New Bars: తెలంగాణలో కొత్త‌గా 159 బార్లకు గ్రీన్ సిగ్న‌ల్‌.. జిల్లాల వారీగా నోటిఫికేష‌న్లు విడుద‌ల‌

New Bars: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మ‌రికొన్ని బార్లు ఏర్పాటుకు ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. నూత‌నంగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్‌ల‌లో...

  • Subhash Goud
  • Publish Date - 5:33 am, Tue, 26 January 21
New Bars: తెలంగాణలో కొత్త‌గా 159 బార్లకు గ్రీన్ సిగ్న‌ల్‌.. జిల్లాల వారీగా నోటిఫికేష‌న్లు విడుద‌ల‌

New Bars: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మ‌రికొన్ని బార్లు ఏర్పాటుకు ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. నూత‌నంగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్‌ల‌లో బార్ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వుల‌ను అనుస‌రించి అన్ని జిల్లాల ఎక్సైజ్ సూప‌రింటెండెంట్లు సోమ‌వారం కొత్త బార్ల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తూ నోటిఫికేష‌న్‌లు ఇచ్చారు. రాష్ట్రంలో 7 కార్పొరేష‌న్లు, 62 మున్సిపాలిటీల‌ను కొత్త‌గా ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. వీటిలో కొత్త బార్ల‌ను ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ ఎప్ప‌టి నుంచో ఉంది. ఈ నేప‌థ్యంలో వివ‌రాలు సేక‌రించిన ఎక్సైజ్‌శాఖ‌.. 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో ఏర్పాటు చేయాల్సిన బార్ల సంఖ్య‌ను వెల్లడించింది. మొత్తం 159 కొత్త బార్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

కాగా, రాష్ట్రంలో ఇప్ప‌టికే 1052 బార్లు ఉండ‌గా, కొత్త‌వాటితో క‌లిపి మొత్తం 1211కు చేరనుంది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 400పైగా బార్లు ఉండ‌గా, మ‌రో 55 కొత్త బార్లు ఏర్పాటు కానున్నాయి. ఇక ఉమ్మ‌డి జిల్లాల వారీగా చూస్తే.. వ‌రంగ‌ల్ 4, కరీంన‌గ‌ర్ 6, నిజామాబాద్ 16, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 10, మెద‌క్ 11, ఖ‌మ్మం 4, న‌ల్గొండ 13, రంగారెడ్డి 8, జీహెచ్ఎంసీ చుట్టుప‌క్క‌ల 19 బార్ల ఏర్పాటుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ మేర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తూ జిల్లా ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ సోమ‌వారం నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఫిబ్ర‌వ‌రి 8వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక బారుకు ఒక‌టి కంటే ఎక్కువ ద‌ర‌ఖాస్తులు వ‌స్తే జిల్లాల్లో క‌లెక్ట‌ర్లు, జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఎక్సైజ్ డైరెక్ట‌ర్ స‌మ‌క్షంలో ల‌క్కీ డ్రా తీయ‌నున్నారు. నాన్ రీఫండ‌బుల్ ద‌ర‌ఖాస్తు ఫీజును రూ.1 ల‌క్ష‌గా నిర్ణ‌యించారు.

ల‌క్కీ డ్రా

కాగా, జిల్లాల్లో ఫిబ్ర‌వ‌రి 10న, జీహెచ్ఎంసీ ప‌రిధిలో 11న ల‌క్కీ డ్రా తీయ‌నున్నారు. ఎంపికైన ద‌ర‌ఖాస్తుదారుల‌కు ఫిబ్ర‌వ‌రి 17న ప్రొవిజ‌న‌ల్ లైసెన్స్‌లు జారీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 90 రోజుల్లోగా ద‌ర‌ఖాస్తుదారులు బార్ ఎక్సైజ్‌ట్యాక్స్‌లో మూడోవంతు చెల్లించాల్సి ఉంటుంది.

Telangana Cop: ఇద్ద‌రు ప్రాణాల‌ను కాపాడిన సీఐకి రాష్ట్ర‌ప‌తి అవార్డు… ప్ర‌క‌టించిన కేంద్ర హోం శాఖ‌…