బీజేపీలోకి మరో మాజీ మంత్రి.. ఫలించిన అరుణ మంత్రాంగం.. చేరికకు ముందు మహాయాగం

దుబ్బాక ఉపఎన్నికలో ఘన విజయం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా..

బీజేపీలోకి మరో మాజీ మంత్రి.. ఫలించిన అరుణ మంత్రాంగం.. చేరికకు ముందు మహాయాగం
Follow us

|

Updated on: Dec 14, 2020 | 1:41 PM

BJP Operation Aakarsh:  దుబ్బాక ఉపఎన్నికలో ఘన విజయం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలు తమ పార్టీలోకి లాగేందుకు రాయబారాలు సాగిస్తోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ సహా, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు బడా నేతలు బీజేపీలో చేరారు. తాజాగా బీజేపీ మహిళా నాయకురాలు డీకే అరుణ కాంగ్రెస్ పై ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. ఈ ఆపరేషన్ ఆకర్ష్ చివరికి ఫలితాన్ని ఇచ్చింది. డీకే అరుణ ప్రయత్నాల కారణంగా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చంద్రశేఖర్ బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈనెల 28వ తేదీన బీజేపీలో చేరనున్నట్లు చంద్రశేఖర్ ప్రకటించారు. బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇందుకు వికారాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. చంద్రశేఖర్ బీజేపీ తీర్థం పుచ్చుకునే ముందు రోజున అంటే ఈనెల 27వ తేదీన వికారాబాద్‌లో మహాయజ్ఞం చేయతలపెట్టారు. ఇదిలాఉండగా, చంద్రశేఖర్ పార్టీ మారకుండా ఉండేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సీనియర్ నేతలంతా స్వయంగా ఆయన నివాసానికి వచ్చి మరీ బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇస్తూ బీజేపీలోకి చేరబోతున్నట్లు ప్రకటించేశారు చంద్రశేఖర్. 1985 నుండి 2004 వరకు వికారాబాద్ ‌నుండి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రశేఖర్.. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

మరోవైపు చంద్రశేఖర్ మాత్రమే కాదని, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇంకా చాలా మంది సీనియర్లు త్వరలోనే బీజేపీ గూటికి చేరుతారని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం తమకు టచ్‌లో ఉన్నారని, సరైన సమయంలో వారు కూడా బీజేపీ కండువా కప్పుకుంటారని అంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుంచి స్వామి గౌడ్ కాషాయ కండువా కప్పుకోగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయశాంతి, గూడురు నారాయణ బీజేపీలో చేరారు.