ప్రాణం కంటే ఆటే ముఖ్యమంటున్న అన్వర్‌ అలీ

ఆటను ప్రాణంగా ప్రేమించేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు.. ఆట కోసం ప్రాణమిచ్చేవారు కూడా ఎక్కడోకానీ కనబడరు.. అలాంటివాడే అన్వర్‌ అలీ.. చిన్నవాడే కానీ గుండె జబ్బు అతడి ఆటకు అవరోధంగా నిలిచింది..

  • Balu
  • Publish Date - 10:30 am, Thu, 1 October 20
ప్రాణం కంటే ఆటే ముఖ్యమంటున్న అన్వర్‌ అలీ

ఆటను ప్రాణంగా ప్రేమించేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు.. ఆట కోసం ప్రాణమిచ్చేవారు కూడా ఎక్కడోకానీ కనబడరు.. అలాంటివాడే అన్వర్‌ అలీ.. చిన్నవాడే కానీ గుండె జబ్బు అతడి ఆటకు అవరోధంగా నిలిచింది.. గుండె జబ్బుతో బాధపడుతూ కూడా ఆటను వదల్లేకపోతున్నాడు.. తనను ఆడకుండా అడ్డుకోవడం సరికాదంటూ న్యాయస్థానం తలుపు తట్టాడు.. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగనుంది.. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు తెలుసుకుంటే అన్వర్‌ అలీపై విపరీతమైన అభిమానం కలుగుతుంది.. అదే స్థాయిలో జాలి కూడా కలుగుతుంది..
పంజాబ్‌కు చెందిన అన్వర్‌ అలీ మంచి ఫుట్‌బాల్‌ ఆటగాడు.. భారత అండర్‌-17, భారత అండర్‌-20 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు కూడా! ఏడాది కిందట ఐఎస్‌ఎల్‌లో ముంబాయి సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌లో ఆడే అవకాశం కలిగింది. అయితే టోర్నమెంట్‌కు ముందు వైద్యపరీక్షలు జరుపుతారు కదా! అందులో అన్వర్‌ అలీ ఎపికల్‌ హైపర్‌ కార్డియో మయోపతీ అనే అరుదైన గుండెజబ్బుతో బాధపడుతున్నాడని తెలిసింది.. ఆ జబ్బు తనకు ఉందని తెలిసిన అన్వర్‌ అలీ ఏడాది పాటు ఫుట్‌బాల్‌ ఆడటం మానేశాడు.. ఏదైతే అది అయ్యిందన్న మొండి ధైర్యంతో మళ్లీ కాలికి పనిచెప్పాడు.. మొహమ్మదాన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ అన్వర్‌ను తీసుకుంది కూడా! అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య -ఏఐఎఫ్‌ఎఫ్‌ మాత్రం అన్వర్‌ ఆడటానికి వీల్లేదంటోంది. డాక్టర్లు ఆడేందుకు అనుమతి ఇచ్చేవరకు అన్వర్‌ మైదానంలో దిగకూడదంటూ ఆదేశించింది.. అన్వర్‌ అలీకి వైద్యపరీక్షలు చేసేది ఎవరయ్యా అంటే ప్రముఖ టెన్నిస్‌ ప్లేయర్‌ లియాండ్‌ పేస్‌ తండ్రి డాక్టర్‌ వీస్‌ పేస్‌ సారథ్యంలోని వైద్య బృందం.. తన ఇష్టాన్ని కాదనడానికి ఎఐఎఫ్‌ఎఫ్‌ ఎవరంటూ అన్వర్‌ అలీ కోర్టుకెళ్లాడు.. తాను ఆడాలా వద్దా అనేది క్లబ్‌ ఇష్టం.. మధ్యలో ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎందుకు జోక్యం చేసుకుంటున్నదని అన్వర్‌ ప్రశ్నిస్తున్నాడు. అన్వర్‌ ఫుట్‌బాల్‌ ఆడితే చనిపోతాడని కచ్చితంగా ఎలా చెప్పగమంటున్నారు ఆయన తరఫు న్యాయవాది అమితాబ్‌ తివారి.. గతంలో ఇలాగే ఇద్దరు ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకు మైదానంలోనే గుండెపోటు వచ్చిందని.. వారు చికిత్స చేయించుకుని హాయిగా ఆడుతున్నారని తెలిపాడు తివారి. ఆటగాడిని నిషేధించే అధికారం ఏఐఎఫ్‌ఎఫ్‌కు లేదని అన్నారు. అన్వర్‌ను ఆడించవద్దంటూ మొహమ్మదాన్‌ క్లబ్‌కు ఫెడరేషన్‌ లేఖ రాయడం పూర్తిగా తప్పంటున్నారు. అనుకోకుండానే అన్వర్‌కు గుండెజబ్బు ఉందని తేలిందని, లేకపోతే అసలు ఆ అనుమానమే వచ్చి ఉండేది కాదని అమితాబ్‌ తివారి అంటున్నారు.