ఈ అవమానానికి వారు అర్హులా.. బీసీసీఐపై విమర్శల వర్షం..!

మహిళల టీ 20 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్‌కు వెళ్లి.. సరికొత్త చరిత్రకు భారత మహిళా టీమ్ నాంది పలికిన విషయం తెలిసిందే. అయితే తుది పోరులో కాస్త తడబడటంతో ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓడిపోయింది.

  • Tv9 Telugu
  • Publish Date - 6:34 pm, Thu, 12 March 20
ఈ అవమానానికి వారు అర్హులా.. బీసీసీఐపై విమర్శల వర్షం..!

మహిళల టీ 20 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్‌కు వెళ్లి.. సరికొత్త చరిత్రకు భారత మహిళా టీమ్ నాంది పలికిన విషయం తెలిసిందే. అయితే తుది పోరులో కాస్త తడబడటంతో ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ.. క్రికెట్ అభిమానుల నుంచి మహిళల టీమ్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. కానీ బీసీసీఐ మాత్రం మహిళల టీమ్ పట్ల నిర్లక్ష్యం వహించింది. ఫైనల్‌ మ్యాచ్ తరువాత భారత్ గడ్డపై అడుగుపెట్టిన మహిళా క్రికెటర్లకు స్వాగతం పలికేందుకు బీసీసీఐ నుంచి ఎవ్వరూ వెళ్లలేదు. అభిమానులు కూడా వెళ్లిన దాఖలాలు లేవు. దీంతో వారు కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ అసంతృప్తి వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించగా.. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇక ఈ విషయాన్ని క్రికెటర్ కేపీ సిన్హా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “చరిత్రలో అంతకుముందు ఎవ్వరూ సాధించని ఘనతను నువ్వు సాధిస్తే నీకు కచ్చితంగా ప్రశంసలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎలాంటి స్వాగతం నాకు కనిపించలేదు. ఫైనల్‌లో ఓడిపోయిన బాధ కంటే ఇప్పుడే వారు ఎక్కువ బాధపడుతున్నారు. మేము ఎప్పటికీ మీకు అండగా ఉంటాం” అని ట్వీట్ చేశారు. ఇక ఆ ట్వీట్‌కు క్రికెట్ అభిమానులు స్పందిస్తున్నారు. బీసీసీఐ తీరుపై విరుచుకుపడుతున్న వారు.. విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నో ఘనతలను సాధిస్తోన్న వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అభిమానులు కామెంట్ పెడుతున్నారు.