Harish Rao: రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్

| Edited By: Janardhan Veluru

Sep 27, 2024 | 4:30 PM

దసరా లోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అల్టిమేటం ఇచ్చారు. లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో రైతులు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.

Harish Rao: రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్
Harish Rao
Follow us on

రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డెడ్ లైన్ విధించారు. దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండల కేంద్రంలో రైతులు నిర్వహించిన ధర్నాలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలేవో నీళ్ళేవో తేలాలంటే కొద్దిగా టైం పడుతుందన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు ఏ విధంగా ఉండేవారో, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందనేది అందరికీ అర్థమవుతుందన్నారు. కేసిఆర్ ముఖ్యమంత్రి కాకముందు రైతులకు ఎరువు బస్తా కావాలంటే ఉదయం ఐదు గంటలకు చెప్పులు లైన్లో పెడితే ఒక్క ఎరువు బస్తా దొరికేదని గుర్తుచేశారు. కేసిఆర్ ప్రతీ ఊరికి ఎరువులను లారీల్లో పంపిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ రైతులను ఎరువు బస్తాల కోసం లైన్ల నిలబెట్టిందని విమర్శించారు. కేసీఆర్ రాక ముందు మోటర్లు కాలిపోయేవని, ట్రాన్స్‌ఫార్మర్‌లు పేలిపోయేవన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ట్రాన్స్‌ఫార్మర్‌లు కాలకుండా కడుపునిండా రైతులకు కరెంటు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలనలో దొంగ రాత్రి కరెంట్ వచ్చేదని, కానీ కేసీఆర్ 24 గంటలు కరెంట్ అందించాడన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పాత రోజులు తీసుకొని వచ్చిందని, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్‌ల పరిస్థతిని తీసుకొచ్చిందని మండిపడ్డారు. నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ఓ సమావేశంలో కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఎలా వచ్చిందని ఇప్పుడు ఎందుకు రావడం లేదని అధికారులను ప్రశ్నిస్తుందన్నారు.  కరోనా వచ్చినప్పుడు కూడా రైతులకు రైతుబంధు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. కరోనాలో ఆదాయం లేకపోయినా ఎమ్మెల్యేల, మంత్రుల జీతాలు బంద్ పెట్టినా, కానీ రైతులకు మాత్రం రైతుబంధు ఇచ్చినట్లు చెప్పారు. అది కేసీఆర్‌కు రైతు మీదున్న ప్రేమ అని, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది? అని ప్రశ్నించారు. కరోనా లేదు అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. పంట కోతకు ఉన్నా, దసరా పండుగ దగ్గరకు వస్తున్నా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు వేయలేదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి మాటలు మాత్రం కోటలు దాటుతాయని, కానీ రైతులకు మాత్రం రైతుబంధు వేయట్లేదన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలో రైతుల భూముల విలువలు పెరిగినట్లు చెప్పారు. ముందు ఎకరం రూ.5 లక్షలు కూడా ఉండేది కాదన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో రైతు విలువతో పాటు రైతు భూమి విలువ కూడా పెరిగిందన్నారు. కాంగ్రెస్ వచ్చింది రైతు విలువ తగ్గించిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులు నిండుకుండల్లా ఉన్నాయన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని అంటున్న సీఎం రేవంత్ రెడ్డి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌లను చూడాలన్నారు. రేవంత్ రెడ్డికి కూలగొట్టుడు తప్ప కట్టడం తెలియదని విమర్శించారు. సీఎం కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు. 100 భాగాల కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు, 19 పంప్ హౌస్ లు, 18 రిజర్వాయర్లు, సొరంగాలు, కాలువలు, పైపులైన్లు ఉంటాయన్నారు. అందులో రెండు పిల్లర్లకు మాత్రమే పగుళ్లు వచ్చాయన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్‌లో నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాతే రైతులకు రెండు పంటలు పండుతున్నట్లు వివరించారు.

కాంగ్రెస్ అన్ని పంటలకు బోనస్ అని చెప్పి ఇప్పుడేమో సన్నాలకు మాత్రమే ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీపైనే మొదటి సంతకం చేస్తా అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటతప్పాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిన వారికంటే చేయనివారు ఎక్కువ ఉన్నారన్నారు. రుణమాఫీ జరిగేదాకా సీఎంను విడిచిపెట్టేది లేదన్నారు. సీఎం పేరు ఎనుముల రేవంత్ రెడ్డి అని, ఆయన పనులు చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని, ప్రజలను మోసం చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవెర్చే దాకా తాము వదిలిపెట్టమని హెచ్చరించారు. దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని, లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు.