టార్గెట్ కరీంనగర్…

Telangana Political Parties target Karimnagar district, టార్గెట్ కరీంనగర్…

ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఉత్తర తెలంగాణ పొలిటికల్ గేట్ వే. ఇక్కడ రాజకీయంగా పట్టు సాధించేవారే అధికారంలోకి వస్తారనే పేరుంది. అక్కడ పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఉమ్మడి కరీం నగర్ జిల్లాలో గతంలో కాంగ్రెస్ కు మంచి పట్టుంది. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్ జిల్లాలో పైచేయి సాధించింది. కానీ గత రెండుసార్లు ఎన్నికల్లో ఇక్కడ ఒక్క సీటుకే పరిమితమైంది.  కాంగ్రెస్ పార్టీ కంచుకోట మరి రాబోయే రోజుల్లో బలోపేతమవుతుందా.. లేదా అనేది పెద్ద ప్రశ్న.

కరీంనగర్ జిల్లాలో బీజేపీకి పట్టుంది. విద్యాసాగర్ రావు ఇక్కడినుంచే ఎంపీగా గెలిచారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బండి సంజయ్ బీజేపీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఎంపీ ఎన్నికల్లో గెలుపుతో ఇక్కడ పాగా వేసేందుకు ఉమ్మడి జిల్లాపై కమలనాధులు ఫోకస్ పెట్టారు. నెలకో కీలక నేత జిల్లాలో పర్యటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవాలని ప్లాన్లు వేస్తున్నారు.

ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ అడ్డా. 2014 నుంచీ.. మొత్తం 13 సీట్లలో 12 సీట్లు గెలుస్తూ కారు పార్టీ తన హవా చాటుతోంది. అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కారు కాస్త కుదుపులకు గురైంది. కరీంనగర్ ఎంపీ సీటు కోల్పోవడంతోపాటు నిజామాబాద్ ఎంపీ సీటు పరిధిలోని జగిత్యాల, కోరుట్లలో కూడా పట్టు కోల్పోయింది.

దాంతో మున్సిపల్ ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ హై కమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నాలుగు మంత్రి పదవులు కట్టబెట్టింది. ఇప్పటికే ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ మంత్రులు కొనసాగుతుండగా… తాజాగా కేటీఆర్, గంగుల కమలాకర్ కు అమాత్య పదవులు దక్కాయి. తమ అడ్డాలో ఇతర పార్టీలకు స్థానం లేకుండా చేయాలనే ఉద్దేశంతో నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని తెలుస్తోంది. మొత్తానికి ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ జిల్లాలో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *