
2025 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశ ఆశాకిరణం అయిన నీరజ్ చోప్రా తన సత్తాను చాటుతూ ఒకే ఒక్క త్రోతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అయిన నీరజ్ పురుషుల జావెలిన్ త్రోలో మళ్ళీ టైటిల్ సొంతం చేసుకునే పనిలో ఉన్నా సుమా అన్నట్లు బలమైన ప్రదర్శనతో ప్రారంభించాడు. కేవలం ఒక ప్రయత్నంలోనే ఫైనల్‌కు అర్హత సాధించాడు. 2023లో జరిగిన ఈ ఈవెంట్‌లో నీరజ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు.
జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జావెలిన్ త్రో అర్హత రౌండ్ బుధవారం.. సెప్టెంబర్ 17న జరిగింది. నీరజ్ చోప్రా గ్రూప్ Aలో ఉన్నాడు. ఈ గ్రూప్ లో 19 మంది పోటీదారులలో నీరజ్ చోప్రా మాత్రమే తన మొదటి ప్రయత్నంలోనే అర్హత సాధించాడు. మరోవైపు ఇదే గ్రూప్ లో మన దేశానికి చెందిన సచిన్ యాదవ్ కూడా ఫైనల్‌కు అర్హత సాధించడానికి పోటీ పడ్డాడు .
ఫైనల్‌కు అర్హత మార్కు 84.50 మీటర్లు. కాగా నీరజ్ మధ్యాహ్నం ఒకే ఒక్క త్రో తో 84.85 మీటర్ల త్రోతో ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్కుకి చేరుకున్నాడు. ఇది గురువారం అంటే సెప్టెంబర్ 18న జరిగిన ఫైనల్‌కు చేరుకోవడానికి సరిపోయింది. నీరజ్ పెద్దగా కష్టపడకుండానే తన మొదటి ప్రయత్నంలోనే దాన్ని క్లియర్ చేసి టైటిల్ రౌండ్‌లో స్థానం సంపాదించాడు. దీని తర్వాత నీరజ్ మళ్లీ త్రో చేయలేదు. ఫైనల్ కోసం తన ఫిట్‌నెస్ ను , శక్తిని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు.
నీరజ్ తో పాటు గ్రూప్ A నుంచి మరో ఇద్దరు అథ్లెట్లు ప్రత్యక్ష అర్హత సాధించారు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ తన రెండవ ప్రయత్నంలో 87.21 మీటర్ల త్రో తో అర్హత సాధించాడు. గత నెలలో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్‌లో నీరజ్‌ను ఓడించి అతను విజయం సాధించాడు. పోలాండ్‌కు చెందిన డేవిడ్ వాగ్నర్ కూడా కెరీర్‌లో అత్యుత్తమ త్రోను సాధించి 85.67 మీటర్లతో ఫైనల్‌కు చేరాడు. భారతదేశానికి చెందిన సచిన్ యాదవ్ మూడు ప్రయత్నాలూ చేశాడు. అత్యుత్తమంగా 83.67 మీటర్లు త్రో చేశాడు. టాప్ 12 మంది అథ్లెట్లు ఫైనల్‌కు అర్హులు అవుతారు. గ్రూప్ B అర్హత రౌండ్ తర్వాత సచిన్ టాప్ 12లో నిలిచినట్లయితే.. అతను ఫైనల్‌లో కూడా పోటీ పడతాడు.
కాగా గ్రూప్ B లో పోటీ పడుతున్న ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్ తన మొదటి ప్రయత్నంలోనే 76.99 మీటర్లు మాత్రమే విసిరాడు.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఒకే ఈవెంట్‌లో నలుగురు భారతీయ అథ్లెట్లు పోటీ పడటం ఇదే మొదటిసారి. నీరజ్‌తో పాటు సచిన్ యాదవ్, యష్ వీర్ సింగ్, రోహిత్ యాదవ్ కూడా ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .