New Secretariat: ఒక ప్రమాదం.. ఎన్నో సందేహాలు.. సెక్రటేరియట్‌కు బయలుదేరిన కాంగ్రెస్‌ నేతల్ని అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌ భవనం.. ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. కలర్‌ఫుల్ లైట్ల మధ్య వెలిగిపోతున్న బిల్డింగ్‌లో అర్ధరాత్రి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. తెల్లారేసరికల్లా అంతా సెట్‌రైట్‌ అయిపోయింది. ఇంతకీ జరిగింది అగ్ని ప్రమాదమా? పోలీసుల మాక్‌డ్రిల్లా? దట్టమైన పొగల వెనుక దాగిన నిప్పులాంటి నిజమేంటి..

New Secretariat: ఒక ప్రమాదం.. ఎన్నో సందేహాలు.. సెక్రటేరియట్‌కు బయలుదేరిన కాంగ్రెస్‌ నేతల్ని అడ్డుకున్న పోలీసులు
Telangana Secretariat
Follow us

|

Updated on: Feb 03, 2023 | 2:04 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయంలో అర్దరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్‌తో గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మొత్తం 11 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో అగ్ని ప్రమాదం జరగడం అందర్నీ షాక్‌కి గురిచేసింది.

సెక్రటేరియట్ ప్రధాన గోపురం నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. భారీ పొగతో పనిచేస్తున్న కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరోవైపు సెక్రటేరియట్‌ చుట్టూ పోలీసులు భద్రత పెంచారు. మీడియాపై ఆంక్షలు విధించారు. ఈ పరిణామాలే అందరిలో అనుమానాలు రేపాయి. అసలేం జరిగింది..? ప్రమాదం ఎందుకు జరిగింది? ఎలా జరిగిందన్నది మిస్టరీగా మారింది.

సెక్రటేరియట్‌లో వుడ్‌ వర్క్స్ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు లేచినట్టు తెలుస్తోంది. ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్న క్రమంలో అగ్నిప్రమాదం జరగడంతో అధికారులు, నిర్మాణ సంస్థ ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా ఆరాతీస్తున్నట్టు సమాచారం.

సెక్రటేరియట్‌లో ప్రమాదంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు స్పందించారు. సచివాలయంలో అగ్ని ప్రమాదం జరగలేదని.. జస్ట్‌ మాక్‌డ్రిల్‌ మాత్రమే జరిగిందన్నారు. అదే నిజమైతే ఆంక్షలేందుకన్న ప్రశ్నలు వినిపించాయి. మరోవైపు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పోలీసుల వర్షన్‌కి విరుద్దంగా స్టేట్మెంట్‌ ఇచ్చారు. జరిగింది స్వల్ప అగ్ని ప్రమాదమేనన్నారు. ప్లాస్టిక్ సామాగ్రి కారణంగా మంటలు వ్యాపించాయన్నారు. ఒక ప్రమాదంపై రెండు భిన్న వాదనలు అందర్నీ ఆలోచనలో పడేశాయి.

అగ్నిప్రమాదంపై గందరగోళ ప్రకటనలతో తెలంగాణ కాంగ్రెస్‌ అగ్గిమీద గుగ్గిలమైంది. అసలేం జరిగిందో తమకు తెలియాలంటూ సెక్రటేరియట్‌ బాట పట్టింది. పోలీసులు మాత్రం నేతల్ని గాంధీభవన్‌ దగ్గరే కట్టడి చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు నేతలు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

జరిగింది మాక్‌డ్రిల్‌ కాదు ఖచ్చితంగా ప్రమాదమేనన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ ప్రాపర్టీని చూసేందుకు అనుమతి ఎందుకని ప్రశ్నించారు.  నాసిరకం పనుల కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ నేతలు.

కొత్త సెక్రటేరియట్‌లో జరిగిన ప్రమాదం రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుతానికి మంటలు ఆరిపోయినా దాని వెనుక కారణమేంటన్న దానిపై క్లారిటీ రాలేదు. ఫైనల్‌గా అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారు..? ప్రభుత్వం ఏం చెబుతుంది..? విపక్షాలు ఏం చేయబోతున్నాయన్నది ఉత్కంఠగా మారింది.