చంద్రబాబు ఇంటిపై రగడ: గవర్నర్‌కి ఫిర్యాదు

TDP Leaders Complaint on YCP Government to AP Governor, చంద్రబాబు ఇంటిపై రగడ: గవర్నర్‌కి ఫిర్యాదు

ఏపీలో డ్రోన్ల వివాదం ఇంకా సద్దుమణగలేదు. కృష్ణా నది కరకట్ట మీద ఉన్నమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పరిసరాలను డ్రోన్లతో విజువల్స్‌ తీయడం వివాదంగా మారింది. జడ్‌ ప్లస్‌ కేటగిరి రక్షణలో ఉన్న చంద్రబాబు భద్రతకు ప్రమాదం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలుగుదేశం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్‌ భిశ్వభూషణ్‌ హరించందన్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. చంద్రబాబు నివాసంపై డ్రోన్ల ఎగరడాన్ని తప్పుపడుతూ తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు.

ప్రకాశం బ్యారేజ్‌ బ్యాక్‌ వాటర్‌ కారణంగా గుంటూరు జిల్లా ఉండవల్లి వెంట ఉన్న నదీ తీరం నీరు కరకట్ట మీద ఉన్న ఇళ్ళను తాకింది. దీంతో వరద ముంపును అంచనా వేయడానికి ఇరిగేషన్‌ శాఖ డ్రోన్లతో విజువల్స్‌ తీయించింది. డ్రోన్లతో షూటింగ్‌ చేస్తున్న వ్యక్తిని టీడీపీ నేతలు పట్టుకున్న తర్వాత ప్రభుత్వమే వరద అంచనా కోసం విజువల్స్‌ తీయించిందని ఇరిగేషన్‌ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. అయినప్పటికి సమాచారం ఇవ్వకుండా డ్రోన్లతో ఎలా షూట్‌ చేయిస్తారని తెలుగుదేశం నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు.

చంద్రబాబుపై కక్షతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలుగుదేశం ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే డ్రోన్ల వ్యవహారంపై గుంటూరు రేంజ్‌ IGకి ఫిర్యాదు చేశారు. మంత్రులు, వైసీపీ నాయకులు కూడా టీడీపీపై అదే రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు. కరకట్ట మీద అక్రమంగా కట్టిన ఇంట్లో గతంలో ముఖ్యమంత్రిగాను… ఇప్పుడు కేబినెట్‌ ర్యాంక్‌ ఉన్న ప్రతిపక్ష నేతగానూ చంద్రబాబు ఎలా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు భద్రతతో ప్రభత్వం ఆటలాడుతోందనే ఆరోపణలపై.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు తెలుగుదేశం నాయకులు. కాగా.. మొత్తం మీద ఈ డ్రోన్ల యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *