హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్ కేసులో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ను వేర్వేరు కోణాల్లో ప్రశ్నించారు ఈడీ అధికారులు. 2023 అక్టోబర్‌లో అజార్‌పై పోలీసులు నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. విశ్వాస ఉల్లంఘన, మోసం, ఫోర్జరీ, కుట్ర అభియోగాలు మోపారు. హెచ్‌సీఏ అభ్యర్థనతో మార్చి 2020 – ఫిబ్రవరి 2023 మధ్య నిధుల దుర్వినియోగంపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిగింది. ప్రైవేట్ ఏజెన్సీలకు నిధుల మళ్లింపును గుర్తించారు. ఈ వ్యవహారంపై హెచ్‌సీఏ సీఈవో సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లయింట్‌పై అప్పట్లో స్పందించిన అజారుద్దీన్.. తన ప్రతిష్టను దెబ్బతిసే కుట్ర జరిగిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే వరుస కేసులతో అజార్ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2023 నవంబర్‌లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.
లేటెస్ట్‌గా హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అజారుద్దీన్ పాత్రపైనా ఈడీ ఆరా తీసింది. ఆయన పదవీకాలంలో క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ పరికరాల కొనుగోళ్లు.. ప్రైవేట్ పార్టీలతో కుమ్మక్కయి టెండర్లు అప్పగించడం లాంటి అంశాలపై ప్రశ్నలు సంధించారు. అలాగే హెచ్‌సీఏ మాజీ ఆఫీస్ బేరర్లకు చెందిన ఆఫీసుల్లో గతంలో ఈడీ సోదాలు జరిపింది. ఆ సమయంలో డిజిటల్ పరికరాలు, నేరారోపణ పత్రాలు, లెక్కల్లో చూపని నగదుకి సంబంధించి అజారుద్దీన్‌పై మరికొన్ని ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఉప్పల్ స్టేడియంలో డిజిల్ జనరేటర్లు, అగ్నిమాపక వ్యవస్థలు, క్యానోపీల సేకరణ కోసం కేటాయించిన 20 కోట్ల దుర్వినియోగంపైనా ఆరా తీసినట్టు సమాచారం. గంటలకొద్ది అజార్‌ను విచారించిన ఈడీ.. మరికొందరికి నోటీసులు ఇస్తుందా అనే చర్చ నడుస్తోంది.