ఈ రెండు ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం.. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై కేసీఆర్‌ సమీక్ష

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి , అలాగే డిండి ప్రాజెక్టు పనులను వచ్చే ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారు..

  • Subhash Goud
  • Publish Date - 9:49 pm, Sat, 23 January 21
ఈ రెండు ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం.. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై కేసీఆర్‌ సమీక్ష

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి , అలాగే డిండి ప్రాజెక్టు పనులను వచ్చే ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై శనివారం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంప్‌ హౌస్‌లు, జలాశయాలు, కాల్వలు, సొరంగ మార్గాల పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. బిల్లుల చెల్లింపుల కోసం తక్షణమే రూ.2వేల కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును కేసీఆర్‌ ఆదేశించారు. నిర్వాసితులకు చట్టప్రకారం పరిహారం అందించి భూ సేకరణ పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కాగా, పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్నారు.

కల్వకుర్తి, బీమా, కోయిల్‌ సాగర్‌, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు, జూరాలతో మరో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని కేసీఆర్‌ అన్నారు. కాగా, రాష్ట్రం ఏర్పాటైనప్పుడు కేవలం 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేదని, ఇప్పుడు 1.10 కోట్ల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అన్నారు. ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఫ్లోరైడ్‌, వర్షాభావ పరిస్థితులు ఉన్న నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని కేసీఆర్‌ అధికారులకు సూచించారు. బీహెచ్‌ఈఎల్‌ అధికారులతో సమావేశమై అవసరమైన మోటార్లను వెంటనే తెప్పించి బిగింగి పనులను పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్ణు కేసీఆర్‌ ఆదేశించారు.

Also Read: పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రం.. మౌలిక సదుపాయాలకల్పనలో దేశానికే ఆదర్శంః మంత్రి కేటీఆర్