
హైడ్రా అధికారులపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా అధికారులు అత్యుత్సాహం చూపిస్తూ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. “ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కొంతమంది హైడ్రా అధికారులు చేస్తున్న కుట్రగా అనుమానం కలుగుతోంది. బీఆర్ఎస్‌కు లాభం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది” అని ఆయన అన్నారు.
ఈ అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరును ప్రతిపక్షాలు బలంగా జనంలోకి తీసుకెళ్తున్నాయని జగ్గారెడ్డి అన్నారు. తక్షణమే హైడ్రా చీఫ్ రంగనాథ్ ఈ అధికారులపై దృష్టి సారించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ఓడించేందుకు కొంతమంది అధికారులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు హైడ్రా దాడుల గురించి మాట్లాడని కేటీఆర్, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రోజూ హైడ్రా జపం చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా దాడులను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ఈ అంశాన్ని తాను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. “అటువంటి అధికారుల కుట్రలకు అడ్డుకట్ట వేయాలి. ఆ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని, దీనిపై విచారణ కూడా జరపాలి” అని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌కు మద్ధతుగా పనిచేసే హైడ్రా అధికారుల వల్ల నష్టపోయిన బాధితులు ఎవరైనా ఉంటే, వారిని తాను స్వయంగా వారిని కలిసి సమస్యలను తెలుసుకుంటానని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..