తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఈ నెలాఖరులోనే..?

తెలంగాణలో మరోసారి పోలింగ్ పండుగ రాబోతుంది. ఈ నెలాఖారులోగా మున్సిపల్ ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా రెడీ అయినట్టుగా తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 15 లేదా 16వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసి, జూలై 30 లేదా 31వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది ఎలక్షన్ కమిషన్. ఆగస్టు 2న ఓట్ల లెక్కింపు, 4న కొత్త పాలకమండళ్లు కొలువుదీరేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదట వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు జరపాలని భావించినా ఈ నెలాఖరుకల్లా దీన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి వార్డుల వారీగా ఓటర్ల తుదిజాబితాను ఈ నెల 14 నాటికి ప్రకటించే దిశగా సవరించిన నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేసింది.

ఈ నెల 13 తేదీలోపు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసి జాబితాను ఎస్‌ఈసీకి అందజేసేందుకు మున్సిపల్‌ శాఖ ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఒకే దశలో రాష్ట్రంలో ఉన్న మొత్తం 129 మున్సిపాలిటీల్లో, మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. గత 2014లో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగగా.. ఈసారి బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరగనున్నాయి.

మరోవైపు మున్సిపోల్స్‌కు సంబంధించి ఇప్పటికే ఆయా శాఖల అధికారులు చర్చలు జరిపారు. సోమవారం వివిధ రాజకీయ పక్షాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమై సూచనలు సలహాలు స్వీకరించనుంది. అటు తర్వాత మరో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా సమావేశాన్ని నిర్వహించి జిల్లాల వారీగా యంత్రాగాన్ని సిద్ధం చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *