Telangana: జాతియ పార్టీ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్ నుంచి స్పష్టమైన సంకేతాలు

కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని టీఆర్‌ఎస్ నేతలు పునరుద్ఘాటించారు. 8 ఏళ్ల మోదీ పాలనలో జనాలు అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు.

Telangana: జాతియ పార్టీ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్ నుంచి స్పష్టమైన సంకేతాలు
Cm Kcr
Follow us

|

Updated on: Sep 09, 2022 | 10:25 AM

CM KCR New Party: దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒక్కటే ప్రశ్న. ఇప్పుడు తెలంగాణ మాత్రమే కాదు….జాతి జనుల ఆకాంక్షలే లక్ష్యంగా తెలంగాణ గడ్డపై తొలిపొద్దు పొడవనుందా? అది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనుసన్నల్లో నడవనుందా? ఎవరు ఔనన్నా, కాదన్నా, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న తన చిరకాల స్వప్న సాకారానికి తొలి అడుగువేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగం సిద్ధం చేస్తున్నారా?. అవును… అక్షరాలా  ఔననే అంటున్నాయి తాజా పరిణామాలు. సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి రానున్నారు కేసీఆర్. హైదరాబాద్ వేదికగా పార్టీ ప్రకటన ఉండనుంది.  పార్టీ ఏర్పాటు తర్వాతే పొత్తులు, ఫ్రంట్‌లపై నిర్ణయం ఉండనుంది. ఈనెల 11న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌ను కలవనున్నారు. దీంతో వడివడిగా అడుగులు పడుతున్నట్లు తాజా సంకేతాలను బట్టి తెలుస్తుంది.

జాతీయ రాజకీయాల్లోకి వద్దామా? దేశ రాజకీయాల్లో కొట్లాడదామా? ఇది నిజామాబాద్‌ సభావేదిక నుంచి తెలంగాణ రథసారథి కేసీఆర్‌ వేసిన ప్రశ్న. అంతేకాదు. చిరకాలంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కేసీఆర్‌ స్వప్న సాకారానికి వేస్తున్న తొలి అడుగుల సవ్వడి సందేశం. వచ్చే ఎన్నికల తర్వాత ఢిల్లీ గద్దెపై రెపరెపలాడేది బీజేపీ జెండా కాదు. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక బీజేపీని తరిమికొట్టాలంటూ కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు తెలంగాణ ముఖ్యమంత్రి భవిష్యత్‌ ఎజెండాని ఖరారు చేసేసింది. జాతీయ రాజకీయాల్లో ఇక మనం చక్రం తిప్పే దశ ఒచ్చిందంటూ తెగేసి చెప్పారు కేసీఆర్‌. కేసీఆర్‌ ప్రశ్నలకు గులాబీ జెండా రెపరెపల్లోనుంచి జనం ముక్తకంఠంతో ఔనన్న సమాధానం వచ్చింది. మీ అంగీకారంతో మున్ముందుకు సాగుతానంటూ తెలంగాణ నేత ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. సర్వస్వం త్యాగం చేసి, తెలంగాణని నిర్మించుకున్న మనం ఇక తగ్గేదేలేదంటూ కేసీఆర్‌ ఇచ్చిన సందేశంలోని అంతరార్థం రాష్ట్ర ప్రజలకే కాదు, జాతీయస్థాయిలోని రాజకీయవర్గాలకూ స్పష్టమైన సూచననే చేసింది.

ఒకనాడు హైదరాబాద్‌ కేంద్రంగా ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫ్రంట్‌ రాజకీయాలకు పురుడుపోశారు. ఇప్పుడు అదే ఎన్టీఆర్‌ రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కేసీఆర్‌ జాతీయ రాజకీయాలవైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. మొదట్లో రాష్ట్ర రాజకీయాల ప్రయోజనం కోసం బీజేపీకి అనుకూలంగా మెలిగిన కేసీఆర్‌, కేంద్రం ఆధిపత్యాన్ని సహించలేని స్థితికి వచ్చారు. మరోవైపు దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయాల కొరత కేసీఆర్‌లోని వాడివేడి యోచనలను మరింత వేగవంతం చేసింది. అదిప్పుడు కార్యరూపం దాల్చుతోంది. మోదీ సర్కార్‌తో తెగతెంపులకు సిద్ధమైన కేసీఆర్‌ అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. హైదరాబాద్‌ వేదికగా జాతీయ పార్టీ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే తెలంగాణ గడ్డనుంచే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమౌతున్నారు.