Telangana weather: లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు దంచికొట్టనున్న వర్షం.. ఈ జిల్లాల్లో

రాష్ట్రంపై వరుణుడు దండెత్తాడు. రాజధాని హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో సైతం వాన దంచికొడుతుంది. ఇప్పటికే భారీ వర్షపాతం నమోదైంది.

Telangana weather: లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు దంచికొట్టనున్న వర్షం.. ఈ జిల్లాల్లో
Telangana Rain Alert
Follow us

|

Updated on: Sep 29, 2022 | 4:49 PM

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల కుండపోత వాన కురుస్తోంది. ఎక్కడ చూసిన నీళ్ళు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో  ఉపరితల ద్రోణి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, వికారాబాద్‌,మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ ఇచ్చింది. మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌,  కుమురం భీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,  ములుగు, హన్మకొండ, జనగాం, , మహబూబాబాద్‌, వరంగల్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, రంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్‌-మల్కాజిగిరి, హైదరాబాద్‌,  మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక శుక్రవారం తెలంగాణలోని అన్ని జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. శనివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఇక హైదరాబాద్‌లో నాలుగవ రోజు కూడా వర్షం కంటిన్యూ అవుతుంది. గురువారం(ఇవాళ) అయితే దంచికొడుతుంది. మధ్యాహ్నం  నుంచి నాన్ స్టాప్‌గా వాన కురుస్తుంది. రోడ్లపైకి చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసు బృందాలతో పాటు జీహెచ్‌ఎంసీ టీమ్స్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. వర్షం కురుస్తున్న నేపథ్యంలో వాహనాలు చాలా జాగ్రత్తగా నడపాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. ప్రజలకు ఏమైనా అత్యవసర ఇబ్బందులు ఉంటే.. 100కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో సూర్యాపేటలో వాన దంచికొట్టింది. పట్టణంలోని రోడ్లన్నీ నీటమునిగాయి. ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. అప్రమత్తమైన మున్సిపల్‌ సిబ్బంది రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టారు. సూర్యాపేటలోని 60 ఫీట్‌ రోడ్డులో నాలా ఉప్పొంగింది. దీంతో కాలనీల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. నాలుగు వార్డులు పూర్తిగా నీట మునిగాయి. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. తుంగతుర్తి నియోజకవర్గంపై ప్రకృతి పగ పట్టింది. వరుసగా రెండు రోజులు పిడుగులు పడి, ఇద్దరు మృతి చెందడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పిడుగుపాటుకు మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్‌ని మరోసారి వర్షం వణికించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బెంబేలెత్తించింది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. పాతబస్తీని వర్షంతో పాటు పిడుగులు హడలెత్తించాయి. నవాబ్‌సాబ్‌కుంటలో ఓ ఇల్లు బీటలు వారింది.

ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం

ఏపీలోను వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాయలసీమ, చుట్టుపక్కల జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయ్‌. ఉరుములు మెరుపులతో కురిసిన జోరువానకు గుంటూరు అల్లాడిపోయింది. ప్రధాన రహదారులన్నీ మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. నంద్యాల జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది. నంద్యాల, కోవెలకుంట్ల, సంజామల మండలాలను వరద ముంచెత్తింది. ఉన్నట్టుండి కురుస్తోన్న కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయ్‌. వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కడప జిల్లా బద్వేల్‌లో కుండపోత కురిసింది. తెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లపై నీరు వెల్లువలా మారింది. డ్రైనేజీ పొంగడంతో అడుగు బయటపెట్టాలంటే జనం అల్లాడిపోతున్నారు. నెల్లూరు జిల్లాలోనూ వర్షం బీభత్సం సృష్టించింది. కావలి హైవేపైకి వరద పోటెత్తడంతో ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. జోరువానకు పంట పొలాలు నీట మునగడంతో దిక్కతోచని స్థితిలో అల్లాడుతున్నారు రైతులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం