అమ్మ ఒడి పథకంపై కన్ను.. నిధుల స్వాహాకు స్కెచ్!

, అమ్మ ఒడి పథకంపై కన్ను.. నిధుల స్వాహాకు స్కెచ్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పథకం ‘అమ్మ ఒడి’. ఈ పధకం ద్వారా పేద, దిగువ మధ్య తరగతి మహిళలు.. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే.. సంవత్సరానికి 15 వేల రూపాయలు ప్రభుత్వం వారికి కానుకగా ఇస్తుంది. గ్రామాలు, మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా.. పేద ప్రజలకు ఉచితంగా చదువు చెప్పించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఈ పధకాన్ని రూపొందించాడు.

అయితే ఇంకా కొత్త ప్రభుత్వం వచ్చి కొద్దిరోజులు అయింది. ఈ పధకం ప్రైవేట్ స్కూళ్లు, విద్యాసంస్థలకు అమలు చేస్తారో లేదో కూడా తెలియదు గానీ అప్పుడే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఈ పధకం ద్వారా వచ్చే నిధులను స్వాహా చేయడానికి సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేశాయి.

తమ స్కూల్‌లో అమ్మ ఒడి పధకాన్ని అమలు చేస్తున్నామని.. తాము ప్రభుత్వం నుంచి గుర్తింపు తెచ్చుకున్నామంటూ ప్రచారం మొదలు పెట్టాయి. పిల్లలను తమ స్కూల్‌లో చేర్పిస్తే.. అమ్మ ఒడి పధకం కింద సంవత్సరానికి 15 వేల రూపాయలు పొందవచ్చని కృష్ణా జిల్లాలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థ ప్రచారాన్ని ఆరంభించింది. దీనిపై బ్యానర్లు కట్టి మరీ.. తల్లిదండ్రులకు గాలం వేస్తోంది. ఇది అంతా చూస్తుంటే స్కూల్‌లో సీట్లు నింపుకోవడానికి ఇదో కొత్తరకం స్కెచ్‌లా ఉంది.

ఇకపోతే ప్రభుత్వం.. అమ్మ ఒడి పధకాన్ని పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలకు పరిమితం చేసేలా నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూళ్లు, విద్యాసంస్థలకు ఈ పధకం వర్తించదు. ప్రస్తుతం ఈ పధకానికి మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉన్నారు విద్యాశాఖ అధికారులు. కాగా వైఎస్ జగన్ పేద పిల్లలకు ఉచిత విద్యను అందించడం కోసం ఈ పధకాన్ని రూపొందిస్తే.. కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఆ నిధులను స్వాహా చేయడానికి నయా ప్లాన్స్ రచిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *