Queen Of The Dark: అందం అంటే తెలుపు కాదు.. నా రంగంటే నాకు ఇష్టం అంటున్న సుడాన్ సుందరి.. క్వీన్ ఆఫ్ ది బ్లాక్

నల్ల కలువని నేను.. అందానికి నేనే ఉదాహరణ అంటుంది సుడానీస్ సౌందర్యరాశి. ప్రపంచమంతటా నలుపు తెలుపు వర్ణాల గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. తెల్లగా ఉన్నవారు నల్లవారిని తక్కువ

  • Surya Kala
  • Publish Date - 4:13 pm, Wed, 13 January 21
Queen Of The Dark: అందం అంటే తెలుపు కాదు.. నా రంగంటే నాకు ఇష్టం అంటున్న సుడాన్ సుందరి.. క్వీన్ ఆఫ్ ది బ్లాక్

Queen Of The Dark: మనలో అందం అంటే తెలుపు. నటి, యాంకర్, మోడల్ ఇలా ఏ రంగంలో మహిళలు అడుగు పెట్టాలనుకున్నా ముందు ఆమె తెల్లగా ఉందా లేదా అని చూస్తారు.. ఇక పెళ్లి విషయంలో కూడా ఫస్ట్ ప్రయారిటీ కూడా శ్వేత వర్ణానిదే.. ! అమ్మాయి తెల్లగా.. అందంగా ఉంటుంది అని అంటారు.. అయితే నల్ల కలువని నేను.. అందానికి నేనే ఉదాహరణ అంటుందీ సుడానీస్ సౌందర్యరాశి. ప్రపంచమంతటా నలుపు- తెలుపు వర్ణాల గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. తెల్లగా ఉన్నవారు నల్లవారిని తక్కువగా చూసిన సందర్భాలు అనేకం. వర్ణ వివక్షతకు గురైన పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ తన రంగుని మార్చుకుంటే.. అందుకు భిన్నం ఈ సుందరి. సుడానీస్‌ సంతతికి చెందిన అమెరికన్‌ ఆఫ్రికన్‌ మోడల్‌ ‘న్యాకిమ్‌ గాట్వేచ్‌’ తాను నల్లగా ఉన్నందుకు గర్విస్తాను. ఈ రంగుతోనే జీవిస్తాను అని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పింది క్వీన్ ఆఫ్ డార్క్.

నల్లగా ఉన్న గాట్వెచ్‌ను అభిమానులు మురిపెంగా ‘చీకటి రాణి’ అని పిలుస్తారు. ఆమె రంగు ఇప్పటి వరకూ భూమిపై ఎవరూ చూడనిది. అయితే ఈ శిల్ప సుందరికి రోజు రోజుకు భారీ సంఖ్యలో అభిమానులు పెరుగుతున్నారు. దీంతో ఆమె తన డార్క్‌ స్కిన్‌ టోన్‌ను చూసుకొని మరింతగా గర్వపడుతుంది.

ఆఫ్రికన్ దేశం అంతర్యుద్ధంలో మునిగిపోతున్న సమయంలో గాట్వెచ్ దక్షిణ సూడాన్‌లో జన్మించింది. దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితులతో బాల్యం గడిచింది. 14 ఏళ్ల వయసున్నప్పుడు తమ కుటుంబంతో పాటు అమెరికాకు వలస వచ్చింది. అలా యునైటెడ్ స్టేట్స్ కు వెళ్లే ముందు శరణార్థులుగా ఇథియోపియా, కెన్యా దేశ శిబిరాల్లో నివసించారు. అయితే గాట్వెచ్..తన దేశంలో నివశించినప్పుడు ఎటువంటి వర్ణ వివక్షతకు గురి కాలేదు. అయితే తాను మిన్నెసోటాలో అడుగు పెట్టిన తర్వాత మిడిల్ స్కూల్లో చదివే సమయంలో చర్మం రంగు గురించి వెక్కింపులు ,అవమానాలు ఎదుర్కొన్నానని ఆమె పలు సందర్భాల్లో గుర్తు చేసుకుంది. అయితే అసలు తాను ఎప్పుడు మోడల్ అవ్వాలని అనుకోలేదని.. అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నానని తెలిపింది. మోడలింగ్ రంగంలో అనుభవం ఉన్న తన సోదరి అండతో..  ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టానని చెప్పింది.

నల్లగా ఉన్నవారి చర్మాన్ని తెలుపుగా మార్చుకోమని చెప్పేవారు ఎక్కువే. వారి సలహాలకు కొదవే ఉండదంటూ తనకు ఎదురైన అనుభవాలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంటుంది గాట్వెచ్‌. .. అందంగా కనిపించడానికి  తెలుపు రంగు ఉన్నవారే కానవసరం లేదు. నలుపు అనేది ఓ ధైర్యం. నలుపు బంగారం. నలుపు అందం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలను రకరకాల క్యాప్షన్లతో పోస్ట్‌ చేస్తుంది గాట్వెచ్‌.

అంతేకాదు తనకు ఎదురైన అనుభవాన్ని కూడా ఓసారి పంచుకుంది. జాబ్ కోసం ఓ ఇంటర్వ్యూ కి వెళ్లే సమయంలో క్యాబ్ బుక్ చేసుకున్నాను.. అప్పుడు ఆ డ్రైవర్ ఆఫీస్ ముందు దింపి.. ‘మీరు బ్లీచ్‌ చేయించుకుంటే పదివేల డాలర్లు ఇస్తానని’ చెప్పాడు. ఎందుకు నేను బ్లీచ్‌ చేయించుకోవాలి? అని ఎదురు ప్రశ్నించాను. ‘మీ రంగును చూసి నేనే భయపడ్డాను. ఉద్యోగానికి వెళుతున్నారు. ఇలా ఉంటే మిమ్మల్ని ఎవరూ జాబ్‌లోకి తీసుకోరు అన్నాడు. అపుడు ఉద్యోగం ఇచ్చేవారు తన అర్హతను చూడాలి. రంగు కాదు. అందం కోసం మీరు చెప్పిన పనులు ఎప్పుడూ చేయను… అంటూ దిగిపోయాను..’ అంటూ తెలిపింది గాట్వెచ్‌. గ్లామర్‌ ప్రపంచమైన ఫ్యాషన్, మోడల్‌ రంగాల్లో నలుపు ప్రత్యేకతను చాటుతున్న గాట్వెచ్‌ ఈ తరానికి అసలు సిసలైన ప్రతినిధి. అంతేకాదు ఎవరైనా మీ రంగు గురించి మాట్లాడితే.. ఒక్క చిన్న చిరునవ్వుతో కొట్టి పడేయండి.. మీ జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకుని ఎదగడానికి ప్రయత్నించండి అని చెబుతుంది ఆఫ్రికన్‌ అమెరికన్‌ మోడల్‌. ఫ్యాషన్‌ పరిశ్రమంలో వైవిధ్యం కోరుకునే స్త్రీ గానే కాదు న్యాయవాదిగా ప్రపంచవ్యాప్తంగా నల్లజాతీయుల హక్కుల కోసం నినదించే ఒక గొంతుక కూడా.

ఇప్పటికైనా తెలుపు ఎక్కువ నలుపు తక్కువ అనే అభిప్రాయానికి చెక్ పెట్టి.. ఆత్మ సౌదర్యం ఆత్మ విశ్వాసమే అసలైన అందం అని నేటి యువత గుర్తించాలని ఆశిద్దాం..

Also Read: కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనకు కుక్క సాయం.. కపుల్ ఎత్తుకు పోలీసుల పైఎత్తు.. చివరికి భారీ ఫైన్