బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణకు మొండిచెయ్యి…

, బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణకు మొండిచెయ్యి…

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు పెద్దగా కేటాయింపులేమీ జరగలేదని రాష్ట్రానికి చెందిన రాజకీయ నేతలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి చెప్పుకోదగ్గ కేటాయింపులు లేవని అసహనానికి గురవుతున్నారు. దీంతో కేంద్రం తెలంగాణాకు మొండి చెయ్యి ఇచ్చిందనే భావన వ్యక్తం అవుతుంది . తెలంగాణా ప్రజలు ఎదురు చూస్తున్న కనీస కేటాయింపులు కూడా లేకుండా కేంద్ర బడ్జెట్ ఉందని తెలంగాణా రాష్ట్ర ఎంపీలు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక బడ్జెట్‌ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాళేశ్వరానికి జాతీయ హోదా లేనట్లే…

నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎక్కడా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తావన రాలేదు. బడ్జెట్‌ కసరత్తులో భాగంగా రాష్ట్రాల ప్రతిపాదనలు, సూచనలు తీసుకొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో జూన్‌ 21… ప్రీ బడ్జెట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని.. ప్రభుత్వం తరఫున ఈ భేటికీ హాజరైన ఆర్థిక వ్యవహారాల ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కోరారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.80 వేల కోట్లు ఖర్చవుతున్నాయని, వాటిలో అధిక భాగం కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా సమీకరించిన అప్పులేనని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు.
అంతేగాక.. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధాని మోదీని కలసి విజ్ఞప్తి చేశారు. కానీ 2019-20 బడ్జెట్‌లో కేంద్రం ఒక్క రూపాయిని కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటాయించలేదు. దీంతో ఇక ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా లేనట్లేనని తెలుస్తోంది.

మిషన్ భగీరథ కాపికొట్టారు… కానీ…

తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటా తాగు నీరు కోసం చేపట్టిన కార్యాక్రమం మిషన్ భగీరథ. అయితే ఈ పథకాన్నిస్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా జలశక్తి పథకాన్ని కేంద్ర ప్రవేశపెట్టిందని టీఆర్ఎస్ నేతలు అన్నారు. అయితే పథకాన్ని కాపీ కొట్టారు కానీ.. పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు డబ్బులు అడిగితే మొండిచెయ్యి చూపారని మండిపడుతున్నారు.

నీతి ఆయోగ్ చెప్పినా.. పక్కన పెట్టిన కేంద్రం..

రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు 19,500 కోట్ల రూపాయలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి విన్నవించుకున్నా.. కేంద్రం పట్టించుకోలేదు. గతంలో నీతి ఆయోగ్‌ కూడా ఈ పథకం అద్భుతమని ప్రశసించి నిధులివ్వాలని కేంద్రానికి సిఫారసు కూడా చేసింది. అయినా నీతి ఆయోగ్‌ సిఫారసులను, ప్రశంసలను కేంద్రం పక్కనపెట్టింది. అంతేగాక మిషన్‌ కాకతీయ పథకానికి కూడా 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా ఈ పథకం గురించి కూడా కేంద్రం పట్టించుకోలేదు.

పసుపు బోర్డు లేనట్టే..

ఇక నిజామాబాద్‌లో పసుపు బోర్డుకు నిధుల కేటాయింపుపై కూడా ఎలాంటి ప్రతిపాదనలు లేవు. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేసిన ధర్మపురి అరవింద్.. కవితపై గెలుపొందారు. దీనికి ముఖ్యకారణం పసుపు రైతుల ఆందోళనలే. అయితే పసుపు బోర్డు తప్పనిసరిగా తీసుకోస్తానంటూ అరవింద్ చేసిన వాగ్ధానాలతోనే ఇక్కడ విజయం బీజేపీ గెలుపొందిందని జిల్లా రాజకీయా నేతలు అంటున్నారు. కానీ బడ్జెట్‌లో పసుపు బోర్టు ప్రస్తావన రాకపోవడం విచారకరమని అంటున్నారు. దీనిపై స్పందించడానికి ఎంపీ అరవింద్ ఇప్పుడు అందుబాటులో కూడా రావడంలేదని మండిపడుతున్నారు.

పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనివి కూడా కేటాయించలేదు : మంత్రి నిరంజన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంటు, రైల్వే లైన్లు వంటి వాటికి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేయకపోవడం బాధాకరమన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ. 25 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం నిధుల కేటాయింపును విస్మరించింది. అంతేగాక డీజిల్, పెట్రోల్‌పై సర్‌చార్జీ పెంచి సామాన్యులపై కేంద్రం భారం మోపింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధాని బడ్జెట్‌లో రైతులకు నిధులు కేటాయించడంలో విఫలమయ్యారని మంత్రి అన్నారు.

మొత్తానికి బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇటు టీఆర్ఎస్ నేతలతో పాటు.. కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *