Errabelli Dayakar Rao : గ్రామాభివృద్దితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అభివృద్ది చెంది పరిశుభ్రంగా ఉన్నప్పుడే రాష్ట్రం సైతం అభివృద్ది చెందుతుందని తెలంగాణ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి..

Errabelli Dayakar Rao : గ్రామాభివృద్దితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు
Errabelli Dayakar Rao
Follow us

|

Updated on: Jul 05, 2021 | 9:38 PM

TS Panchayat Raj minister Errabelli Dayakar Rao: రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అభివృద్ది చెంది పరిశుభ్రంగా ఉన్నప్పుడే రాష్ట్రం సైతం అభివృద్ది చెందుతుందని తెలంగాణ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని కాసులపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఐక్యంగా మంచి ప్రణాళిక రుపొందించుకొని కలిసికట్టుగా అమలు చేసినప్పుడే గ్రామం అభివృద్ది చెందుతుందని మంత్రి చెప్పారు.

రాష్ట్రంలోని అన్నీ గ్రామాలను అభివృద్ది చేసే సువర్ణ అవకాశం తనకు కల్పిస్తూ సీఎం కేసీఆర్.. పంచాయతిరాజ్ శాఖ తనకు అప్పగించారని ఎర్రబెల్లి తెలిపారు. గతంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో మంచి ఫలితాలు సాధించామని, అదే స్పూర్తి గ్రామాల్లో నిరంతరం కొనసాగించాలని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం విద్యుత్ సమస్యలను అధిగమించి దేశంలోనే ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని, రైతులకు పెట్టుబడి అందించాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ప్రతి రైతుకు ఎకరాకు సంవత్సరంలో పదివేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తున్నారని మంత్రి తెలిపారు.

వృద్ధులకు అందించే ఆసరా పెన్షన్ ను పెంపొందించడం ద్వారా వారి ఆత్మగౌరవం పెరిగిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కరోనా విపత్కర సమయంలో సైతం సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఆపలేదని, ఇటీవలే 60 లక్షల పైగా రైతులకు 7, 500 కోట్లకు పైగా రైతు బంధు నిధులను ప్రభుత్వం జమ చేసిందని మంత్రి గుర్తు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం రికార్డు సమయంలో పూర్తి చేసి ఈ ప్రాంత రైతులందరికీ సాగునీరు అందిస్తున్నామని, ఉమ్మడీ కరీంనగర్ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీరందించే దిశగా సీఎం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు.

గతంలో ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలు, నీటిపారుదల ప్రాజేక్టుల పై అధిక దృష్టి కేంద్రీకరించిందని, ప్రస్తుత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి ని ఎజెండాగా ప్రభుత్వం పని చేస్తుందని, ఇందుకోసం అవసరమైన మేరకు కొన్ని కఠిన నిర్ణయాలు సైతం తీసుకుందని మంత్రి తెలిపారు. విపత్కర సమయంలో సైతం ప్రతి మాసం గ్రామాలకు నిధులను ప్రభుత్వం విడదుల చేస్తుందని మంత్రి వెల్లడించారు. గ్రామాభివృద్ధి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం పారిశుధ్యం పాటించడం పచ్చదనాన్ని పెంపొందించడం వంటి పనులు పంచాయతీ పగడ్బందీగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

గ్రామ అభివృద్దికి నిధులను అందించే దాతల పేరు మీద పెద్ద పెద్ద మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని, ఆ చెట్లకు వారి పేర్లు పెట్టాలని మంత్రి సూచించారు. గ్రామంలో అందరు ఐక్యమత్యంతో ఉండాలని అన్నారు. కాసులపల్లి గ్రామంలో బయట చెత్త వేస్తే 500 రుపాయలు జరిమానా తప్పనిసరిగా విధించాలని మంత్రి ప్రజలకు సూచించారు. మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటామని, గ్రామాల్లో రోడ్లపై చెత్త వేసే వారికి 500 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది అని రాష్ట్ర మంత్రి అన్నారు.

గ్రామాల్లోని కూలిపోయే ఇళ్లను, సర్కారు తుమ్మ చెట్లను పూర్తిస్థాయిలో తొలగించాలని, పురాతన బావులను బోరుబావులను మూసివేయాలని, విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. గ్రామంలో ప్రతి ఇంట్లో మొక్కలను నాటి వాటిని పెంచాలని, గ్రామంలోని మహిళలు యువకులు నెలకు ఒక రోజు శ్రమదానం చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి కోరారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రజలంతా ఐక్యమత్యంతో ఉండాలని, కుల మతాలు రాజకీయాలకతీతంగా సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.

కాసులపల్లి గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ పెద్ద మొక్కలు నాటాలని, సదరు ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతగాని , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి శంకర్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జడ్పీ వైస్ చైర్ పర్సన్ రేణుక, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read also:  ప్రతి గ్రామంలో ఒక మహిళ రూపంలో పోలీసు ప్రతినిధి ఉండాలనే ‘సంరక్షణ కార్యదర్శి’ అనే 15 వేల పోస్టులు సృష్టించాం : ఏపీ డీజీపీ