టీడీపీ ఔట్ – వైకాపా ఇన్.. ఎక్కడ.. ఏంటా కథ?

తెలుగుదేశం ఔట్ – వైకాపా ఇన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే జరిగింది. అవును. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ప్రకారం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని బయటకు పంపి ఆ స్థానంలో వైకాపా వచ్చి కూర్చున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు దేశ రాజధాని కొత్త ఢిల్లీలో.. అందులోనూ పార్లమెంట్ భవనంలో తెలుగుదేశం పార్టీ స్థానంలోకి వైకాపా వచ్చింది. 3 దశాబ్దాల తర్వాత తెలుగుదేశం […]

టీడీపీ ఔట్ – వైకాపా ఇన్.. ఎక్కడ.. ఏంటా కథ?

తెలుగుదేశం ఔట్ – వైకాపా ఇన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే జరిగింది. అవును. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ప్రకారం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని బయటకు పంపి ఆ స్థానంలో వైకాపా వచ్చి కూర్చున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు దేశ రాజధాని కొత్త ఢిల్లీలో.. అందులోనూ పార్లమెంట్ భవనంలో తెలుగుదేశం పార్టీ స్థానంలోకి వైకాపా వచ్చింది. 3 దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీకి స్థానచలనం కలిగింది. ఈ లోపు 3 గండాలు దాటిన ఆ పార్టీ, ఈసారి కార్యాలయాన్ని తరలించక తప్పలేదు.

రూమ్ నెంబర్ 5: పార్లమెంటు భవనంలో అందరికీ తెలిసిన లోక్‌సభ, రాజ్యసభ, జాయింట్ సెషన్ నిర్వహించేటప్పుడు ఉపయోగించే సెంట్రల్ హాల్‌తో పాటు ప్రధాన మంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రుల కార్యాలయాలంటాయి. అలాగే సంఖ్యాబలం ఆధారంగా రాజకీయ పార్టీలకు కూడా గదులను కేటాయిస్తూ ఉంటారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో మొత్తం 41 గదులుండగా, 9, 10వ నెంబర్ గదుల్లో ప్రధాన మంత్రి కార్యాలయం, 8వ నెంబర్ గదిలో హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ఉన్నాయి. 6, 7వ నెంబర్ గదుల్లో కీలక మంత్రుల కార్యాలయాలున్నాయి. 2 నుంచి 4వ నెంబర్ వరకు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ కార్యాలయం, ఎన్డీయే నేత కార్యాలయాలున్నాయి. వీటి మధ్యలో ఉన్న 5వ నెంబర్ గదికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ ఆ గదిలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం కొనసాగింది. ఐదేళ్లు, పదేళ్లు కాదు, ఏకంగా 3 దశాబ్దాల పాటు అంటే, 1989 నుంచి ఈ గది తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంగా ఉంది. కానీ అది ఇప్పుడు గడచిన చరిత్ర. ఇప్పుడు ఆ కార్యాలయాన్ని 3వ అంతస్తులోని 118వ నెంబర్ గదికి తరలించాల్సి వచ్చింది.

ఈ మార్పు ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే.. గదుల కేటాయింపు ఎలా జరుగుతుందో తెలియాలి. సంఖ్యాబలం ఆధారంగా లోక్‌సభ స్పీకర్ పార్లమెంటు భవనంలోని గదులను పార్టీలకు కేటాయిస్తూ ఉంటారు. ఎక్కువమంది ఎంపీలు కలిగిన రాజకీయ పార్టీలకు ప్రధాన మంత్రి, కేబినెట్ మంత్రుల కార్యాలయాలుండే గ్రౌండ్ ఫ్లోర్‌లో గదులు లభిస్తాయి. మిగతా పార్టీలకు 3వ అంతస్తులోని గదులు కేటాయించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి 1989లో నాటి పార్టీ ఎంపీల సంఖ్యాబలం ఆధారంగా గ్రౌండ్ ఫ్లోర్‌లోని 5వ నెంబర్ గదిని కేటాయించారు. 1989 తర్వాత పార్టీ సంఖ్యాబలం తగ్గిన 3 సందర్భాల్లో ఆ గదిని టీఎంసీ, డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు కేటాయించారు. అయితే ఏ సందర్భంలోనూ తెలుగుదేశం మాత్రం తమ కార్యాలయాన్ని ఖాళీ చేయకుండా నాటి స్పీకర్లతో మాట్లాడి ఆ గదిని నిలబెట్టుకోగలిగింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల సంఖ్య ఉభయ సభల్లో కలిపి 5కు పడిపోయింది. లోక్‌సభకు ముగ్గురే గెలవగా, రాజ్యసభలో నలుగురు సభ్యులు బీజేపీలో చేరడంతో అక్కడ ఇద్దరు మాత్రమే మిగిలారు. అదే సమయంలో వైకాపా సంఖ్యాబలం లోక్‌సభలో 22కు పెరిగింది. రాజ్యసభలో అప్పటికే ఇద్దరు సభ్యులుండడంతో మొత్తం 24కు చేరింది. ఉభయ సభల్లో కలిపి సంఖ్యాబలం ప్రకారం చూస్తే బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే తర్వాతి స్థానంలో వైకాపా నిలిచింది. దీంతో స్పీకర్ 5వ నెంబర్ గదిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీకి మూడవ అంతస్తులోని రూమ్ నెంబర్ 118 కేటాయించారు.

అయితే 17వ లోక్‌సభ ఏర్పాటైన తర్వాత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు కూడా జరిగాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ ఖాళీ చేయకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఈ వ్యవహారాన్ని స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లారు. బయటి శక్తుల ద్వారా ఒత్తిడి తీసుకొస్తూ ఆ గదిని ఖాళీ చేయకుండా కొనసాగుతున్నారని ఆరోపిస్తూ ఓ లేఖ కూడా రాశారు. లేఖపై స్పీకర్ వెంటనే స్పందిస్తూ ఆ గది ఖాళీ చేసి వైకాపాకు అప్పగించాల్సిందిగా తెలుగుదేశం పార్టీని ఆదేశించారు. దీంతో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రాత్రి ముందు హుటాహుటిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని 5వ నెంబర్ గది నుంచి 118 నెంబర్ గదికి తరలించారు. వెను వెంటనే 5వ నెంబర్ గదికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ బోర్డుతో పాటు పార్లమెంటరీ పార్టీ నేత, ఉభయ సభల ఫ్లోర్ లీడర్లు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నేమ్ ప్లేట్లను ఏర్పాటు చేశారు. త్వరలోనే ఆ గది కార్యాలయానికి తగిన ఏర్పాట్లు చేసి ప్రారంభించనున్నట్టు వైకాపా వర్గాలు వెల్లడించాయి. అలా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం స్థానంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం వచ్చి చేరింది.

Published On - 6:31 pm, Sat, 1 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu