సంతకానికో 50వేలు.. భారీ నిర్మాణాలైతే సప‘రేటు’.. వామ్మో.. కళ్లు బైర్లుకమ్మెలా ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు..
మన చెరువులను మింగేస్తోంది ఎవరు..? ఆ మింగే తిమింగలాలకు సహకరిస్తున్నది ఎవరు? చెరువులు, వాటి బఫర్‌జోన్‌లను కబ్జా చేస్తున్నదెవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కానీ అలా మింగేస్తున్న వారి వెనక ఎవరున్నారో అన్నది తెలిసిపోయింది.. ACB రైడ్ ఈ అవినీతి అధికారిని పట్టించింది.
ఆయన మామూలోడు కాదు. తన సంతకానికి వెలకట్టి అమ్మేస్తుంటాడు. ఒక్క NOC జారీ చేయడానికి మీ బ్యాంకు ఖాతాని ఖాళీచేయిస్తాడు. సామాన్యుడా? బడా వ్యక్తా అన్న తేడా లేకుండా అందరి దగ్గరా గుంజేస్తుంటాడు ఆ ఘనుడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మైనర్ ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్‌కుమార్ గురించే చెబుతున్నాం. సగం హైదరాబాద్‌కి ఈయన జారీ చేసే NOCనే ముఖ్యం. మినిమం 50వేల లంచం.. పెద్ద నిర్మాణాలైతే లక్షల్లోనే. NOCల జారీలో రియల్టర్లు, సామాన్యుల రక్తం తాగిన ఈ రాబందు పాపం పండింది. చిన్న గాలివానకు రాలిపడినట్లు.. ఈ అక్రమార్కుడిని ఓ స్మాల్ టైమ్ రియల్టర్ పట్టించేశాడు. దీంతో ఈ భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది.
ఏఈఈ నిఖేష్ ఆస్తుల చిట్టా ఇది..
- ఆయన అక్రమాస్తి విలువ రూ.200 కోట్ల ఉన్నట్లు తెలుస్తోంది.
- పీరం చెరువు పెబెల్‌సిటీలో ఇల్లు
- మొయినాబాద్ మండలంలో ఫామ్‌హౌస్‌లు
- తోల్కట్ట, సజ్జన్‌పల్లి, నక్కలపల్లిలో ఫామ్‌హౌస్‌లు
- మియాపూర్, శంషాబాద్, గచ్చిబౌలిలో ప్లాట్లు
- మియాపూర్‌లో కమర్షియల్ కాంప్లెక్స్ గుర్తింపు
- 5 ప్లాట్లు, 6.5ఎకరాల వ్యవసాయ భూమి
- 6 ఫ్లాట్లు, 2 కమర్షియల్ కాంప్లెక్స్‌లు
- వీటి విలువ రూ.17.73కోట్లు
- మార్కెట్ వాల్యూ రూ.200 కోట్లు
ఓవైపు హైడ్రా FTL, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలంటూ అన్నింటినీ కూల్చుకుంటూ వెళ్తోంది. మరి ఆ జోన్లలో నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులెవరు? NOCలు జారీచేసిన ఆ అవినీతి ఆఫీసర్లు ఎవరు? అనే చర్చ కొన్ని రోజులుగా సాగుతోంది. ఆయనెవరో కాదు.. ఇక్కడ కనిపిస్తున్న నిఖేష్ కుమారే. మైనర్ ఇరిగేషన్‌లో చెరువులు, నాలాలను కాపాడమే ప్రధాన విధి. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాలను రక్షించాలి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లకు, భవంతులకు, గేటెడ్ కమ్యూనిటీలకు, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ నిర్మాణాలకు అనుమతులిచ్చేది హెచ్‌ఎండీఏనే అయినా నీటిపారుదల శాఖ ఇచ్చే NOCలు కీలకం. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నిర్మాణాలు చాలావరకు జలాశయాలు, నాలాలకు సమీపంలో ఉండడంతో నిఖేశ్ అవినీతి చక్రం తిప్పాడు. ల్యాండ్ కన్వర్షన్లలోనూ భారీగా అవినీతికి పాల్పడినట్లు తేలింది.
ఇక అన్ని అనుమతులు తీసుకుని భవనాలు నిర్మిస్తున్నా సరే.. నిఖేష్ వదలడు. అతడికి లంచం ఇచ్చారంటే సరి.. లేదంటే ఫిర్యాదులు వచ్చాయన్న పేరుతో పదే పదే సర్వేలు చేయించి ముప్పతప్పలు పెడతాడు. పట్టబడిందంతా నిఖేష్ అవినీతి సొమ్మేనా? ఎవరికైనా బినామీగా ఉన్నాడా? అనేది తేల్చేపనిలో నిమగ్నమయ్యారు అధికారులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..