Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు, 425 మంది మృతి. దేశవ్యాప్తంగా 6,97,413 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,53,287 యాక్టీవ్ కేసులు,4,24,433 మంది డిశ్చార్జ్. దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: నేడు సీఎం జగన్ ను కలవనున్న హై పవర్ కమిటీ . ఏల్జి పాలిమర్స్ ఘటనపై నివేదిక సమర్పించనున్న హై పవర్ కమిటీ. గ్యాస్ లీక్ తర్వాత అనేక అంశాల పై అధ్యయనం చేసిన హై పవర్ కమిటీ.
  • ఏపీలో మూడు రోజులు వర్షాలు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఆవర్తనం. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాలకు సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం. అల్పపీడనంతో కోస్తా, రాయలసీమలపై నైరుతి రుతుపవనాల ప్రభావం. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.
  • కాకినాడ: కరోన పరీక్షల్లో నిర్లక్ష్యం. కరోనా వైద్య పరీక్షలు విషయంలో బట్టబయలు అవుతున్న సిబ్బంది నిర్లక్ష్యం. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు నెగిటివ్ అంటూ సమాచారం ఇస్తున్న సిబ్బంది. కరోనా ల్యాబ్ నుండి వచ్చిన పాజిటివ్ రిపోర్టులను నెగెటివ్ గా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్న సిబ్బంది. రెండు రోజుల క్రితం కాకినాడ నగరంలో జగన్నాయక్ పూర్ లో ఒక యువకుడికి కరోనా పాజిటివ్. మీకు కరోనా పాజిటివ్ వచ్చిదంటూ ఆదే మధ్యాహ్నం సమాచారం ఇచ్చిన పోలీసులు. లేదు నెగిటివ్ వచ్చిందంటూ చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది.
  • శ్రీకాకుళం జిల్లా : ఇచ్చాపురంలో 14 రోజులు లాక్ డౌన్ - జిల్లా కలెక్టర్ జె నివాస్. తాగునీరు, పాలు, నిత్యావసర సరుకులు, మందులు మినహా అన్ని దుకాణాలు మూసివేత. కాంటైన్మెంట్ జోన్ లో ఏ దుకాణానికి అనుమతి లేదు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే నిత్యావసర సరుకులకు అనుమతి. ఇచ్చాపురంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా నిర్ణయం. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. మాస్కులు ధరించాలి. వ్యక్తుల మధ్య దూరం పాటించాలి. చేతులను తరచూ సబ్బుతో శుభ్రపరచుకోవాలి. 144వ సెక్షన్ అమలు. ఎక్కడా ప్రజలు గుమిగూడరాదు. ప్రజలు సహకరించాలి.
  • తెలంగాణ రాష్ట్రంలో భారీగా మరోసారి కోవిడ్ కేసులు నమోద. ఇవ్వాళ కొత్తగా 1590 కొరొనా పాజిటివ్ కేసులు. ఇవ్వాళ కొత్తగా ఏడు మరణాలు-295కి చేరిన మరణాల సంఖ్య. మొత్తం కేసుల సంఖ్య 23902. ప్రస్తుతం ఆక్టివ్ గా 10 904 ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడి. GHMC-1277, రంగారెడ్డి-82, మేడ్చెల్-125, సూర్యాపేట-23, నల్గొండ-14, మహబూబ్ నగర్-, సంగారెడ్డి19, కేసులు నమోదు. ఇవ్వాళ డిచార్జ్-1166 మొత్తం ఇప్పటి వరకు 12 703 మంది.

ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకివ్వడం లేదు.. నేడు అన్నగారి 97వ జయంతి..

NTR 97th Anniversary Story, ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకివ్వడం లేదు.. నేడు అన్నగారి 97వ జయంతి..

తెలుగు నట సింహాం నందమూరి తారక రామారావు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు. తెలుగుజాతి కీర్తి కిరీటాలను దశదిశలా వ్యాపింప చేసిన ఘనుల్లో ఒకరు. తెలుగు ఖ్యాతిని ఆయనలా ప్రపంచానికి చాటిన మరో ముఖ్యమంత్రి లేరంటే అతిశయోక్తి కాదేమో. తెలుగుజాతి గుండెల్లో చెరగని జ్ఞాపకం. తెలుగువారి ఆత్మగౌరవం ప్రతీక. అన్నీ కలగలిపి నందమూరి తారక రామారావు. అలాంటి విశ్వ విఖ్యాత నట సౌర్వభౌముడికి భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆచరణలోకి రావడం లేదు.

ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని తెలుగు దేశం పార్టీ అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ప్రభుత్వమే కాదు నందమూరి కుటుంబ సభ్యులు, వారి అభిమానులు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరడం కొత్తేం కాదు. వీరితో పాటు ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి హస్తినకు వెళ్లి మరీ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు. గత పరిస్థితులు వేరు, ఇప్పడు వేరు. కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ ప్రభుత్వం. ఏపీలో అధికారంలో ఉంది వైసీపీ సర్కార్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల విషయంలో రకరకాల అభిప్రాయాలున్నాయి. ఏపీకి అనుకూలమని కొందరంటే..కాదు కాదు దూరం అంటున్నారు ఇంకొందరు. విషయం ఏదైనా ఎన్టీఆర్ కు భారతరత్న తీసుకు రావడం కష్టం కాదనే వాదనుంది. కానీ కొన్ని శక్తులు ఆయనకు అవార్డు రాకుండా అడ్డుకుంటున్నాయనే వాదన లేకపోలేదు. ఫలితంగా అన్నగారికి భారతరత్న రావడం అంత తేలిక కాదట. ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తే ఆ అవార్డును ఆయన భార్యగా లక్ష్మీపార్వతి తీసుకునే వీలుంది. అది ఇటు నందమూరి ఫ్యామిలీకి కానీ, తెలుగు దేశం పార్టీకి గానీ నచ్చుతుందా అనే చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలని టీడీపీ సర్కార్ గతంలోనే సిఫారుసు చేసినా ప్రయోజనం లేకపోయింది.

మహానాడు వేదికగా ఎన్టీఆర్ కు భారతరత్నఅవార్డు ఇవ్వాలని టీడీపీ చాలా సార్లు డిమాండ్ చేసింది. కరోనాతో అంతా లాక్ డౌన్ అయిన వేళ టీడీపీ మరోసారి జూమ్ యాప్ ద్వారా మహానాడు నిర్వహిస్తోంది. ఇప్పుడు అదే మాట మాట్లాడుతోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు స్వయంగా ఈ అవార్డు గురించి పలుమార్లు ప్రస్తావించారు. ఎన్టీఆర్ వల్లనే తాము రాజకీయాలు నేర్చుకున్నామన్నారు. ఎన్టీఆర్ తమకు మార్గదర్శకుడన్నారు. మనసులో మాటే బాబు బయటకు చెప్పారా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ గురించి మాట్లాడారనేది నిజం. తన తండ్రికి భారతరత్న అవార్డు ఇవ్వాలని హరికృష్ణ బతికునన్ని రోజు అడుగుతూనే ఉండేవాళ్లు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ చేస్తూనే ఉంది. సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు ఆ సిఫార్సులను పెద్దగా పట్టించుకోలేదు.

తెలుగువారికి దక్కలేదా…

భారతరత్నల అవార్డు చరిత్ర చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరికీ ఆ గౌరవం దక్కలేదు. భారతరత్న అవార్డులను ఏర్పాటు చేసిన 1954లో తమిళనాడుకు మూడు అవార్డులొచ్చాయి. తెలుగు మూలాలు ఉన్న ముగ్గురికి భారతరత్నలు లభించాయని అనుకోవలసిందే తప్ప, ఆంధ్రప్రదేశ్ నుండి ఒక్కరికీ భారతరత్న లభించలేదు.

ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు భారతరత్న అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఆయన పూర్వీకులు తెలుగువాళ్లే. మూడు వందల ఏళ్ల కిందటే వారి పూర్వీకులు మైసూరుకు వలస వెళ్లారు. ఇంటిపేరును బట్టి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని మోక్షగుండం ఊరని, వారి పూర్వీకులు తెలుగువారని తేలింది. మోక్షగుండంకు 1955లో భారతరత్న అవార్డు లభించింది. ఇక సర్వేపల్లి రాధాకృష్ణ తమిళనాడుకు చెందిన తెలుగు కుటుంబంలో పుట్టారు. ఆయనకు 1954లో భారతరత్న అవార్డు లభించింది. రాధాకృష్ణ పుట్టింది మద్రాసు ప్రెసిడెన్సిలోని తిరుత్తనిలో. అదీ తెలుగు కుటుంబంలో. ప్రస్తుతం ఈ ప్రాంతం తమిళనాడులోని తిరువత్తూరు జిల్లాలో ఉంది. మరో నేత వివి.గిరికి భారతరత్న లభించింది. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సిలోని బరంపురంలో ఆయన జన్మించారు. ప్రస్తుతం బరంపురం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణది తెలుగు కుటుంబమే అయినా భారతరత్న మాత్రం తమిళనాడు లెక్కల్లోనే చూపారు. మొత్తంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరికీ భారతరత్న లభించలేదు.

