
విద్యాభ్యాసం అందించిన విశ్వవిద్యాలయానికి కృతజ్ఞతగా ఓ మాజీ విద్యార్థి చేసిన విరాళం ఉస్మానియా విశ్వవిద్యాలయంకు కొత్త ఊపునిచ్చింది. అమెరికాలో స్థిరపడిన ఓయూ పూర్వ విద్యార్థి తెల్ల గోపాలరావు తన టెల్లా సకమోటో ఫౌండేషన్ ద్వారా 1.10 లక్షల అమెరికన్ డాలర్లు అంటే సుమారు రూ.95 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విరాళంలో 1 లక్ష డాలర్లు అంటే దాదాపు రూ.85 లక్షలు ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలోని మైనింగ్ ఇంజినీరింగ్ విభాగానికి కేటాయించారు. మిగిలిన 10 వేల డాలర్లు సుమారు రూ.8.5 లక్షలు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి అందజేశారు.
మైనింగ్ ఇంజినీరింగ్ విభాగానికి అందిన నిధులను డిజిటల్ మైనింగ్ సాంకేతికతలు, గనుల పరిశోధన, భద్రతా ప్రమాణాల మెరుగుదల, ఖనిజాల వెలికితీత పద్ధతులు, AI, మెషిన్ లెర్నింగ్ ఆధారిత పరిశోధనల అభివృద్ధికి వినియోగించనున్నారు. ఈ నిధులతో విభాగంలో ఆధునిక సదుపాయాలు ఏర్పడి, పరిశోధనలకు మరింత ప్రోత్సాహం లభించనుంది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి కేటాయించిన 10 వేల డాలర్లను నిర్మాణ సంబంధిత పనులు, మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నారు.
ఎవరీ తెల్ల గోపాలరావు
తెల్ల గోపాలరావు 1960లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలోని మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో పట్టభద్రులయ్యారు. విశ్వవిద్యాలయంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ విరాళాన్ని అందించినట్లు అధికారులు తెలిపారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థుల సంఘం ద్వారా ఈ విరాళం అందింది. సోమవారం ఓయూ వైస్ ఛాన్సలర్ మొలుగరం కుమార్ ఈ నిధుల కేటాయింపు పత్రాలను తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అధికారికంగా అందజేశారు.
పూర్వ విద్యార్థులు తమ ఆల్మా మేటర్ అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని, ఈ విరాళం ద్వారా ఓయూలో పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని విశ్వవిద్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.