GHMC Election Results 2020 : గతమెంతో ఘనం. వర్తమానం ఆగమాగం, గ్రేటర్‌లో కాంగ్రెస్‌ ఉనికి కోసం ఆరాటపడాల్సిన దుస్థితి

గతమెంతో ఘనం. వర్తమానం ఆగమాగం. హస్తం పార్టీ విధి ఇది. గ్రేటర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం ఆరాటపడాల్సిన పరిస్థితి దాపురించింది....

GHMC Election Results 2020 : గతమెంతో ఘనం. వర్తమానం ఆగమాగం, గ్రేటర్‌లో కాంగ్రెస్‌ ఉనికి కోసం ఆరాటపడాల్సిన దుస్థితి
Follow us

|

Updated on: Dec 05, 2020 | 6:04 AM

గతమెంతో ఘనం. వర్తమానం ఆగమాగం. హస్తం పార్టీ విధి ఇది. గ్రేటర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం ఆరాటపడాల్సిన పరిస్థితి దాపురించింది. మేమూన్నామనే గుర్తింపు నిచ్చే సంఖ్య కోసం పోరాడుతోంది. ఓటరు మాత్రం చేతి గుర్తుకు చెయ్యిచ్చేశాడు. GHMC ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కంగు తినిపించాడు. జీహెచ్ఎంసీ 2020 ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం రెండంటే రెండే స్థానాలు హస్తం చేతికి చిక్కాయి. 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు రాష్ట్ర రాజధానిలో ఈ స్థాయి ఫలితాలు ఆ పార్టీ స్వయం కృతాపరాధమే అంటున్నారు విశ్లేషకులు. గత గ్రేటర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఖంగుతిన్నది. అప్పట్లోనూ కేవలం రెండు సీట్లకే ఆపార్టీ పరిమితమైంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ సమీకరణాలు మాత్రం అనూహ్యంగా మారే ఛాన్స్‌ ఉంది. అప్పుడు బీజేపీ ఇప్పటిలా లేదు. ఇప్పుడు కమలదళం అధికార టీఆర్‌ఎస్‌నే సవాల్‌ చేయగల స్థాయికి ఎదిగింది. ఈ పరిణామం కాంగ్రెస్‌కు ఏమాత్రం మంచిది కాదు. కాషాయం ఎంత కలర్‌ఫుల్‌గా మారుతుంటే.. హస్తవాసి అంతగా మసకబారడం ఖాయం. గ్రేటర్‌లో బీజేపీ పట్టు పెరుగుతున్న కొద్దీ.. కాంగ్రెస్‌ వీక్‌ అయ్యే.. క్రమక్రమంగా సైడ్‌ అయ్యే.. ప్రమాదం ఉందనేది పొలిటికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ మాట.

గ్రేటర్ నగరవాసులకు తన మ్యానిఫెస్టోలో 30 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీరు. ఫ్రీగా నల్లా కనెక్షన్‌. వరద బాధితులకు 50 వేల సాయం. ఇలా మేనిఫెస్టోలో భారీ హామీలే ఇచ్చింది కాంగ్రెస్‌. అయితే.. హస్తం పార్టీ హామీలను హైదరాబాద్‌ ఓటర్లు అస్సులు పట్టించుకున్నట్టు లేదు. అందుకే.. ఇంత తక్కువ సీట్లు. అసలు, GHMC ఎన్నికల్లో మొదట్లోనే హస్తం పార్టీ హ్యాండ్స్‌ అప్‌ అంది. 150 స్థానాలు ఉండగా.. మొత్తం సీట్లలోనూ పోటీ చేయలేని నిరుత్సాహం ఆ పార్టీది. ఫలితాల్లో రెండు–మూడు అంటూ LKG స్టూడెంట్లా నెంబర్లు లెక్కబెట్టుకోవాల్సిన దుస్థితి. పట్టుమని పది స్థానాల్లోనూ గట్టి పోటీ ఇవ్వలేక ఇబ్బంది పడింది. కలహాల కాపురమే వారి కొంప ముంచింది. తనకు తెలీకుండానే అభ్యర్థుల ఎంపిక జరిగిపోయిందంటూ గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ అన్నారంటే.. కాంగ్రెస్‌ పార్టీ పాలిటిక్స్‌ ఎంత కన్ఫ్యూజన్‌గా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. నగర అధ్యక్షుడే అసహనం వ్యక్తం చేస్తే.. ఇక కేడర్‌లో ఉత్సాహం నింపేది ఎవరు? ముందుండి నడిపించేది ఇంకెవరు? మరోవైపు, తనకు ప్రాధాన్యం లేదంటూ.. మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌ ఏకంగా పార్టీనే వీడిపోయారు. గ్రేటర్‌ ఎన్నికల సమయంలోనే ఆయన బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కు ఊహించని పరిణామమే. పెద్ద స్థాయి లీడర్లే ఇలా తమ దారి తాము చూసుకుంటే.. ఇక ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న గల్లీ లీడర్ల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? అందుకే… గ్రేటర్‌లో రోజురోజుకూ కాంగ్రెస్‌ బాగా బలహీనమవుతోంది. క్రమక్రమంగా కాంగ్రెస్‌ కేడర్‌ కాషాయంలో కలిసిపోయే ప్రమాదంకూడా పొంచి ఉంది.