‘కృత్రిమ మేధ’తో మరింత ముందుకు..

కృత్రిమ మేధస్సు.. మనిషి ఇప్పటివరకు కనిపెట్టిన వాటిలో గొప్ప శక్తి. అడపా, దడపా దీని గురించి వింటూనే ఉంటాం కానీ పూర్తిగా ఆర్టిఫిషియల్ గురించి ఎవరికి తెలీదు. కానీ మనకు తెలియకుండానే దైనందన జీవితంలో కృత్రిమ మేధస్సు భాగమైపోతుంది. మానవునికి ఉన్న అతి గొప్ప శక్తి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. ఇందుకు ముఖ్యమైనది మెదడు. మానవ మెదడు ఒక సూపర్‌ కంప్యూటర్‌ లాంటిదని విశ్లేషించవచ్చు. అందుకే మన ఆలోచనలకు, ఊహాశక్తికి క్రియేటివిటీకి హద్దులు ఉండవు. అదే మెదడు […]

‘కృత్రిమ మేధ’తో మరింత ముందుకు..
Follow us

|

Updated on: Apr 15, 2019 | 1:52 PM

కృత్రిమ మేధస్సు.. మనిషి ఇప్పటివరకు కనిపెట్టిన వాటిలో గొప్ప శక్తి. అడపా, దడపా దీని గురించి వింటూనే ఉంటాం కానీ పూర్తిగా ఆర్టిఫిషియల్ గురించి ఎవరికి తెలీదు. కానీ మనకు తెలియకుండానే దైనందన జీవితంలో కృత్రిమ మేధస్సు భాగమైపోతుంది. మానవునికి ఉన్న అతి గొప్ప శక్తి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. ఇందుకు ముఖ్యమైనది మెదడు. మానవ మెదడు ఒక సూపర్‌ కంప్యూటర్‌ లాంటిదని విశ్లేషించవచ్చు. అందుకే మన ఆలోచనలకు, ఊహాశక్తికి క్రియేటివిటీకి హద్దులు ఉండవు. అదే మెదడు ఒక యంత్రానికి ఉంటే ఏం జరుగుతుంది. మనం ఎలా అయితే సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామో, యంత్రం కూడా సొంతంగా ఆలోచించి చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలిగితే దాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ అంటారు.

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనేది అనేక రకాలుగా ఉంటుంది. నారో ఏఐ – దీనిని బలహీనంగా ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అని చెప్పవచ్చు. కేవలం ఒక ప్రత్యేక పని కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ఈ విధమైన అప్లికేషన్‌కు ఉదాహరణలు.. యాపిల్‌ ఫోన్‌ ‘సిరి’, మైక్రోసాఫ్ట్‌లో ‘కోర్టానా’, అమెజాన్‌కు చెందిన ‘అలెక్సా’ వంటివి. ఇవి కేవలం వాటికి అర్థమైన ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇవ్వగలవు.

ఆల్గరిధమ్‌ – కంప్యూటర్లు తమకు తెలిసిన ఆల్గరిథమ్‌ను బహిర్గతం చేస్తాయి. ఆల్గరిథమ్‌తో మనం ఏం చేయాలో కచ్చితంగా దానికి చెప్పవచ్చు. డేటా ప్రొసెసింగ్‌, కాల్కులేషన్స్‌, ఆటోమేటెడ్‌ రీజనింగ్‌ వంటి వాటి కోసం వాడవచ్చు.. ఇంకా కొన్ని ఆల్గరిథమ్స్‌ అయితే కంప్యూటర్లు వాటంతట అవే ఎలా నేర్చుకోవాలో చెప్తాయి. దీనిని మనం మెషీన్‌ లెర్నింగ్‌ అని అంటారు. మెషీన్‌ లెర్నింగ్‌ అంటే కంప్యూటర్‌ తనంతటా తాను నేర్చుకునేందుకు సహాయపడుతుంది. ఆల్గరిథమ్‌ ఉపయోగించి డేటాను వెలికితీస్తుంది.

జనరల్‌ ఏఐ – దీనిని ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ లేదా దృఢమైన ఏఐగా పేర్కొనవచ్చు. మానవ మేధస్సుతో సమస్యకు పరిష్కారాలు కనిపెట్టవచ్చు. దీని వల్ల కంప్యూటర్‌ తనంతట తాను మెరుగు పడుతుంది. చివరికి అత్యంత తెలివైనదిగా మారి మానవాతీత యంత్రంగా రూపాంతరం చెందే పరిస్థితులు ఏర్పడతాయి. మానవ తెలివి తేటలను దాటేలా ఈ తరహా యంత్రాలు తయారవుతాయి.

బీఓటీ (బోట్‌) – సులువుగా ఉన్న పనులను చేస్తుంది. ఉదాహరణకు రిజర్వేషన్లు, క్యాలెండర్‌లో ఆపాయింట్‌మెంట్లను గుర్తుచేయడం వంటివి ఈ కోవలోకి వస్తాయి.

ఇప్పటికే గూగుల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముందడుగు: మీకు బదులుగా మీ ఫోనే మీరు కోరుకున్న అపాయింట్‌మెంట్స్ ఫిక్స్ చేస్తే! చిన్న చిన్న పనులన్నీ కంప్యూటరే చేసిపెడితే! ఈ ఊహే కొత్తగా, వింతగా ఉంది కదా. కానీ ఇదెంతో దూరంలో లేదని గూగుల్‌ చెబుతోంది. డాక్టర్‌ అపాయింట్‌మెంట్, రెస్టారెంట్‌లో టేబుల్ రిజర్వేషన్ ఇలా నిత్యం ఎన్నో పనులు ఉంటాయి. ఉరుకులు పరుగుల జీవితంలో ఫోన్ చేసి వాటిని బుక్ చేయడం ఒక్కోసారి మర్చిపోతుంటాం. ఇకపై అలాంటి పనులన్నీ మీ ఫోన్ లేదా కంప్యూటరే చేసి పెడుతుందని గూగుల్ చెబుతోంది. అంటే మీ బదులు మీ గూగుల్ అసిస్టెంట్‌ ఫోన్ చేసి మీకోసం అపాయింట్‌మెంట్ బుక్ చేస్తుందన్న మాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌ సాయంతో గూగుల్ అసిస్టెంట్‌ ఈ పని చేసిపెడుతుందని ఆ సంస్థ ప్రకటించింది. ఈ టెక్నాలజీకి ‘గూగుల్ డుప్లెక్స్’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్స్ వార్షిక సదస్సులో ఈ టెక్నాలజీని పరిచయం చేశారు. ఏదైనా అపాయింట్‌మెంట్ బుక్ చేయమని గూగుల్ డుప్లెక్స్‌కు మీరు చెబితే.. దాన్ని అది పాటిస్తుంది. దీనికి సంబంధించి గూగుల్ అసిస్టెంట్ నుంచి మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అయితే, ప్రస్తుతం ఇది కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. భారతీయ భాషల్లో ఇది అందుబాటులో లేదు.

త్వరలో రోబోలే పాఠాలు చెప్పే గురువులు: సాంకేతికత పరుగులు పెడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రతి పని యంత్రాలు చేసుకుపోతున్నాయి. రోబోల ఆగమనంతో ఇది మరింత వేగం పుంజుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, పెద్ద పెద్ద కంపెనీల్లో వివిధ రకాలైన విధులు నిర్వర్తించే రోబోలు, ఇకపై పాఠశాలల్లో సందడి చేయనున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు బోధించనున్నాయి. ఈ మేరకు పరిశోధనలు పూర్తయ్యాయి. ఆస్ట్రేలియాలోని స్విన్ బర్న్ యూనివర్సిటీ రోబో విద్యపై పరిశోధనలు చేసింది. రోబో విద్య వల్ల వచ్చే ఉపయోగాలపై వీరు అధ్యయనం చేశారు. దీంతో ఎంపిక చేసిన రెండు పాఠశాలల్లో ఫ్రాన్స్ కు చెందిన ఎన్ఈవో హ్యూమనాయిడ్ రోబోలతో పాఠాలు చెప్పించనున్నారు. ఈ రోబోలు మాట్లాడగలవని, డాన్స్ కూడా చేయగలవని పరిశోధకులు చెబుతున్నారు. ఈ రోబోలతో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచనున్నట్టు వారు వెల్లడించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఉన్న సందేహాలకు ఈ రోబోలు పరిష్కారాలు సూచిస్తాయని వారు పేర్కొంటున్నారు.