ఆయన స్వరం ఎంతో మాధుర్యం

తొలిపాట పాడినప్పుడు ఆయన స్వరంలో ఎంత మాధుర్యం ఉందో నిన్నమొన్న పాడిన పాటలోనూ అదే తీయదనం.. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం...

ఆయన స్వరం ఎంతో మాధుర్యం
Follow us

|

Updated on: Sep 25, 2020 | 1:59 PM

తొలిపాట పాడినప్పుడు ఆయన స్వరంలో ఎంత మాధుర్యం ఉందో నిన్నమొన్న పాడిన పాటలోనూ అదే తీయదనం.. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. అభిమానులకు బాలు.. ఆయన పాటగాడే కాదు.. మంచి వక్త కూడా.. అంతకు మించి నటుడు కూడా! గొప్ప సంగీత దర్శకుడన్న కీర్తి గడించకపోయినా మంచి సంగీత దర్శకుడన్న పేరు సంపాదించుకున్నారు.. ఎన్నో చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పారు.. ఎన్నో కార్యక్రమాలకు సంగీత నిర్వహణ బాధ్యతలను అందించారు. బాలుది బహుముఖ ప్రతిభ… పాతతరానికీ కొత్త తరానికీ సంధానకర్తగా పాటలప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ గాన గంధర్వుడు తెలుగుపాటలో కొత్త ఒరవడులు సృష్టించి సినీ సంగీతాన్ని పరవళ్లు తొక్కించారు.

గాయకులు కాలానికి అతీతులు కారు. ఎంత గొప్ప సింగరైనా కొంతకాలానికి పాతబడిపోతాడు. విన్న గొంతునే వినిపిస్తూ శ్రోతలకి విసుగు కలిగిస్తాడు. కానీ బాలు సంగతి వేరు. ఆయన దశకంఠుడు. ఆ మాటకొస్తే శత కంఠుడు, సహస్రకంఠుడు. ఆ గొంతు నిన్న మొన్నటి వరకు వినిపిస్తూనే ఉండింది, ఎన్నిసార్లూ విన్నా ఆ స్వరంలో ఏదో కొత్తదనం. తెలుగు సినీసంగీత ప్రపంచంలో బాలు ఎప్పటికీ ఓ స్టాండర్డ్ గా నిలిచిపోవడానికి కారణం… తొలినాళ్లలో పడిన బలమైన పునాది.. తిరుగులేని కృషి…

బాలు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించలేదు.. అయితేనేం…విన్న వెంటనే ట్యూన్‌ పట్టేసే అద్భుతమైన ప్రతిభ ఆయనది… అనుభవమే ఆయనకి సంగీత పాఠాలు నేర్పింది. అందుకే అలవోకగా అన్నేసి పాటలు అందరికీ పాడగలిగాడు… కఠినమైన పదబంధాలతో సాగే పాటలనైనా సింగిల్‌ టేక్‌లోనే ఓకే చేయగల సమర్థుడు కాబట్టే మ్యూజిక్‌ డైరెక్టర్లకు ఇష్టుడయ్యాడు…రచయితలూ సంతుష్టులయ్యారు. నాలుగు తరాల హీరోలకు పాడే అవకాశం ఒక్క బాలుకే దక్కింది…ప్రపంచంలో మరే గాయకుడికీ దక్కని అరుదైన అదృష్టమిది…అలాగని స్వరంలో మాధుర్యమేమైనా తగ్గిందా ..ఊహూ…అదే తీయదనం…అదే ఆయన గొప్పదనం…బాలులో ఉండే ప్రత్యేకమైన శైలి.. ఎవరినీ అనుకరించని ఓ విశిష్టమైన బాణీయే ఆ గాన గంధర్వుడికి పాటల పట్టాభిషేకాన్ని చేసి పెట్టాయి. హీరోలకే కాదు… హీరోల వారసులకీ, ఆ తరవాతి తరానికీ కూడా పాటలు పాడిన ఘనుడు బాలు.

కేవలం టాలెంట్ తో అన్నిటా నెగ్గుకొస్తూ సినీ సంగీత ఆకాశంలో నెలబాలుడిలా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వచ్చాడు. బాలుడిగా ఉన్నప్పుడే బాలు బహుముఖ ప్రతిభ వికసించింది. ఒక్క తెలుగుకే పరిమితం కాకుండా దక్షిణాదిన అన్ని భాషలలో తన పాటల పిట్టలను విహరింపచేశారు. ఆ తర్వాత హిందీలోనూ అద్భుతమైన పాటలు పాడారు. ఏ పాట పాడినా సహజంగా ఉండాలి. ఏ భాష మాట్లాడినా అది మాతృ భాషలా ఉండాలి. ఇదీ బాలు సిద్ధాంతం. అందుకే ఎంతో కృషి చేశాడు. ప్రతి భాష ఉచ్చారణలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు. ఇదే ఆయన్ను అందరివాణ్ని చేసింది.

తెరముందు ఎందరు హీరోలున్నా… తెర వెనుక ఒకడే హీరో… బాలు! హీరోలకి పాడారు. కమెడియన్లకి పాడారు. ఒక్కో హీరోకి ఒక్కోలా పాడారు. ఒక్కో కమెడియన్ కి ఒక్కోలా పాడారు. వంద కంఠాలతోనైనా పాడగలిగే అద్భుత ప్రతిభాశాలి… అయినా బాలు నిగర్వి. ప్రతిభనీ వినయాన్నీ అనులోమానుపాతంలో పెంచుకున్న వినయశీలి. ఆకాశమంత ఎత్తు ఎదిగినా … తనకి ఏమీ రాదని చెప్పే నిరహంకారం ఎవరికోగానీ సాధ్యం కాదు.

బాలు లాంటి గాయకుడు … భారతదేశం మొత్తం వెతికినా దొరకడు. భారతదేశమే కాదు… ప్రపంచంలోనే అలాంటి సింగర్ లేడనడానికి మొహమాటపడాల్సిన పని లేదు. గాయకుడిగా కంటే… మంచిమనిషిగా బాలునే చెప్పుకోవాలంటారు కొందరు. అందుకే పద్మశ్రీ, పద్మ విభూషణ్‌ల్లాంటి కిరీటాలూ, డాక్టరేట్ల లాంటి డాబుసరి బిరుదాలూ బాలు ప్రతిభకీ, వ్యక్తిత్వానికీ ఎంతమాత్రం వెలకట్టలేవు.