National Games 2022: 36 క్రీడాంశాలు.. 7వేల మంది అథ్లెట్లు.. నేటి నుంచి జాతీయ క్రీడలు.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ

ఈసారి మొత్తం 36 క్రీడాంశాల్లో సుమారు 7వేలకు పైగా అథ్లెట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి ఒలింపియన్లు, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.

National Games 2022: 36 క్రీడాంశాలు.. 7వేల మంది అథ్లెట్లు.. నేటి నుంచి జాతీయ క్రీడలు.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ
Pm Narendra Modi
Basha Shek

|

Sep 29, 2022 | 10:24 AM

దేశంలో మరో మెగా క్రీడా సమరానికి మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా 36వ జాతీయ క్రీడలు నేడు ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా ఈ క్రీడలను ప్రారంభించనున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌, భావ్‌నగర్‌ నగరాల్లో ఈ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. సైక్లింగ్‌ పోటీలు మాత్రం దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్నాయి. కాగా సుమారు ఏడేళ్ల తర్వాత ఈ పోటీలు జరగనున్నాయి. చివరిసారిగా 2015లో కేరళలో ఈ క్రీడలు జరిగాయి. ఈసారి మొత్తం 36 క్రీడాంశాల్లో సుమారు 7వేలకు పైగా అథ్లెట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి ఒలింపియన్లు, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. కాగా తొలిసారి ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండడంతో గుజరాత్‌ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. నిజానికి 36వ జాతీయ క్రీడలు 2020లో గోవాలో జరగాల్సి ఉంది. అయితే కరోనాతో వాయిదా పడ్డాయి.

కాగా జాతీయ క్రీడలు గురువారం అధికారికంగా ప్రారంభంకానున్నటికీ.. ఇప్పటికే కొన్ని అంశాల్లో పోటీలు మొదలయ్యాయి. ఈ నెల 30న చైనాలో టేబుల్‌ టెన్నిస్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ మొదలుకానున్న నేపథ్యంలో ఈ సారి జాతీయ క్రీడల్లో ముందుగానే ఈ పోటీలు నిర్వహించారు. ఈ నెల 20న మొదలైన టీటీ పోటీలు 24నే ముగిశాయి. కబడ్డీ, లాన్‌బౌల్‌, నెట్‌బాల్‌, రగ్బీ తదితర ఈవెంట్లలోనూ పోటీలు మొదలయ్యాయి. ఈసారి భారత సంప్రదాయ ఆటలైన ఖోఖో, యోగాసన, మల్లఖంబ్‌ జాతీయ క్రీడల్లో అరంగేట్రం చేస్తున్నాయి. నేటితో మొదలు కానున్న ఈ క్రీడా పోటీలు వచ్చేనెల 12 వరకు జరగనున్నాయి.

స్పెషల్‌ అట్రాక్షన్‌ వీరే..

కాగా టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయ్‌ చాను, బాక్సర్‌ లవ్లీనా ఈ గేమ్స్‌లో ప్రధాన ఆకర్షణ కానున్నారు. అలాగే స్విమ్మర్‌ శ్రీహరి నటరాజన్‌తోపాటు ద్యుతీచంద్‌, హిమాదాస్‌, మురళీశంకర్‌, అన్నూరాణి, లక్ష్యసేన్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ పై కూడా అందరి దృష్టి నిలిచింది. అయితే గాయాల నుంచి కోలుకోకపోవడంతో ఒలింపియన్లు నీరజ్‌ చోప్రా, పీవీ సింధు, బజ్‌రంగ్‌ పూనియా ఈ క్రీడలకు దూరంగా ఉండనున్నారు.

ఎక్కడ చూడొచ్చంటే..

జాతీయ క్రీడలను డీడీ స్పోర్ట్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అలాగే ప్రసార భారతి స్పోర్ట్స్‌ యూట్యూబ్‌ చానెల్‌లో లైవ్‌స్ర్టీమింగ్‌, హైలైట్స్‌ ప్రసారమవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu