షష్టిపూర్తి జరుపుకున్న మహాద్భుత చిత్రరాజం సీతారామకళ్యాణం, తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిన సినిమా .

సినీ రంగానికే గర్వకారణంగా మిగిలిపోయే చిత్రాలు కొన్నే వుంటాయి. తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే సినిమాలు కూడా కొన్నే వుంటాయి.

షష్టిపూర్తి జరుపుకున్న మహాద్భుత చిత్రరాజం  సీతారామకళ్యాణం,  తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిన సినిమా .
Follow us

|

Updated on: Jan 07, 2021 | 9:44 AM

సినీ రంగానికే గర్వకారణంగా మిగిలిపోయే చిత్రాలు కొన్నే వుంటాయి. తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే సినిమాలు కూడా కొన్నే వుంటాయి. ఎన్‌ఎటి వారి సీతారామకళ్యాణం అలాంటిదే! ఆ మహాద్భుత చిత్రరాజం నిన్నటితో షష్టిపూర్తి చేసుకుంది.. అరవై ఏళ్ల కిందట విడుదలైన సీతారామకళ్యాణం ఇన్నేళ్లయినా నిత్యనూతనంగా వుంది. ఎన్నేళ్లయినా అలాగే వుంటుంది. నెగటివ్‌ ఇమేజ్‌ కలిగిన రావణుని పాత్రను నందమూరి తారక రామారావు ధరించడం ఓ విశేషమైతే, తొలిసారిగా ఆయన దర్శకత్వం వహించడం మరో విశేషం. కొన్ని సినిమాలు చరిత్ర సృష్టిస్తాయి.. కొన్నే చరిత్రలో నిలిచిపోతాయి. సీతారామకళ్యాణం రెండో కోవలోకి చెందిన సినిమా. తెలుగు సినిమాల్లో పది అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేస్తే అందులో తప్పనిసరిగా స్థానం సంపాదించే చిత్రమిది! అద్భుతమైన కళాఖండమిది! ఎన్టీయార్‌ నటనకు, దర్శకత్వ ప్రతిభకు సీతారామకళ్యాణమొక తార్కాణం. ఎన్‌ఎటి సంస్థ కళాభిరుచికి దర్పణం.

