సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సరికొత్త రికార్డు

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నీలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో రికార్డును సాధించింది..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సరికొత్త రికార్డు
Follow us

|

Updated on: Nov 04, 2020 | 1:04 PM

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నీలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో రికార్డును సాధించింది.. చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబాయి ఇండియన్స్‌ తర్వాత వరుసగా అయిదుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న జట్టుగా హైదరాబాద్‌ కొత్త రికార్డును నమోదు చేసింది. 2010-2015 వరకు ముంబాయి ఇండియన్స్‌ వరుసగా ఆరుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.. ఇందులో నాలుగుసార్లు కప్పును కొట్టింది. 2008-2015 మధ్య చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు వరుసగా ఎనిమిదిసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.. ఇందులో రెండుసార్లు టైటిల్‌ను సాధించింది. ఫిక్సింగ్‌ ఆరోపణలతో నిషేధానికి గురై ఆ తర్వాత మళ్లీ టోర్నీలో అడుగు పెట్టిన అనంతరం కూడా చెన్నై సూపర్‌కింగ్స్‌ టైటిల్‌ సాధించడం విశేషం. నిన్న ముంబాయి ఇండియన్స్‌తో జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో హైదరాబాద్‌ అద్భుతమైన ప్రతిభను కనబర్చింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబాయి బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ ఇరగదీసింది. పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ప్లే ఆఫ్స్‌కు చేరుకునేందుకు చివరి మూడు మ్యాచులలో చక్కటి గెలుపులను అందుకోవడం విశేషం.. అదీ టేబుల్‌ టాపర్లుగా ఉన్న జట్లపై! అసలు మొదట్లో హైదరాబాద్‌ టీమ్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందా అన్న అనుమానం కలిగింది. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ తర్వాతి రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగు పాయింట్లను సాధించింది. ఆ తర్వాత ముంబాయి ఇండియన్స్‌తో జరిగిన అయిదో మ్యాచ్‌లో ఓడిపోయింది. పంజాబ్‌తో జరిగిన ఆరో మ్యాచ్‌లో గెలుపొంది మరో రెండు పాయింట్లను సాధించింది. ఆ తర్వాత హైదరాబాద్‌ టీమ్‌కు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. రాజస్తాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఓడిపోయింది.. చేతికొచ్చిన మ్యాచ్‌లను చేజార్చుకుంది.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే సూపర్‌ ఓవర్‌లో ఓడిపోయింది. రాజస్తాన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల సంఖ్యను ఎనిమిదికి పెంచుకుంది. ఆ తర్వాత పంజాబ్‌తో కీలక మ్యాచులో ఓడిపోవడంతో హైదరాబాద్‌ ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టంగా మారాయి.. అయితే పాయింట్స్‌ టేబుల్‌లో మొదటి మూడు ప్లేసులలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబాయి ఇండియన్స్‌పై వరుస విజయాలు సాధించి పాయింట్ల సంఖ్యను 14కు పెంచుకుని సగర్వంగా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యింది..