
Minakshi Hooda : లివర్‌పూల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ 2025లో భారతదేశం అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మీనాక్షి హుడా భారత్‌కు రెండో బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అంతకుముందు శనివారం జాస్మిన్ లంబోరియా కూడా బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయం భారత బాక్సింగ్‌కు ఒక గొప్ప మైలురాయి.
మీనాక్షి హుడా గోల్డ్ మెడల్..
24 ఏళ్ల మీనాక్షి హుడా, పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన కజకిస్తాన్‌కు చెందిన నజిమ్ కైజైబేను 4-1 తేడాతో ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. గత జూన్-జులైలో అస్తానాలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో కైజైబే చేతిలో ఓడిపోయిన మీనాక్షి, ఈసారి ప్రతీకారం తీర్చుకుంది. రూర్కీలో ఆటో-రిక్షా డ్రైవర్‌కు జన్మించిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) కానిస్టేబుల్ మీనాక్షి, తాను పాల్గొన్న ప్రతి అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పతకం సాధిస్తూ వస్తోంది.
మ్యాచ్ విశ్లేషణ
ఫైనల్ బౌట్‌లో మీనాక్షి తన శరీర బలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంది. తన పొడవైన చేతులతో పదునైన షాట్‌లను కొడుతూ, నజిమ్ కైజైబేను దూరం ఉంచింది. తొలి రౌండ్ కోల్పోయిన కైజైబే, రెండో రౌండ్‌లో దూకుడు పెంచి 3-2తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే, మూడో రౌండ్‌లో మీనాక్షి తన దూకుడును పెంచి, ప్రత్యర్థిపై పైచేయి సాధించి విజయం సాధించింది.
జాస్మిన్ లంబోరియా గోల్డ్ మెడల్..
అంతకుముందు శనివారం, భారత మహిళా బాక్సర్ జాస్మిన్ లంబోరియా (మహిళల 57 కిలోల విభాగం) పోలాండ్‌కు చెందిన షెర్మెటా జూలియాను 4-1 తేడాతో ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. పారిస్ 2024 ఒలింపిక్స్ రజత పతక విజేత షెర్మెటా, మ్యాచ్‌ను వేగంగా ప్రారంభించినప్పటికీ, జాస్మిన్ రెండో రౌండ్ నుండి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తన ఎత్తును సద్వినియోగం చేసుకొని, 4-1 తేడాతో విజయాన్ని ఖరారు చేసుకుంది.
నూపుర్‌కు సిల్వర్, పూజా రాణికి బ్రాంజ్..
80 కిలోల + విభాగంలో నూపుర్ రజత పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్‌లో పోలాండ్‌కు చెందిన అగాటా కాజ్‌మార్స్‌కా చేతిలో ఓడిపోయింది. పూజా రాణి (80 కిలోల విభాగం) తన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఎమ్లీ అస్క్విత్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..