అయోధ్య కేసుపై సుప్రీం సంచలన నిర్ణయం

Ayodhya Ram Mandir Case Update, అయోధ్య కేసుపై సుప్రీం సంచలన నిర్ణయం

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో ఆగస్టు 6 నుంచి సర్వోన్నత న్యాయస్థానం రోజువారీ విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణను నిర్ణీత గడువులోపు పూర్తిచేసేందుకు మరో గంట ఎక్కువ పనిచేస్తామని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. వచ్చే సోమవారం రోజున సాయంత్రం 5 గంటల వరకు వాదనలు వింటామని వెల్లడించింది.

‘సెప్టెంబరు 23వ తేదీన మరో గంటసేపు కూర్చుంటాం. ఆ రోజు వాదనలు సాయంత్రం 5 గంటల వరకు వింటాం’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం హిందూ, ముస్లిం పార్టీల తరఫు న్యాయవాదులకు తెలిపింది.

ఈ విచారణను అక్టోబరు 18లోగా ముగించాలని ఇటీవల న్యాయస్థానం నిర్ణయించింది. అవసరమైతే మధ్యవర్తిత్వం ప్రక్రియను కూడా పునఃప్రారంభించుకోవచ్చని సూచించింది. సుప్రీంకోర్టు చెప్పిన గడువులోగా వాదనలు ముగిస్తే నవంబరు మధ్యలో తీర్పు వెలువడే అవకాశముంది.

అక్టోబరు 18 నాటికి హిందూ, ముస్లిం పార్టీలకు చెందిన లాయర్లు తమ వాదనలు పూర్తిచేయాలని జస్టిస్ ఎస్ఏ బాబ్డ్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌‌లు సూచించారు. అయోధ్య కేసులో సుప్రీం నియమించిన మధ్వవర్తిత్వ కమిటీ నాలుగు నెలలు పాటు వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపినా, ఎలాంటి పరిష్కారం చూపించలేకపోయింది. తొలుత ఈ కమిటీకి ఎనిమిది వారాల గడువు విధించిన సుప్రీం, తర్వాత ఆగస్టు 15 వరకు పొడిగించింది. కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన రాజ్యాంగ ధర్మాసనం.. కేసు విచారణను వేగవంతం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *