Telangana: డెడ్‌లైన్ ముగిసినా.. ఆగని ఆరోపణల పర్వం.. కొల్లాపూర్ కొట్లాటలో నెక్ట్స్ ఏం జరగబోతోంది?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొల్లాపూర్‌ పేరు మారు మోగుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి మధ్య జరుగుతున్న సవాళ్ల పర్వంతో.. పాలిటిక్స్ హీటెక్కాయి. ఉదయం నుంచీ టెన్షన్.. టెన్షన్.. ఇరు వర్గాల సవాళ్లు, ప్రతిసవాళ్లతో కొల్లాపూర్‌లో టెన్షన్.. టెన్షన్..

Telangana: డెడ్‌లైన్ ముగిసినా.. ఆగని ఆరోపణల పర్వం.. కొల్లాపూర్ కొట్లాటలో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
Kollapur
Sanjay Kasula

|

Jun 26, 2022 | 7:21 PM

ఒకరిపై ఒకరు ఆరోపణలతో మొదలైన మాటల మంటలు.. బహిరంగ చర్చకు సవాళ్ల వరకూ వెళ్లింది. డేట్.. టైమ్.. ప్లేస్.. ఫిక్స్ అయింది. తీరా ఆ రోజు రానే రావడంతో పెద్ద హైడ్రామా నడిచింది. కానీ వేదిక మారింది. అంబేద్కర్ సెంటర్ దగ్గర పర్మిషన్ ఇవ్వకపోవడంతో.. తగ్గేదే లే అంటూ జూపల్లి ఇంటికే ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వెళ్లే ప్రయత్నం చేశారు. ఉదయం నుంచి జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్దన్‌ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్‌ నెలకొంది. బహిరంగ చర్చకు ఎమ్మెల్యే బయల్దేరడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్‌ క్రియేట్‌ అయింది. ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా పోలీసు కారును చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. దీంతో కార్యకర్తలను చెదరగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసి తాడూరుకు తరలించడంతో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చినా.. ఆరోపణల పర్వం మాత్రం ఆగలేదు. తనని ఎదుర్కొలేకే అరెస్ట్ చేయించుకుని.. ఎమ్మెల్యే డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు జూపల్లి కృష్ణారావు. చర్చకు రాలేక పారిపోయాడంటూ మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలకు పూర్తి సమాధానం ఇచ్చానని… ఇక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఎక్కడికైనా రావడానికి సిద్ధమంటూ చాలెంజ్ చేశారు ఎమ్మెల్యే హర్షవర్ధన్. తాను చేసిన ఆరోపణలను నిరూపించడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటానన్నారు ఎమ్మెల్యే బీరం. పాలమూరు, కల్వకుర్తి ప్రాజెక్టుల విషయంలో జూపల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు. దీనికి జూపల్లి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేకి కనీస అవగాహన ఉందా? అని ప్రశ్నించారు.

మద్యాహ్నం వరకూ జూపల్లి, బీరం ఎపిసోడ్.. హైటెన్షన్ క్రియేట్ చేసింది. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం.. జూపల్లి హైదరాబాద్‌కు వెళ్లిపోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టే కనిపించాయి. అయితే ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదనీ.. లీగల్ & క్రిమినల్ కేసులు పెడతానని జూపల్లి హెచ్చరించడంతో ఈ వివాదం మరో టర్న్ తీసుకుంది.

మాజీమంత్రి వర్సెస్ తాజా ఎమ్మెల్యే వర్గపోరు ఇప్పటిది కాదు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జూపల్లిపై, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బీరం గెలిచారు. గెలిచాక బీరం కారెక్కారు. అప్పటినుంచి రచ్చ మొదలైంది. బీరం-జూపల్లి వర్గాల మధ్య బహిరంగ యుద్ధం నడిచింది. ఇదంతా కుదిరేలా లేదని, ఇక ఫేస్ టూ ఫేస్ తలపడటానికి సిద్ధమయ్యారు.

ఇటీవల కొల్లాపూర్ వచ్చిన కేటీఆర్, డైరక్ట్ జూపల్లి ఇంటికెళ్లి చర్చలు జరిపారు. దీంతో బీరం వర్గం రగిలిపోతుంది. దానికి కారణం టికెట్‌ లొల్లి. కొల్లాపూర్ కారు సీటు తమదంటే తమదని ఇరు వర్గాలు వాదించుకుంటున్నాయి. ఒకరికి సీటు ఇస్తే మరొకరు కచ్చితంగా పార్టీ మారేలా ఉన్నారు. అలా కాకుండా, పార్టీలో ఉంటే ఒకరి గెలుపునకు మరొకరు సహకరించే పరిస్థితి కనిపించట్లేదు. అటు, చాలా రోజులుగా జూపల్లి పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగింది. జూపల్లి టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీకి దూరంగా ఉండటం, పాలమూరు జిల్లాలో కేసీఆర్‌ సభ జరిగిన రోజు ఖమ్మం వెళ్లడం, కేటీఆర్‌ సభకు కూడా దూరంగా ఉండటంతో, జూపల్లి ఎప్పుడైనా కారు దిగొచ్చనే ప్రచారం జరిగింది. కానీ, తాను టీఎర్‌ఎస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు, జూపల్లి.

పార్టీలో ఉన్న విషయం ఎలా ఉన్నా, ఇప్పుడు జూపల్లి, హర్షవర్ధన్‌ మధ్య వర్గపోరు పీక్స్‌కు చేరింది. ఎప్పుడో జరిగిన విషయాలను తవ్వుకొని మరీ కాలు దువ్వుతున్నారు. డేటు, టైమూ అంటూ ఛాలెంజ్‌లు చేసుకున్నారు. ఇన్నాళ్లు డైలాగ్‌లతో గడిచింది. కానీ, ఇప్పుడు యాక్షన్‌లోకి దిగారు.

తెలంగాణ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu