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో.. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల ప్రాధాన్యం కూడా పెరిగిందని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు.

రైతులు పండించిన పంటలను మార్కెట్‌లో ఇబ్బంది లేకుండా అమ్ముకునేలా చూడాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందన్నారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రంలో పంటల సాగు, మార్కెటింగ్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు, ప్రాంతీయ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో సాగు చేయాల్సిన పంటలు, అవలంభించాల్సిన విధానంపై కీలక సూచనలు ఇచ్చారు.

సాగులో దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్న సీఎం కేసీఆర్‌… తెలంగాణకు ముందు ఏడాదికి 35 లక్షల టన్నుల ధాన్యాన్ని సాగు చేస్తే .. ప్రస్తుతం 1.10 లక్షల టన్నుల ధాన్యం పండిస్తున్నామన్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులతో 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ఏటా 4 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు పండించే రాష్ట్రంగా ఎదుగుతున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 2600 క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికలను వెంటనే వినియోగంలోకి తేవాలన్న సీఎం కేసీఆర్‌… రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలన్నారు. పంట మార్పిడి వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయన్నారు. గ్రామాల్లో కూలీల కొరత ఉన్నందున… వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలన్నారు. పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు రావాల్సి ఉందన్నారు.

Read Aslo… యువత కష్టపడితేనే భారత్ అన్ని రంగాల్లో స్వయం సంవృద్ది.. కళాకారులు, ఎన్‌సీసీ క్యాడెట్ల సమావేశంలో ప్రధాని మోదీ