ఆస్తిపన్ను బకాయిలకు ‘ఓటీఎస్‌’పై జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్‌ ప్రచారం.

గ్రేటర్‌ హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను బకాయిల వసూలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ (ఓటీఎస్‌) పేరుతో ఈ పథకాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం ఆస్తిపన్ను బకాయిలను..

  • Jyothi Gadda
  • Publish Date - 8:49 pm, Sat, 1 August 20

గ్రేటర్‌ హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను బకాయిల వసూలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ (ఓటీఎస్‌) పేరుతో ఈ పథకాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం ఆస్తిపన్ను బకాయిలను రాబట్టాలని నిర్ణయించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను బకాయి మొత్తంతో పాటు పదిశాతం వడ్డీ చెల్లిస్తే మిగతా 90 శాతం వడ్డీని మాఫీ చేసేవిధంగా జీహెచ్ పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆగస్టు 1వ తేదీనుంచి సెప్టెంబర్‌ 15వ తేదీవరకు ఈ వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ పథకం అమల్లో ఉండనుంది.

ఆస్తిపన్ను చెల్లించని యజమానులందరికీ ప్రభుత్వం కల్పించిన వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీం ప్రయోజనాలు అందించేందుకు జీహెచ్‌ఎంసీ విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తోంది. ఆగస్టు 1వ తేదీనుంచి ఈ పథకం పూర్తయ్యే సెప్టెంబర్‌ 15 వరకు 45 రోజులపాటు అందుబాటులో ఉన్న ఆస్తిపన్ను బకాయిల మొబైల్ నెంబర్లకు 90శాతం వడ్డీరాయితీ వెసులుబాటు గురించి సంక్షిప్త సందేశాలు పంపుతున్నది. వడ్డీరాయితీ ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ఎఫ్‌ఎం రేడియో జింగిల్స్, టెలివిజన్ ఛానల్స్‌లో స్క్రోలింగ్స్‌తో పాటు అన్ని సర్కిళ్లల్లోని 150 బస్ షెల్టర్లపై తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో ఫెక్సీలు ఏర్పాటు చేయిస్తుంది. అలాగే, మూడు భాషలలో కరపత్రాలు ముద్రించి ఆస్తిపన్ను బకాయిదారులకు పంపిణీ చేయనున్నారు.

మై జీహెచ్ఎంసీ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఇంటి నుండే ప్రాపర్టీ టాక్స్ బకాయిలు చెల్లింపులు జరిపేందుకు 90శాతం వడ్డీమాఫీ ప్రయోజనాలు పొందేందుకు ఆన్‌లైన్ పేమెంట్స్ ప్రక్రియను అప్‌గ్రేడ్ చేశారు. జీహెచ్‌ఎంసీ సిటిజన్ సర్వీసు సెంటర్లు, మీ సేవ కేంద్రాలతో పాటు బిల్‌కలెక్టర్లకు చెల్లింపులు చేయవచ్చు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీం అమలుపై జోనల్ కమిషనర్లు, బిల్ కలెక్టర్లను కార్యోన్ముఖులను చేస్తున్నారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీంతో నగర పరిధిలో 5 లక్షల 41వేల 10 ప్రాసర్టీల యజమానులకు ప్రయోజనం కలగనుందని అధికారులు చెబుతున్నారు.