లాక్ డౌన్ వల్లే ఆర్థిక సమస్యలు, కేంద్రంపై సుప్రీంకోర్టు ఫైర్

కరోనా వైరస్, లాక్ డౌన్ సమస్యలపైనా, దేశ ఎకానమీ పైనా ఇప్పటివరకూ స్పందించని సుప్రీంకోర్టు.. తాజాగా దీనిపై కేంద్రానికి మొట్టికాయలు వేసింది. కఠినతరమైన లాక్ డౌన్ విధించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఫలితంగానే దేశ ఆర్థికవ్యవస్థకు..

లాక్ డౌన్ వల్లే ఆర్థిక సమస్యలు, కేంద్రంపై సుప్రీంకోర్టు ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 26, 2020 | 3:59 PM

కరోనా వైరస్, లాక్ డౌన్ సమస్యలపైనా, దేశ ఎకానమీ పైనా ఇప్పటివరకూ స్పందించని సుప్రీంకోర్టు.. తాజాగా దీనిపై కేంద్రానికి మొట్టికాయలు వేసింది. కఠినతరమైన లాక్ డౌన్ విధించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఫలితంగానే దేశ ఆర్థికవ్యవస్థకు ఈ సమస్య వచ్చిపడిందని, రిజర్వ్ బ్యాంకు మాటున మీరు తలదాచుకోలేరని కేంద్రంపై మండిపడింది. మొత్తం దేశాన్ని మీరు లాక్ డౌన్ చేసిన ఫలితమే ఈ దుస్థితికి కారణమని దుయ్యబట్టింది. రుణ మారటోరియం కేసుపై దాఖలైన పిటిషన్ మీద న్యాయమూర్తులు అశోక్ భూషణ్, షా లతో కూడిన బెంచ్ విచారిస్తూ,మారటోరియం కాలంలో బ్యాంకులు వసూలు చేస్తున్న అదనపు వడ్డీల మీద మీ వైఖరి ఏమిటని కేంద్రాన్ని ప్రశ్నించింది. అసలు ఈ సమస్యపై మీరు  అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని కూడా న్యాయమూర్తులు అడిగారు. లోన్ మారటోరియం కేసులో కేంద్రం ఎప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తుందని రెట్టించి ప్రశ్నించగా..ఇందుకు తమకు వారం రోజుల వ్యవధి కావాలని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.

దేశంలోని ప్రస్తుత ఆర్ధిక పరిస్థితిపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వడ్డీని మాఫీ చేసిన పక్షంలో బిజినెస్, బ్యాంకులకు దెబ్బ వాటిల్లుతుందన్న కేంద్రం వాదనపై.. ఇప్పుడు ‘బిజినెస్’ గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదని జస్టిస్ షా వ్యాఖ్యానించారు. మారటోరియం కాలంలో లోన్ రీ పేమెంట్స్ మీద అదనపు వడ్డీ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ వడ్డీని మాఫీ చేయాలని పిటిషనర్లు అభ్యర్థించారు. వారి తరఫున వాదించిన సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్..మారటోరియం కాల పరిమితి ఈ నెల 31 తో ముగుస్తుందని, సెప్టెంబర్ 1 నుంచి తాము డీఫాల్టర్లమవుతామని అన్నారు. ఈ రుణాలు అప్పుడు నిరర్థక ఆస్తులుగా మారతాయని,అప్పుడు అదో పెద్ద సమస్యగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కారమయ్యేంతవరకు మారటోరియం కాల పరిమితి పొడిగించాలని ఆయన కోరారు. అయితే ఇందుకు తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు.

మార్చి 27 న రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన నోటిఫికేషన్ లో కొంత భాగాన్ని రద్దు చేయాలని, తద్వారా వడ్డీ మాఫీ కావడానికి అవకాశం ఉంటుందని పిటిషనర్లు కోరారు. కాగా-సెప్టెంబర్ 1 న మళ్ళీ ఈ కేసును విచారించాలని కోర్టు నిర్ణయించింది.