డిసెంబర్ 25న సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా… థియేటర్‌లో సందడి చేద్దాం అంటూ మెగా హీరో ట్వీట్..

కరోనా మహమ్మారి కారణంగా మూత బడిన సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయా? అని ప్రేక్షకులతో పాటు సినీ స్టార్స్ కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. థియేటర్లను తెరిచేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చినప్పటికీ..

  • Shiva Prajapati
  • Publish Date - 8:32 pm, Sat, 28 November 20
డిసెంబర్ 25న సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా... థియేటర్‌లో సందడి చేద్దాం అంటూ మెగా హీరో ట్వీట్..

కరోనా మహమ్మారి కారణంగా మూత బడిన సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయా? అని ప్రేక్షకులతో పాటు సినీ స్టార్స్ కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. థియేటర్లను తెరిచేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చినప్పటికీ.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా అన్న అనుమానంతో యాజమాన్యాలు థియేటర్లను ఓపెన్ చెయ్యలేదు. తాజాగా ప్రజల్లో కరోనా పట్ల భయం సడలంతో పాటు.. పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు సినీ పెద్దలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తన సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రకటించాడు.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. డిసెంబర్ 25 తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించి సినిమా పోస్టర్‌ను సాయిధరమ్ తేజ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘మీ గోలలు, ఈలలు వినకుండా ఎక్కువ కాలం వేచి ఉండలేను. చాలా రోజుల తరువాత థియేటర్‌లో సాధారణ పరిస్థితుల మధ్య తన సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. మళ్లీ థియేటర్లలో సందడి చేద్దాం. క్రిస్మస్ సందర్భంగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ థియేటర్లలో మీ ముందుకు వస్తుంది’ అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ జంటగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సుబ్బు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’. ఈ చిత్రాన్ని మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో కలిసి డిసెంబ‌ర్‌ 25న విడుద‌ల చేస్తున్నారు.