జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఆఖరి మజిలీ.. నగరంలోని పలు ప్రాంతాల్లో కేటీఆర్ రోడ్ షోలు

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూలు వెలువడింది లగాయితూ గ్రేటర్ హైదరాబాద్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్..

  • Venkata Narayana
  • Publish Date - 9:10 pm, Sun, 29 November 20
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఆఖరి మజిలీ.. నగరంలోని పలు ప్రాంతాల్లో కేటీఆర్ రోడ్ షోలు

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూలు వెలువడింది లగాయితూ గ్రేటర్ హైదరాబాద్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన ఇవాళ కూడా కేటీఆర్ నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించి టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. వివిధ నగర కూడళ్లలో స్టేజ్ లు మీద సాంస్కృతిక కార్యక్రమాలతో తెలంగాణ సర్కారు ఈ ఆరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో పాటలు, ప్రదర్శనల రూపంలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ రోడ్ షో లైవ్ అప్డేట్స్ మీకోసం..

అబద్దపు ప్రచారాలకు ఆగం కావొద్దు, ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలే.. తమ నినాదం విశ్వనగరం. వాళ్ల విధానం విద్వేష నగరం, టీఆర్ఎస్‌కే మీఓటు : కేటీఆర్

కేంద్రంలోని బీజేపీ నేతలు వచ్చి హైదరాబాద్ లో చేస్తున్న అబద్దపు ప్రచారాలకు ప్రజలు ఆగం కావొద్దన్నారు కేటీఆర్. విషయం లేనివాళ్లే విషం చిమ్ముతారన్నారాయన. “హిందు, ముస్లిం, సిక్కులు కలిసి ఉండొద్దు వారికి. ఆంధ్రా-తెలంగాణ పంచాయితీలు లేవు. ఇట్లుంటే వాళ్లకు ఓట్లు వస్తయ్‌. అందుకే ఇది కూలగొడతం, అది కూలగొడతం అంటున్నరు. తామేమో డ్రైనేజీలు కడతం, రోడ్లు కడతం, చెరువులు బాగుచేస్తం, లైట్లు బాగుచేస్తం, పిల్లలకు కొలువులు వచ్చేలా చూస్తాం, సీసీ కెమెరాలు పెడతామంటుంటే.. వాళ్లేమో కూలగొడతం అంటున్నరన్నారు.” కావున హైదరాబాద్ ప్రజలు ఆలోచించాల్సిందిగా కేటీఆర్ కోరారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మరోసారి బల్దియాలో గులాబీజెండా ఎగురవేసేందుకు సాయపడాలని ఆయన హైదరాబాద్ ఓటర్లకు పిలుపునిచ్చి తన గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని కేటీఆర్ ముగించారు.

నగరానికి వస్తున్న ఢిల్లీ రాజకీయ టూరిస్టులకు వెల్‌కం.. కానీ, వరద సాయం తెస్తరేమో అని ఎదురుచూశాం. ఒక్కరంటే ఒక్కరూ తేలే: కేటీఆర్

నగరానికి వస్తున్న ఢిల్లీ టూరిస్టులకు వెల్‌కం. కానీ వస్తూ వస్తూ వరద సాయం తెస్తరేమో అని ఎదురుచూశాం. ఒక్కరంటే ఒక్కరూ కూడా ఈ విషయంలో స్పందించలేదని కేటీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ వరదల భారిన పడినవారిలో ఇప్పటికే 6 లక్షల 64 వేల కుటుంబాలకు సాయం అందించాం.. మిగతావారిని డిసెంబరు 7 నుంచి ఆదుకుంటామన్నారు కేటీఆర్. కాంగ్రెస్‌ ఇచ్చిన ఐటీఐఆర్‌ను బీజేపీ రద్దు చేసి ఇవాళ ప్రపంచంలో మేటి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని అమిత్‌ షా అంటే నమ్మడానికి ఇక్కడ సిద్ధంగా ఎవరూ లేరన్నారు. తమది నిజాం సంస్కృతి అంటున్నరు. కానీ హైదరాబాద్‌ సంస్కృతి గాంధీ-జమునా తెహజీబ్‌ అని 1920లోనే మహాత్మాగాంధీ చెప్పిన విషయాన్ని ఒక్కసారి చూడాలన్నారు కేటీఆర్.

హైదరాబాద్‌కు మంజూరైన ఐ.టీ.ఐ.ఆర్‌ ప్రాజెక్టును రద్దు చేసి.. ఇప్పుడు తిరిగి నగరాన్ని ఐటీ హబ్‌గా మారుస్తారట.! ఇంతటి చిత్రం ఎక్కడైనా ఉందా? : కేటీఆర్

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం నగరానికి విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు తన రోడ్ షోలలో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు కేటీఆర్. “జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రప్పిస్తే.. హైదరాబాద్‌ నగరాన్ని ఐటీ హబ్‌గా మారుస్తామని అంటున్నారు అమిత్ షా.. అయితే, కాంగ్రెస్‌ హయాంలో హైదరాబాద్‌కు మంజూరైన ఐ.టీ.ఐ.ఆర్‌ ప్రాజెక్టును ఎందుకు రద్దు చేశారు.. ఇప్పుడు తిరిగి మళ్లీ నగరాన్ని ఐటీ హబ్‌గా మారుస్తామని బీజేపీ నాయకులు అంటున్నరు. ఇంతటి చిత్రం ఎక్కడైనా ఉందా?” అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రేటర్‌ అభ్యర్థులకు మద్దతుగా పాటిగడ్డ, శాంతినగర్లో నిర్వహించిన రోడ్‌షో లో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బేగంపేట డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి మహేశ్వరి, మోండా మార్కెట్‌ నుంచి ఆకుల రూప, రాంగోపాల్‌పేట నుంచి అరుణ, అమీర్‌పేట నుంచి శేషు కుమారి, బన్సీలాల్‌పేట నుంచి హేమలత, సనత్‌నగర్‌ నుంచి కొలను లక్ష్మిబాల్‌రెడ్డి లను భారీ మెజార్టీతో గెలిపించి బల్దియాకు పంపాల్సిందిగా కేటీఆర్ కోరారు.

గండిపేట కట్టి వందేళ్లయింది.. హైదరాబాద్ ప్రజల మంచినీటికోసం మరో రిజర్వాయర్ కట్టాలన్న ఆలోచన ఎవరైనా చేశారా? : కేటీఆర్

హైదరాబాద్ కోసం ఈ ఆరేళ్లలో ఎంతో కష్టపడి పనిచేశామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గండిపేట వందేళ్ల కిందట కడితే, ఇప్పటివరకూ ఏ నాయకుడు హైదరాబాద్ తాగునీటి కోసం మరో రిజర్వాయర్ కట్టాలన్న ఆలోచనచేయలేదన్నారు. అయితే, మన కేసీఆర్ ఆలోచనమేరకు కేశవాపురంలో గండిపేట కంటే రెట్టింపు సైజులో మరో రిజర్వాయర్ కడుతున్నామని కేటీఆర్ చెప్పారు. ఎల్లుండి నుంచి మంచినీటి బిల్లుకట్టే అవసరమేలేదని చెప్పారు కేటీఆర్. పేదవాడికి ఐదురూపాయలకే నాణ్యమైన భోజనం హైదరాబాద్ లో పెడుతున్నామని కేటీఆర్ చెప్పారు. సికింద్రాబాద్ పరిధిలో నిర్వహించిన రోడ్ షో లో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? : కేటీఆర్

వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ కు వరదలు వచ్చినప్పుడు మంత్రులతో కలిసి నగరంలో తిరిగామని కేటీఆర్ చెప్పారు. వరద సాయం చేస్తే టీఆర్ఎస్‌కు పేరు వస్తుందని ఆపారంటూ విపక్షాలపై విమర్శలు చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్కి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు. కేంద్రం మనకిచ్చిన దాని కంటే.. మనమే ఎక్కువ ఇచ్చాం అని కేటీఆర్ తెలిపారు. గోషామహల్‌ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. హైదరాబాద్‌లో ఎలాంటి గొడవలు, కర్ఫ్యూలు లేవు. హైదరాబాద్‌లో మంచి వాతావరణం ఉంది కాబట్టే.. భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌గా చేసే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్లు అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

బండి సంజయ్ బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడా.. లేక ఇన్సూరెన్స్ ఏజెంటా..? కేటీఆర్

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించడం ఖాయమని.. వందకు పైగా సీట్లను గెలుస్తామని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జుమ్మెరాత్ బజార్ లో ఆదివారం రోడ్ షో నిర్వహించారు. కులమతబేధాలు పక్కనపెట్టి అభివృద్ధే ఏకైక ఎజెండాగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ కే ఓటేయాలని ఆయన నగర ప్రజలను కోరారు. ఇటీవల వచ్చిన వరదలతో హైదరాబాద్ అల్లాడితే కేంద్రం పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. ఢిల్లీ నుంచి వచ్చే వారు ఇక్కడి ఇరానీ చాయ్ తాగి, బిర్యానీ తిని వెళ్లాలని, తెలంగాణకు కేంద్రం బాకీ ఉందన్న విషయాన్ని ఢిల్లీ నేతలు మర్చిపోవద్దని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా వ్యవహరించడం లేదని, ఇన్సూరెన్స్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

తెల్లారిలేస్తే ఒక్కరినొక్కరు అనుమానంతో చూసుకునేది వాళ్లకి కావాలి : కేటీఆర్

సనత్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తోన్న కార్పొరేటర్ అభ్యర్థులు మహేశ్వరి, శేషుకుమారి, అరుణ, హేమలత, రూప ను మంచి మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను కోరారు. ప్రజల మధ్య, కులాల మధ్య చిచ్చురేపి ఓట్లు కొల్లగొట్టాలని ఆ మతఛాందస పార్టీలు చూస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఇద్దరు మతపిచ్చోళ్లను తరిమితరిమి కొట్టాలని బీజేపీ, ఎంఐఎం నేతలను ఉద్దేశించి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్ ను వర్షాలు, వరదలు ముంచెత్తితే రాని వీళ్లు.. ఓట్ల కోసం మాత్రం ఇప్పుడు గుంపులు గుంపులుగా వస్తున్నారు: కేటీఆర్

హైదరాబాద్ ను వర్షాలు, వరదలు ముంచెత్తితే రాని వీళ్లు ఓట్ల కోసం మాత్రం ఇప్పుడు గుంపులు గుంపులుగా వస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. సనత్ నగర్ లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మరో మంత్రి తలసానితో కలిసి ప్రసంగించారు. హైదరాబాద్ లో హిందువులు, ముస్లింలు కలిసుండొద్దన్నదే వాళ్ల ఉద్దేశ్యమని బీజేపీ పెద్దల్ని కేటీఆర్ విమర్శించారు.