Telangana : కర్మ భూమిలో పూసిన పూలు, కాళ్ల పారాణితో కాటిబాటపట్టిన పెళ్లికూతుళ్లు..మొన్న సృజన, నేడు లక్ష్మీ..

Telangana : కర్మ భూమిలో పూసిన పూలు, కాళ్ల పారాణితో కాటిబాటపట్టిన పెళ్లికూతుళ్లు..మొన్న సృజన, నేడు లక్ష్మీ..
Mbnr Bride Sucide

మొన్నటి విశాఖ నవవధువు సృజన ఘటన ఇంకా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఆ ఘటన మర్చిపోకముందే మరో విషాదం..

Jyothi Gadda

|

May 14, 2022 | 4:02 PM

కోటి ఆశలతో ప్రయాణం..కాళ్ల పారాణి ఆరనేలేదు. పెళ్లి బాజాలు మోగిన శబ్దాలు ఆగిపోనేలేదు. అంతే.. పెళ్లి చప్పుళ్లు మోగిన చోట..చావు డప్పు వినిపించింది. మూడుముళ్ల బంధం ముడిపడిందన్న ఆనందం.. గంటలు కూడా నిలవలేదు. అంతలోనే అనుకోని సంఘటన జరిగింది. మొన్నటి విశాఖ నవవధువు సృజన ఘటన ఇంకా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఆ ఘటన మర్చిపోకముందే మరో విషాదం.. మొన్న తాళికట్టేందుకు కొద్ది నిమిషాల ముందు నవ వధువు చనిపోతే… నిన్న పెళ్లయిన కొన్ని గంటలకే వధువు ఆత్మహత్య చేసుకుంది. విశాఖ సృజన బ్యాగ్‌లో గన్నేరు పప్పు దొరకడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆమె బాడీలో విషపదార్థం ఉన్నట్లు వైద్యులు గమనించారు. పెళ్లి ఇష్టం లేకనే సృజన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పోస్ట్‌మార్టం నివేదిక పంపిన వైద్యులు రిపోర్ట్ వచ్చేందుకు 2 వారాలు పట్టొచ్చని అంటున్నారు.

ఇష్టం లేని పెళ్లి చేశారని అప్పగింతలు కాకముందే నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం నింపింది. స్ధానికంగా కూలిపని చేసుకుంటూ జీవించే గుజ్జుల పద్మ పెద్ద కుమార్తె లక్ష్మి..టెన్త్‌ వరకూ చదివి ఇంటి వద్దే ఉంటోంది. అనంతపురం జిల్లాకు చెందిన మల్లికార్జున్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. పెళ్లి సంబంధం తనకు ఇష్టం లేదని తల్లికి చెప్పింది లక్ష్మి. అయినా పెద్దలు వినలేదు. మే 13న ఉదయం 9గంటలకు వివాహమైంది. సాయంత్రం అప్పగింతలకు ముందే నవ వధువు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెళ్లికి ముందు వరుడితో కలిసి ఆనందంగా డ్యాన్స్‌ చేసింది. అతనితో కలిసి ఎంతో హుషారుగా స్టెప్పులేసింది. అది చూసిన వారంతా అమ్మాయి సంతోషంగానే పెళ్లికి అంగీకరించిదని అనుకున్నారు. కానీ, అంతలోనే ఇంతటి దారుణానికి ఒడిగడుతుందని ఎవరూ ఊహించలేదు.

వివాహమైన కాసేపటికే బాత్‌రూమ్‌లోకి వెళ్లి క్రిమి సంహారక మందు తాగేసింది. అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయింది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు..వెళ్లి చూస్తే.. ఉలుకుపలుకు లేకుండా అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే లక్ష్మి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లోని బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా కారు చీకట్లు అవహించాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu