Mancherial Politics: ‘గత కొంతకాలంగా మా ఎంపీ కనిపించడం లేదు. మీకేమైనా కనిపించాడా?’ అంటూ బీజేపీ నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. సంక్షేమ కార్యక్రమాల సభలకు తప్ప.. నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదంటూ ఆరోపించారు. పెద్దపల్లి ఎంపీగా ప్రజలు బోర్లకుంట వెంకటేశ్‌ను ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపించడం లేదట. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ మంచిర్యాలలో బీజేపీ, బీజేవైఎం నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ నేత ఫోటోలను పట్టుకుని బీజేపీ, బీజేవైఎం నాయకులు ఆందోళనలు చేపట్టారు. రోడ్డుపై వెళ్తున్న వారిని ఆపి మరీ ఎంపీ ఫోటో చూపిస్తూ ఈయన ఎక్కడైనా కనిపించారా? అంటూ ఆరా తీశారు.
ఎంపీ వెంకటేష్ ఫోటో చూపిస్తూ ఈయన మీకు తెలుసా? ఎక్కడైనా చూశారా? గుర్తు పట్టగలరా? అంటూ నియోజకవర్గం పరిధిలోని జనాలను ఆరా తీశారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా.. చివరకు పోలీసులను ఆశ్రయించారు బీజేపీ నేతలు. తమ ఎంపీని కనిపెట్టి తీసుకురావాలంటూ మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ నేతలు.. ఎంపీ తీరుపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గం ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అభివృద్ధిపై దృష్టి పెట్టని ఈ ఎంపీ తమకొద్దంటూ వ్యాఖ్యానించారు. కాగా, ఎంపీ మిస్సింగ్ అంటూ మంచిర్యాలలో బీజేపీ నేతలు చేపట్టిన నిరసన పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
Also read: