క్రిస్మస్ చెట్టును ఎందుకు పెడతారు..? దాని ప్రత్యేకతేంటంటే..!

క్రిస్మస్.. క్రైస్తవుల ఆరాధ్యుడైన యేసు క్రీస్తు పుట్టినరోజుగా పరిగణించబడుతోన్న రోజు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకను డిసెంబర్ 25న ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక క్రిస్మస్ వేడుకల్లో ప్రధానాకర్షణ క్రిస్మస్ చెట్టు. క్రిస్మస్ రాక ముందు నుంచే ఈ చెట్టును తమ ఇంటిలో ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు క్రైస్తవులు. ఇప్పుడైతే అనేక రకాల కృత్రిమ క్రిస్టమస్‌ చెట్లు అందుబాటులో ఉన్నాయి గానీ.. కొన్ని సంవత్సరాల క్రితమైతే నిత్యం పచ్చగా వుండే పైన్‌ చెట్లను మాత్రమే క్రిస్మస్ చెట్టుగా […]

క్రిస్మస్ చెట్టును ఎందుకు పెడతారు..? దాని ప్రత్యేకతేంటంటే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 20, 2019 | 8:51 PM

క్రిస్మస్.. క్రైస్తవుల ఆరాధ్యుడైన యేసు క్రీస్తు పుట్టినరోజుగా పరిగణించబడుతోన్న రోజు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకను డిసెంబర్ 25న ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక క్రిస్మస్ వేడుకల్లో ప్రధానాకర్షణ క్రిస్మస్ చెట్టు. క్రిస్మస్ రాక ముందు నుంచే ఈ చెట్టును తమ ఇంటిలో ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు క్రైస్తవులు. ఇప్పుడైతే అనేక రకాల కృత్రిమ క్రిస్టమస్‌ చెట్లు అందుబాటులో ఉన్నాయి గానీ.. కొన్ని సంవత్సరాల క్రితమైతే నిత్యం పచ్చగా వుండే పైన్‌ చెట్లను మాత్రమే క్రిస్మస్ చెట్టుగా అలంకరించేవాళ్లు. మరి క్రిస్మస్ చెట్టు ఎలా పుట్టింది..? దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?

భూమి మీద మనిషి మనుగడ ప్రారంభమైనప్పటి నుంచే పచ్చని మొక్కలు ప్రజల జీవనంలో భాగంగా ఉండేవి. దుష్ట శక్తులను నిరోధించే శక్తి పచ్చని చెట్లకు మాత్రమే ఉందని ఎప్పటి నుంచో మనుషులు నమ్ముతూ వస్తున్నారు. అందుకే క్రిస్మస్‌ వేడుకల్లో కూడా చెట్టు భాగమైంది. నిజానికి చెప్పాలంటే క్రిస్మస్ చెట్టు ఇంట్లో పెట్టుకో వడమన్నది జర్మన్‌ల నుంచి పుట్టింది. మధ్య యుగంలో డిసెంబర్ 24న జర్మన్‌లు ఈడెన్‌ తోటలో ఆడం, ఈవ్‌కి గుర్తుగా ఫర్‌ చెట్టుకి ఆపిల్‌ పండ్లని కట్టేవారు. ఆ చెట్టుని వారు పారడైస్‌ చెట్టుగా పిలుచుకునే వారు. ఆ తరువాత క్రమేపీ క్రిస్మస్ చెట్టు ఆచారం బ్రిటన్‌లోకి పాకింది. అక్కడ ఆ చెట్టుకి రకరకాల కొవ్వొత్తులు, మిఠాయిలు, ఇతర వస్తువులతో అలంకరించడం ప్రారంభించారు. అలా 1781లో ఈ ఆచారం కెనడాలోకి.. తరువాతి శతాబ్దంలో అమెరికాలోకి అడుగుపెట్టింది. ఇక సాధారణంగా ఇళ్లలో పెట్టుకునే క్రిస్మస్‌ చెట్లు ఇరవయ్యో శతాబ్దం వచ్చే సరికి బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించాయి. అమెరికాలో అనేక బహిరంగ ప్రదేశాలలో, కూడళ్ళలో భారీ క్రిస్మస్‌ చెట్లను అమర్చడం మొదలు పెట్టారు. ఇక 1923 నుంచి అమెరికా శ్వేత భవనం దక్షిణ పచ్చికలో వారి జాతీయ క్రిస్మస్‌ చెట్టు అమర్చడం ప్రారంభమైంది. దీంతో ప్రతి ఏడాది ఆ చెట్టుకున్న దీపాలను వెలిగించడం ద్వారా అమెరికాలో క్రిస్టమస్‌ వేడుకలు ఆరంభమౌతాయి.

కాగా ఒకప్పుడు క్రిస్మస్‌ చెట్లు పూర్తిగా అడవుల నుండే సేకరించేవారు. ఇప్పుడు ఏకంగా లక్షల ఎకరాలలో ఫర్‌, పైన్‌ చెట్లను.. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా, యుకేలలో సాగుచేస్తున్నారు. దాదాపు పాతిక రకాల ఫర్‌, పైన్‌ చెట్ల జాతులను సాగు చేస్తున్నారు. ఇక ఈ చెట్టు ఏడు అడుగుల ఎత్తు పెరగడానికి 8-12ఏళ్ల సమయం పడుతుంది. కృత్రిమ క్రిస్మస్‌ చెట్లు ఇప్పుడైతే ఎక్కువగా చైనా నుండి దిగుమతి అవుతున్నాయి. కాగా అడవుల నరికివేతకు అడ్డు చెప్పే క్రమంలో, పందొమ్మిదో శతాబ్దంలో, జర్మనీలో ఈకలకి పచ్చ రంగు వేసి చెట్లలా చేసేవాళ్ళు. ప్రస్తుతం పలు పదార్ధాలతో క్రిస్మస్ చెట్లను తయారు చేస్తున్నారు.

క్రిస్మస్ చెట్టు వెనుక కథలు ఇదిలా ఉంటే క్రిస్మస్ చెట్టు వెనుక కొన్ని కథలు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా రెండు కథలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ వ్యక్తి చిన్నపాకలో నివసిస్తుండేవాడు. బీద వారైన వారికి ఒకానొక సమయంలో రెండు రోజులైనా ఆహారం దొరకదు. ఇక ఆహారం కోసం బయటకు వెళ్లిన ఆ తండ్రి ఎట్టకేలకు ఓ చిన్న రొట్టె ముక్కను సంపాదిస్తాడు. దాన్నే మూడు భాగాలు చేసుకుని తినే ముందు ‘‘ఓ జీసస్‌! మాలాగే ఈ లోకంలో ఆకలితో ఉన్న వారందరి కడుపు నింపు’’ అంటూ వారు ప్రార్థన చేశారు. ఆ తరువాత తినబోతుండగా.. ఆరేళ్ల పిల్లాడొకడు చలికి వణికిపోతూ వారి ఇంటికి వచ్చి ‘‘ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తారా?’’ అని అడుగుతాడు. ఆ చిన్నారిని వారు లోపలికి ఆహ్వానించగా.. తాను అన్నం తినక నాలుగు రోజులైందంటూ వారికి చెప్పుకొస్తాడు. దీంతో తమ రొట్టె ఇచ్చి, ఆ చిన్నారికి రగ్గు కప్పి పడుకోబెట్టి.. అతడి ఆకలి తీర్చగలిగామన్న తృప్తితో వాళ్లు నిద్రపోయారు. ఇక అర్దరాత్రి సమయంలో ఆ అన్నా చెల్లెల్లిద్దరికీ మెలకువ వస్తోంది. పైన చూస్తే మిలమిలలాడే నక్షత్రాల మధ్యలో దేవదూతలు ఎగురుతుంటారు. తమ ఇంటికి వచ్చిన ఆ పిల్లాడు.. తల మీద బంగారు కిరీటంతో, విలువైన బట్టలతో మెరిసిపోతూ ‘‘మీ దయ గొప్పది. పరలోకపు తండ్రి మీకు మేలు చేస్తాడు’’ అని దీవిస్తాడు. ఇక వెళ్తూ వెళ్తూ వాళ్లింటి బయట ఎండిన కొమ్మ నాటుతాడు. అది చూస్తుండగానే చిగురించి పెరిగి పెద్దదవుతుంది. దాని నిండా బంగారు యాపిల్‌ కాయలు కాస్తాయి. అదే మొట్టమొదటి క్రిస్మస్ చెట్టు అని కొందరు భావిస్తారు.

మరో కథ ఏంటంటే.. చాలా ఏళ్ల క్రితం క్రిస్మస్ రోజున చర్చికి వెళ్లి క్రీస్తుకు రకరకాల బహుమతులను ఇచ్చే సంప్రదాయం ఉండేది. అలా ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేద పిల్లాడు క్రీస్తుకు ఏదైనా బహుమతిగా ఇవ్వాలనుకుంటాడు. అయితే ఏది కొనాలన్నా అతడి చేతిలో డబ్బులు ఉండవు. దీంతో ఏం చేయాలో తోచని ప్లాబో తన ఇంటి ముందు ఓ అందమైన మొక్కను తీసుకొని.. దాన్ని చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసుకువెళ్లాడు. అయితే దాన్ని చూసిన చర్చిలో ఉన్న వాళ్లు ప్లాబోను ఎగతాళి చేస్తారు. దానికి ప్లాబో చిన్నబుచ్చుకున్నా.. తీసుకువచ్చిన ఆ మొక్కను బాల ఏసు ప్రతిమ దగ్గర పెడతాడు. ఇక వెంటనే ఆ చిన్న మొక్క అప్పటికప్పుడే ఎదిగిపోయి బంగారు వృక్షంగా మారిపోయింది. పవిత్ర హృదయంతో తీసుకువచ్చిన ఆ కానుకనే జీసస్‌ స్వీకరించాడని అందరూ నమ్ముతారు. అప్పటి నుంచి క్రిస్మస్‌ చెట్టును అలంకరిస్తూ వస్తున్నారని తెలుస్తోంది.