తెలుగువారిలో భారతరత్న అవార్డు ఇవ్వాల్సి వస్తే ఎన్టీ రామారావు, పివి నరసింహారావులది తొలి స్థానమనే వాదనుంది. 1988లో భారతరత్న అవార్డు పొందిన ఎంజి రామచంద్రన్ ప్రాంతీయ పార్టీని నడిపించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవ చేశారు. ప్రముఖ సినీనటుడు. ఎన్టీఆర్‌కు దాదాపు అవే అర్హతలున్నాయి. ఈ విషయంలో ఎంజీఆర్ కు ఎన్టీఆర్ కు దగ్గర పోలికలున్నాయి. కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పినప్పుడు భారతరత్న కోసం పెద్దగా ప్రయత్నించలేదని లక్ష్మీ పార్వతి లాంటి వారి ఆరోపణ. గతంలోనే ఎన్టీఆర్‌కు అవార్డు వచ్చే అవకాశమున్న తప్పిపోయిందంటారు. ఇప్పట్లో తెలుగువారికి అవార్డు ఎండమావే అనే వాదనుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, సినీ నటునిగా తెలుగువారిపై చూపిన ప్రభావం సామన్యమైనదేమీ కాదు. రూపాయికి కిలో బియ్యం ఇచ్చిన ఘనత ఆయనదే. తెలుగులో ఆయన గొప్ప నటుడు. ఈ విషయం కాదనేవారుండరు. ఎన్టీఆర్ మహనీయుడు, సామాజిక ఉద్యమకారుడు, కులాలకు అతీతంగా సమాజం బాగుండాలని కోరుకున్న వ్యక్తి. `మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను అని ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

నట సార్వభౌముడు

రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు తదితర పౌరాణిక పాత్రల్లో నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయులుగా మిగిలారు ఎన్టీఆర్. జానపదం, చారిత్రకం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా అన్ని పాత్రల్లో జీవించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు. తెలుగు చిత్రసీమలో ఎన్నెన్నో మైలురాళ్ళకు యన్టీఆరే ఆద్యుడు. ఇక ఆయన నటజీవితంలో మైలురాళ్ళుగా నిలచిన చిత్రాలు ఈ నాటికీ జనం మదిని దోస్తూనే ఉన్నాయి.. సాంఘికమైనా, పౌరాణికమైనా, చారిత్రకమైనా, జానపదమైనా- ఏదైనా సరే నందమూరి బాణీ వాటికే వన్నె తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొన్నాడు. పరిపాలనను ప్రజల ముంగిట నిలిపిన ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా నిమ్మకూరులో మే 28, 1923న నందమూరి తారక రామారావు జన్మించారు. సినిమా రంగంపై మక్కువతో మంగళగిరిలో సబ్‌ రిజిస్ట్రార్‌గా చేస్తోన్న ఎన్‌టిఆర్‌ చెన్నై ట్రైన్‌ ఎక్కేశారు. తొలి అవకాశం ‘పల్లెటూరి పిల్ల’ సినిమాకు వచ్చినా విడుదలైంది మాత్రం ‘మనదేశం’ చిత్రం. షావుకారు చిత్రం తరువాత నివాసాన్ని చెన్నై థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతానికి మార్చుకున్నారు. విజయావారి బ్యానర్‌పై వచ్చిన పాతళబైరవి, మల్లీశ్వరి, పెళ్లిచేసి చూడు, చంద్రహారం చిత్రాలు ఎన్‌టిఆర్‌ను తిరుగులేని నటుడిగా నిరూపించాయి. మాయాబజార్‌, లవకుశ, శ్రీకృష్ణార్జున యుద్దం, భీష్మ, భూకైలాష్‌, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ వెంకటేశ్వరస్వామి మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, దానవీరశూరకర్ణ వంటి ఎన్నో సినిమాలు ఆయన ప్రతిభను గుర్తుచేస్తాయి. వేటగాడు, అడవిరాముడు, యమగోల వంటి సినిమాల్లో నటించాడు. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాల్లో నటించాడు. మెప్పించాడు. ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి…9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చాడు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించి అధికారాన్ని కైవసం చేసుకున్నాడు.

అవార్డు వస్తే ఎవరందుకుంటారు…

అలాంటి అన్నగారికి భారతరత్న అవార్డు ఇప్పించే అంశం పై ఉద్యమించాలంటున్నారు అభిమానులు. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆపిందనే ఆరోపణలున్నాయి. ఆయనకు ఇవ్వకపోవడం తెలుగువాళ్లకు ద్రోహం చేయడమేనని అనేకసార్లు మహానాడులో ఆవేదన వ్యక్తమైంది. అయితే అదంతా గతం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరింతగా పావులు కదిపితే బాగుండేదంటారు. ఎన్టీఆర్‌ కు అవార్డు ప్రకటిస్తే ఆయన సతీమణి హోదాలో లక్ష్మీపార్వతి హస్తినకు వెళ్లి రాష్టప్రతి చేతుల మీదుగా భారతరత్న పురస్కారాన్ని అందుకోవాల్సి ఉంది. అది ఆమెను వ్యతిరేకించే వారికి మింగుడుపడని అంశమే. మరణించిన వ్యక్తికి భారతరత్న ఇస్తే నిబంధనల ప్రకారం దానిని తీసుకునే అర్హత భార్యకే ఉంటుంది. ఒకవేళ ఆమె కూడా లేకపోతే వాళ్ల సంతానం వెళ్లి అవార్డును అందుకోవచ్చు. ఎన్టీఆర్‌ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి. ఒకవేళ భారత రత్న అవార్డు ఎన్టీఆర్ కు వస్తే ఢిల్లీ నుంచి పిలుపు ఆయన సతీమణి లక్ష్మీపార్వతికే వస్తుంది. ఒకవేళ లక్ష్మీపార్వతికి ఆహ్వానం దక్కకుండా, ఎన్టీఆర్‌ సంతానం వెళ్లి దానిని అందుకొనే ఏర్పాటు చేసినా ఆ తర్వాత వివాదం రేగడం ఖాయం. ఈ విషయంలో లక్ష్మీపార్వతి ఎలాగూ వెనక్కుతగ్గదు. మీడియాలోను రచ్చకెక్కుతుంది. ఆ విధంగా ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డు విషయంలో గొడవలు వచ్చే వీలుంది. అది ఎన్టీఆర్‌కు, భారతరత్నకు రెండింటికీ అవమానం అని భావిస్తున్నారు పలువురు ప్రముఖులు.

జగన్ సర్కార్ సిఫార్సు చేస్తుందా…

ఢిల్లీలో తెలుగువాళ్ల పరువు పోకుండా ఉండాలంటే ఇవన్నీ జరగకూడదనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే కేంద్ర పభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సి వస్తే పురస్కార పత్రాన్ని లక్ష్మీపార్వతి చేతిలో పెట్టే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే ఏపి మంత్రి మండలి తీర్మానించింది. భారతరత్న అవార్డు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన జాబితాలో ఎన్టీఆర్ పేరు లేదని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మహానాడులో భారతరత్న అవార్డు కోసం ఎన్టీఆర్ పేరు పంపించాలని తీర్మానం చేశారు. 2015లో జరిగిన మహానాడులోను. ఆ తర్వాతను అదే పని చేశారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పద్మ అవార్డుల కోసం ప్రతిపాదించిన జాబితాలో ఎన్‌టీఆర్ పేరు భారతరత్నకు సిఫారసు చేయలేదు. దీంతో దివంగత ఎన్‌టీఆర్‌కు భారతరత్న అవార్డు దక్కే అవకాశం లేకుండా పోయిందంటారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ విషయంలో ఎలా స్పందిస్తుందో అన్న చర్చ సాగుతోంది. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును ఎందుకు సిఫార్సు చేయకూడదంటూ గతంలోనే సిఎం జగన్ ప్రస్తావించారు. ఇప్పుడు అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఎన్టీఆర్ కు అవార్డు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తుందా..లేదా అనేది ఉత్కంఠను పెంచుతోంది.

కొండవీటి శివనాగ్ రాజు
సీనియర్ జర్నలిస్టు, టీవీ-9

Related Tags