
వీపు విమానం మోత మోగుతుంది అన్న మాట మనం వినే ఉంటం. అంటే విమానం అంత పెద్ద శబ్దం చేస్తుంది కాబట్టి పోలికగా ఆ మాటను వాడుతుంటారు. అయితే నాసా తయారు చేసిన ఒక విమానం మాత్రం అసలు శబ్ధం చేయకుండా సైలెంట్ గా వెళ్లిపోతుంది. భూమికి దగ్గరగా వెళ్లినా సరే.. ఆ విమానం వెళ్లిన సంగతే మనకు తెలియనే తెలియదు. వీటినే సూపర్ సోనిక్ విమానాలు అంటారు.
నగరాల్లో ఉండేవాళ్లు విమానాల రాకపోకల వల్ల చాలానే సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది. పైగా రోజురోజుకీ విమాన ప్రయాణాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే శబ్దం చేయని సూపర్ సోనిక్ విమానాలను తయారు చేసే పనిలో పడింది నాసా. నాసా తయారుచేసిన సూపర్ సోనిక్ విమానం పేరు ఎక్స్-59. ఇది ద్వనికంటే వేగంగా దూసుకెళ్తుంది. దాంతో అది వెళ్లిన చప్పుడే వినపడదు.
ద్వని కంటే వేగంగా ప్రయాణించే ఎక్స్-59 విమానం.. శబ్ద తరంగాలను అన్ని దిశలకూ వెదజల్లేలా చేసి శబ్దాన్ని తగ్గిస్తుంది. ఈ విమానాలు 75 డెసిబుల్స్ సౌండ్‌ను క్రియేట్ చేస్తాయి. ఈ విమానం ఆకాశంలో వెళ్తున్నప్పుడు.. నేల మీదున్నవారికి అసలు శబ్దమే వినపడదు. ఆ తరంగాలు చాలా చిన్నగా ఉండటంతోపాటు అన్ని వైపులకూ వ్యాప్తి చెందడమే ఇందుకు కారణమని నాసా సైంటిస్టులు చెప్తున్నారు.
ఎక్స్-59 సూపర్ సోనిక్ విమానం 55వేల అడుగుల ఎ్తతులో ప్రయాణించగలదు. దీని వేగం గంటకు 1,488 కిలోమీటర్లు ఉంటుంది. దీని బరువు 11 టన్నులు, ఎత్తు 14 అడుగులు, పొడవు 99 అడుగులు, వెడల్పు 29 అడుగులు ఉంటుంది. ఈ ఏడాది జులై 10 న దీన్ని తొలిసారి ఫ్లైట్ చేశారు. అత్యంత వేగంతో దూసుకుపోయే ఈ సూపర్ సోనిక్ విమానాలను ప్రయాణికులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని విమానయాన సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే న్యూయార్క్ నుంచి ఆరు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పారిస్ కు గంటన్నరలో చేరుకోవచ్చు. ప్రపంచంలో ఏమూల నుంచి ఏమూల కైనా ఐదారు గంటల్లో చేరుకోవచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి