Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

కమలదళంలో చెమటోడుస్తున్న సుజనా.. ఎందుకంటే ?

చంద్రబాబుతో సాధ్యం కానిది.. అమిత్ షాకు సాధ్యమైంది… టిడిపి చేయలేనిది బిజెపి చేయగలుగుతోంది.. ఇంతకీ ఏంటనే కదా మీ సందేహం ? రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరితో పార్టీ జెండా మోయించడం… సభ్యత్వ పుస్తకం పట్టుకుని పార్టీలోకి కొత్త వారిని చేర్పించడం.. ఇలాంటి వన్నీ చేస్తున్న సుజనా చౌదరిని చూసి ఏపీ ప్రజలు అవాక్కవతున్నారు. దాదాపు 16 ఏళ్ళపాటు పని చేసిన తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ జెండాను మోయడం కానీ.. ఆ పార్టీ సభ్యత్వం కోసం వీథివీథి తిరగడం కానీ ఏనాడు చేయని సుజనా చౌదరి.. బిజెపిలో చేరిన తర్వాత ఇంతగా కష్టపడడానికి కారణాలేంటా అని బెజవాడ జనం బుర్ర గోక్కుంటున్నారు.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరిన యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి… తొలుత పార్టీ ఫండర్‌గానే అందరికి సుపరిచితం. ఆ తర్వాత ఓ తెలుగు న్యూస్ ప్రారంభించి పార్టీ సేవలో తానే ముందున్నా అనిపించుకున్నారు. తద్వారా చంద్రబాబు గుడ్ లుక్స్‌లో పడి 2010లో ఏకంగా రాజ్యసభ సభ్యత్వం కొట్టేశారు. సుజనాచౌదరికి లక్కు చిక్కిందని అప్పట్లో పార్టీ వర్గాలు చర్చించుకున్నాయి. ఆ తర్వాత 2014లో బిజెపితో కలిసి పోటీ చేసిన టిడిపి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే సమయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంలో కూడా చేరింది తెలుగుదేశం పార్టీ. దాంతో రాజ్యసభ సభ్యునిగా వున్న సుజనా చౌదరి కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో కేబినెట్ హోదాలో మంత్రయ్యారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా 2014 నుంచి 2018 దాకా వ్యవహరించారు. ఈక్రమంలోనే 2016లో సుజనా చౌదరి రాజ్యసభ సభత్వం కూడా రెన్యువల్ అయ్యింది.

2019 మేలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం పాలవడంతో టిడిపి నేతలు తలో దారి చూసుకోవడం మొదలైంది. దానికి బిజెపి ఆకర్ష్ స్కీమ్ కూడా జతవ్వడంతో సుజనా చౌదరి తోటి రాజ్యసభ సభ్యులైన సీఎం రమేశ్, టిజి వెంకటేశ్, గరికపాటి మోహన్ రావులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్షాన్ని బిజెపిలో విలీనం చేశారు. దీనికి ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు వెంటనే ఆమోదం తెలిపారు. దాంతో ఈ నలుగురు అఫీషియల్‌గా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా మారిపోయారు.

అసలు కథ ఇక్కడే మొదలైంది. సుజనా చౌదరిపై వున్న ఆర్థిక నేరారోపణల వల్లనే ఆయన పార్టీ మారారంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఆర్థిక నేరాలను చూపి, బిజెపి అధిష్టానం గాలమేయడం వల్లనే సుజనా బిజెపిలో చేరారన్న కామెంట్లు జోరందుకున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐల డేగ కళ్ళ నుంచి తప్పించుకోవాలంటే కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలో కొనసాగడమే ఉత్తమమని సుజనా భావించారని, దానికి బిజెపి ప్రారంభించిన కమలాకర్ష్ తోడైందని అందరూ భావించారు.

ఇక్కడి వరకు బాగానే వుంది… కానీ ఇపుడు బిజెపి అధిష్టానం తమ సత్తా చాటుతోంది.. గతంలో చొక్కా నలగకుండా రాజకీయాల్లో కొనసాగిన సుజనా చౌదరికి ఇపుడు బిజెపీలో వీథుల్లో తిరుగుతూ ప్రాబల్యం చాటాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆయన సొంతూరు కంచికచర్లతోపాటు బెజవాడలో జనం చెప్పుకుంటున్నారు. రెండు దశాబ్ధాల పాటు కొనసాగిన టిడిపిలో ఏనాడు జెండా పట్టుకుని తిరగని సుజనా… ఇటీవల బిజెపి ప్రారంభించిన గాంధీ సంకల్ప యాత్రలో జాతీయ జెండాని మోస్తూ జనం మధ్య నడిచారు. గుళ్ళలో పూజలు చేశారు. జనం మధ్య వారి సంగతులు తెలుసుకుంటూ కొనసాగారు.

పార్టీ సభ్యత్వ పుస్తకాలను పట్టుకుని.. వ్యక్తిగతంగా పార్టీ సభ్యత్వం కోసం శ్రమించారు. ఒకరకంగా చెప్పాలంటే బిజెపిలో ఇపుడు సుజనా చౌదరి చెమటోడుస్తూ మరీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. నేడో రేపో కేబినెట్‌ని విస్తరించబోతున్న మోదీ కాస్తైనా దయచూపి, మంత్రి పదవి ఇస్తారో ఇవ్వరో కానీ… సుజనా ఇపుడు కార్పొరేట్ పొలిటిషియన్ అనే ముద్ర పోగొట్టుకోవడానికి తెగ కష్టపడుతున్నారు.