‘అబ్బనీ తియ్యని దెబ్బ’ వెనకున్న అసలు కథ.. 104 డిగ్రీల జ్వరంతో డ్యాన్స్‌ వేసిన చిరు..!

మెగాస్టార్ చిరంజీవి, లేడి సూపర్‌స్టార్ శ్రీదేవి హీరోహీరోయిన్లుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం 'జగదేక వీరుడు అతిలోక సుందరి'.

'అబ్బనీ తియ్యని దెబ్బ' వెనకున్న అసలు కథ.. 104 డిగ్రీల జ్వరంతో డ్యాన్స్‌ వేసిన చిరు..!
Follow us

| Edited By:

Updated on: May 08, 2020 | 9:34 PM

మెగాస్టార్ చిరంజీవి, లేడి సూపర్‌స్టార్ శ్రీదేవి హీరోహీరోయిన్లుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. మెగాస్టార్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే టాప్‌ 10 చిత్రాల్లో ఈ మూవీ కచ్చితంగా ఉంటుంది. అంతేకాదు తెలుగు సినిమా ఆణిముత్యాల్లోనూ ఈ బ్లాక్‌ బస్టర్‌ ఒకటని చెప్పడం సంశయించాల్సిన విషయం కాదు. ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి వచ్చి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ మూవీకి సంబంధించిన సీక్రెట్లను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ రివీల్ చేస్తూ వస్తోంది. నాచురల్ స్టార్ నాని ఆ సీక్రెట్లను తన వాయిస్‌లో వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన అసలు ఈ కథ ఎలా పుట్టిందో చెప్పిన నాని.. తాజాగా ఈ మూవీ పాటల వెనకున్న స్టోరీలను వివరించారు.

ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించగా.. ఇందులో అన్నీ పాటలు మెలోడీగానే అనిపించాయట. అయితే చిరంజీవి, శ్రీదేవీ అంటే కచ్చితంగా ఆడియెన్స్ మాస్ పాటను కోరుకుంటారు కాబట్టి ఆ విషయంలో అభ్యంతరం వచ్చిందట. దీంతో రాఘవేంద్రరావు ఆలోచనలో పడ్డారట. మరోవైపు ఇళయరాజా ట్యూన్‌ను మార్చడం అశ్వనీదత్‌కు ఇష్టం లేదట. అదే సమయంలో ప్రముఖ పాటల రచయిత వేటూరి.. అదే ట్యూన్‌ను మాస్‌ ట్యూన్‌గా చేస్తాను చూడండి అని చెప్పి.. అబ్బనీ తియ్యని దెబ్బగా రాశారట. ఒక క్లాస్ ట్యూన్‌ను ఇలా మాస్ ట్యూన్‌గా చేయడం ఇళయరాజా, వేటూరికే దక్కిన మరో విశేషం. ఇక ఈ పాటను కేవలం రెండు రోజుల్లో మైసూరులో చిత్రీకరించగా.. అందాలలో అహో మహోదయం కోసం మాత్రం రాఘవేంద్రరావుకు 13 రోజుకు సమయం పట్టిందట.

ఇక దినక్కుతా.. దినక్కురో పాట కోసం వాహినీ స్టూడియోలో పెద్ద సెట్ వేశారట. అయితే అదే సమయంలో ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకొని శ్రీదేవీ ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్‌ కోసం వెళ్లాలట. మరోవైపు అప్పటికే చిరంజీవి 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారట. ఇక ఓ పక్కన రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో అంత జ్వరంలోనూ చిరు షూటింగ్‌కు రెడీ అయ్యారట. సెట్స్‌లో డాక్టర్‌ను పెట్టుకొని మెగాస్టార్ ఈ పాటకు డ్యాన్స్‌ చేశారట. అయితే ఆ పాటలో ఎక్కడా చిరు జ్వరంతో బాధపడుతున్న ఛాయలు కనిపించవు. అంతలా మెగాస్టార్ తన డ్యాన్స్‌తో అందరినీ మెప్పించారట. అందుకే ఈ సంఘటనను అశ్వనీదత్ చాలా సార్లు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అంతేకాదు ఈ సినిమా అనుకున్న సమయానికే రిలీజ్ అవ్వడానికి చిరునే కారణమని దత్ ఎప్పుడూ మెగాస్టార్‌ను తలుచుకుంటూ ఉంటారు. ఇలా ఎన్నో విశేషతలు ఉన్న ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ ఓ వండర్‌, మైల్‌స్టోన్‌గా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు.

Read This Story Also: హైదరాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచారం.. సుమోటాగా స్వీకరణ..!