నందమూరి తారక రామారావు. తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు. తెలుగుదేశంలో ప్రజంభనంలా వీచిన పేరు. మనదేశం సినిమాతో తెరకు పరిచమైన ఎన్టీయార్‌ షార్ట్‌ టైమ్‌లోనే స్టారయ్యారు. సినిమాల్లో రాకమునుపు ఆయన నాటకాలు వేసేవారు. అప్పుడాయన నాటక సంస్థ పేరు నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌. సినిమాలకొచ్చాక, నాలుగు రాళ్లు సంపాదించాక సినిమాలు తీయాలనే కోరిక పుట్టింది. నాటక సంస్థ పేరునే సినీ నిర్మాణ సంస్థకు పెట్టేశారు. అలా నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌ పుట్టింది. మొదటి ప్రయత్నంగా పిచ్చిపుల్లయ్య తీశారు. ఓ మోస్తరుగా ఆడింది. తర్వాత తోడు దొంగలు తీశారు. అడ్డంగా పోయింది. మూడో ప్రయత్నంగా జయసింహ తీశారు. కాసులు కురిపించింది. ఆ వెంటనే పాండురంగ మహత్యం తీశారు. అదీ సూపర్‌ హిట్టయింది. పాండురంగ మహత్యం తర్వాత ఎన్టీయార్‌ అల్లూరి సీతారామరాజు తీయాలనుకున్నాడు. కానీ చరిత్ర సేకరణకు సమయపడుతుందనే భావనతో అంతకు ముందు ఓ పౌరాణిక చిత్రం చేయాలనే నిర్ణయానికొచ్చాడు. అదీ రామాయణం ఆధారంగా. తన గురువైన కె.వి.రెడ్డితో ఆ సినిమా తీయాలన్నది రామారావు ఆలోచన. కె.వి.రెడ్డి కూడా ఓకే చెప్పేశారు. ఎన్టీయార్‌ రాముడిగా, ఎస్వీయార్‌ రావణుడిగా నటిస్తారని కె.వి.రెడ్డి ప్రకటించేశారు కూడా. అదే సమయంలో ఎన్టీయార్‌కు అత్యంత సన్నిహితుడైన దనేకుల బుచ్చి వెంకటకృష్ణ చౌదరి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఓ గ్రంథం తీసుకొచ్చి ఎన్టీయార్‌కు ఇచ్చారు. ఆ గ్రంధంలో రావణుడి వ్యక్తత్వ ధీరత్వాలను అద్భుతంగా ఆవిష్కరించారు. ఎన్టీయార్‌ ఆసక్తిగా ఆమూలాగ్రం చదివారు. రావణుడికి గురించి కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నారు. ఎన్టీయార్‌కెందుకో రావణుడి పాత్ర మీద మనసుపోయింది. కె.వి.రెడ్డి దగ్గరకెళ్లి విషయమంతా చెప్పాడు. రాముడిగా కాకుండా రావణుడిగా నటిస్తానన్నారు. కె.వి మాత్రం ఒప్పుకోలేదు. రాముడిగా కృష్ణుడిగా పేరు తెచ్చుకున్న నీకు ఈ రాక్షస పాత్ర తగదని హెచ్చరించారు. ఎన్టీయార్‌ వింటేగా. దాంతో కెవి సినిమా చేయనని తప్పుకున్నారు.. ఇక తప్పేది లేక ఎన్టీయారే దర్శకత్వ బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది. అలా సీతారామకళ్యాణం మొదలైంది..ఎన్టీయార్‌ రావణుడిగా వేస్తే, మరి రాముడి పాత్రో! ఎవరు వేయాలి? ఎన్టీయార్‌ సోదరుడు త్రివిక్రమరావుకేమో రెండు పాత్రలూ ఎన్టీయార్‌తోనే చేయించాలనే ఆలోచన ఉండింది..రామారావు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు. సీతారామకళ్యాణానికి సంబంధించిన కథ కాబ్టటి, రాముడు పాత్రను ఇరవైయేళ్ల కుర్రాడు వేస్తే బాగుంటుందనేది ఎన్టీయార్‌ అభిప్రాయం. అలా రాముడి వేషధారి కోసం అన్వేషణ మొదలైంది. ఓ చెప్పుల షాపులో ఎన్టీయార్‌ కంట హరనాథ్‌ పడ్డారు. హరనాథ్‌ దగ్గరకెళ్లి కుశలప్రశ్నలు వేశాడు ఎన్టీయార్‌. సినిమాల గురించి కాసేపు మాట్లాడుకున్నారు. ఎన్టీయార్‌కు హరనాథ్‌ తెగ నచ్చేశారు. రాముడి పాత్రకు ఎంపిక చేశారు. రాముడి పాత్రధారి దొరికాడు. మరి సీత? సీత పాత్రకు అమాయకంగా కనిపించే అమ్మాయి కావాలి. అప్పుడే రాణి రత్నప్రభ సినిమా ఆడుతోంది. అందులో మణి అనే అమ్మాయి నృత్య సన్నివేశంలో నటించింది. మణి అయితే బాగుంటుందని రామారావుకు సలహా ఇచ్చారు. ఎన్టీయార్‌ ప్రత్యేకంగా సినిమా వేయించుకున్నారు. తెరపై మణిని చూశారు. సీత పాత్రధారిణి దొరికిందని సంబరపడ్డారు. ఆ మణియే తదనంతరంలో గీతాంజలి అయ్యారు.

దర్శకుడిగా ఎన్టీయార్‌కు ఇది మొదటి సినిమానే అయినా, సీనియర్‌ దర్శకులకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాను రూపొందించారు. ఎన్టీయార్‌ గురుతుల్యులు కె.వి.రెడ్డి మార్క్‌ సినిమా అంతటా కనిపిస్తుంది. కారణం సినిమా సెట్స్‌లోకి వెళ్లకమునుపే స్క్రిప్ట్‌ అంతా సిద్ధం చేసుకోవడం. ప్రతీ ఫ్రేమును మనసులో ముందే స్కెచ్‌ గీసుకోవడం. లక్ష్మణుడి పాత్రకు శోభన్‌బాబును ఎంపిక చేశారు. పాండురంగ మహత్యంతో తెలుగులో పరిచయమైన బి.సరోజాదేవికి మండోదరి పాత్రనిచ్చారు. అయితే ఈమెకు మోక్షగుండం కృష్ణకుమారి గాత్రధానం చేశారు. ఇక నారదుడి పాత్రను కాంతారావు వేశారు. నారదుడంటే కాంతారావే అని తెలుగువారు అనుకోవడం ఈ సినిమానుంచే మొదలైంది. కుంభకర్ణుడి పాత్ర కన్నడ నటుడు ఉదయ్‌కుమార్‌ పోషించారు. ఇక విశ్వామిత్రుడిగా గుమ్మడి, దశరథుడిగా నాగయ్య, సులోచనగా ఛాయాదేవి, పరశురాముడిగా కె.వి.ఎస్‌.శర్మ, జనకుడిగా మిక్కిలినేని, రంభగా కుచలకుమారి వేశారు. మద్రాస్‌లోని విజయ వాహినీ స్టూడియోల్లోనే సినిమా షూటింగంతా జరిగింది. అవుట్‌డోర్‌కు వెళ్లాల్సిన పని లేకుండా సినిమా అంతా స్టూడియోలోనే కానిచ్చేశాడు ఎన్టీయార్‌. అడవులు, తోటలు అన్నీ సెట్సే. సినిమా పూర్తి కావడానికి దాదాపు రెండు నెలలు పట్టింది. అయిదు లక్షల రూపాయల వ్యయమైంది. ఫస్ట్‌ కాపీ రాగానే కె.వి.రెడ్డికి ప్రత్యేకంగా షో వేసి చూపించాడు ఎన్టీయార్‌. సినిమా చూసి కె.వి ముగ్ధుడయ్యారు. వెల్‌డన్‌. చాలా బాగా తీశావు. నీ విషయంలో నా అంచనా తప్పిందంటూ కితాబిచ్చారు…అప్పటి వరకు ఎన్టీయార్‌ తీసిన సినిమాలన్నింటికీ రెహమానే కెమెరామన్‌. నిజానికి సీతారామకళ్యాణం సినిమాకు కూడా ఆయనే కెమెరామన్‌. ఆయనకు గుర్రప్పందాలంటే తగని మోజు. షూటింగప్పుడు కూడా చెప్పా పెట్టకుండా అశ్వమేధయాగం చేసి వస్తుండేవాడు. ఆ రోజు సీతారామకళ్యాణం షూటింగ్‌ ప్రారంభం. ఇంట్లో మేకప్‌ వేసుకుని స్టూడియోకు బయలుదేరాడు ఎన్టీయార్‌. ఈలోపు రెహమాన్ రేసులాడేందుకు ఢిల్లీకో బొంబాయికో వెళ్లాడని తెలిసింది. ఎన్టీయార్‌కు విపరీతమైన కోపమొచ్చింది. చాలా రోజులుగా బాబూభాయిమిస్త్రి అసిస్టెంట్‌ ఒకడు తనకు కెమెరామన్‌ అవకాశమివ్వమని అడుగుతుండటం ఎన్టీయార్‌కు గుర్తుకొచ్చింది. అతగాడి అదృష్టం బాగుండి అదే టైమ్‌కు ఎన్టీయార్‌ ముందున్నాడు. అతడ్ని కారులో ఎక్కించుకుని స్టూడియోకు తీసుకెళ్లారు ఎన్టీయార్‌. షాట్‌ తీయమన్నారు. ఎన్టీయార్‌ ఊహించిన దానికంటే అద్భుతంగా తీశాడా కుర్రవాడు. అప్పటికప్పుడు అతడినే కెమెరామన్‌గా ప్రకటించారు ఎన్టీయార్‌. ఆ కుర్రాడే రవికాంత్‌ నగాయిచ్‌. తెలుగుతెరకు ఎన్టీయార్‌ అందించిన అద్భుతమైన సాంకేతిక నిపుణుడు. కైలాసం ఎపిసోడ్‌ను రవికాంత్‌ నగాయిచ్‌ చిత్రీకరించిన విధానం చూసి ఎన్టీయార్‌ మురిసిపోయారు.. ప్రేక్షకులకు రావణాసురుణ్ణి పది తలలతో చూపించేందుకు రవికాంత్‌ మాస్క్‌ పద్దతిని అడాప్ట్‌ చేశాడు. ఇందు కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. మిగతా భాగమంతా మాస్క్‌ వేసి రావణుని తలను పదిసార్లు విడివిడిగా తీశాడు. అంటే ఫిలింను పదిసార్లు ఎక్స్‌పోజ్‌ చేశాడు. కానీ ఎక్కడా ఆ తేడా కనిపించదు. ఈ సన్నివేశ చిత్రీకరణకు 36 గంటలు పట్టింది. సీను తీస్తున్నంత సేపు ఎన్టీయార్‌ కదలకుండా అలాగే కూర్చున్నారు.

సంగీత సాహిత్య గానాలు నటన ..ఇవన్నీ సీతారామకళ్యాణానికి చిరకీర్తిని, స్థిర కీర్తిని కట్టబెట్టాయి. ఇది తెలుగువారి కీర్తి సంపద. అన్యులెవరూ తీయడానికి సాహసించలేని కళా సంపద. ఎన్‌ఎటి సంస్థకు గౌరవ ప్రతిష్టలను తెచ్చిపెట్టడమే కాకుండా కాసుల వర్షాన్ని కురిపించిందీ సినిమా. ఆరు పదుల వయసున్నా వన్నె తరగని అపురూపచిత్రమిది! ఇందులో రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తే సీన్‌ సినిమాకే హైలైట్‌. ఎల్లోరా గుహల్లో కైలాస పర్వతాన్ని రావణుడు ఎత్తుతున్న శిల్పాన్ని చూసి ఈ ఘట్టాన్ని మలచినట్టు ఎన్టీయారే ఓ సందర్భంలో చెప్పుకున్నారు. దాదాపు పదిహేను నిమిషాలుంటుందీ సీను. ఈ సన్నివేశాన్ని రక్తికట్టించిన తీరు చూస్తే చాలు. ఎన్టీయార్‌ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎలా అయ్యారో అర్థమవుతుంది. రావణుడిగా ఎన్టీయార్‌ నటన అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం. ఎన్టీయార్‌ అభిమాన పాత్ర ఇది. ఎన్నోసార్లు స్వయంగా చెప్పుకున్నారు కూడా. సీతారామకళ్యాణం సినిమాకు ముందు భూకైలాస్‌లో రావణుడిగా నటించినా, ఎందుకో తృప్తి కలగలేదు ఎన్టీయార్‌కు. సీతారామకళ్యాణంలో రావణుడిగా నటించింది అందుకే! ఆ తర్వాత కూడా శ్రీకృష్ణ సత్యలో, శ్రీరామపట్టాభిషేకంలో, బ్రహ్మర్షి విశ్వామిత్రలో రావణ పాత్రను పోషించారాయన…ఆరు దశాబ్దాలైనా…తెలుగువారి గుండెల్లో సీతారామకళ్యాణం మంగళవాయిద్యాలు మారుమోగుతున్నాయంటే, కారణం సంగీత సాహిత్యాలే! ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. చిత్రంలోని ప్రతీ పాటకు ఓ ప్రత్యేకత వుంది. ప్రతీ స్వరరచనకు ఓ విశిష్టత వుంది. ఇందులోని పాటలు తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాల్లో మమేకమయ్యాయి. సీనియర్‌ సముద్రాల సాహిత్యానికి గాలి పెంచల నరసింహారావు అద్భుతమైన స్వర మధురిమలను అద్దారు. సీతారామకళ్యాణంలో ప్రతీ పాటా ఓ ఆణిముత్యమే! ఉన్నతోన్నత ప్రమాణాలు కలిగిన సంగీత సాహిత్యాలే ఇందుకు కారణం. సీతారాముల కల్యాణం చూతము రారండి పాటనే తీసుకోండి. తెలుగువారి సంప్రదాయంపై అఖండ విజయం సాధించిందీ పాట! తెలుగువారింట ఈ పాటలేని పెళ్లి పందిరి వుండదంటే అతిశయోక్తి కాదు. పెళ్లి మంటపంలో ఈ పాట వినిపించకపోతే అశుభమేమోనన్న సెంటిమెంట్‌ కూడా వుంది. తెలుగు పాటల్లో ఎవర్‌గ్రీన్‌గా, నంబర్‌వన్‌గా నిలిచే పాట ఇది. మరో వందేళ్లయినా ఇది నంబర్‌వన్‌గానే వుంటుంది. 1961, జనవరి ఆరున సీతారామకళ్యాణం విడుదలైంది. తొమ్మిది కేంద్రాలలో వంద రోజులాడింది. సినిమా ఎంతగా విజయవంతమైందో వెండితెర నవల కూడా అంతగా ప్రాచుర్యం పొందింది. వెండితెర నవలను సముద్రాల జూనియర్‌ రాయడం విశేషం.

రావణుడు పులస్త్య బ్రాహ్మణుడి మనువడు. గొప్ప శివభక్తుడు. అంతకు మించిన పండితుడు. సంగీత విశారదుడు. అహంకారం. స్త్రీలోలత్వం రావణుడిని రాక్షసుడిని చేశాయి. నెగటివ్‌ ఇమేజ్‌ కలిగిన రావణుడి పాత్రను మొదటిసారిగా హీరో స్థాయిలో తీర్చి దిద్దిన ఘనత ఎన్టీయార్‌కే దక్కుతుంది. ఎన్టీయార్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. అయినా టైటిల్స్‌లో ఆయన పేరు కనిపించదు. ఈ సినిమా తర్వాత తను దర్శకత్వం వహించిన గులేబకావళి కథకు కూడా ఎన్టీయార్‌ పేరు వేసుకోలేదు. దర్శకుడిగా తన పేరు వేసుకోకుండా తల్లిదండ్రులకు అంకితమిచ్చిన పద్దతికి కూడా శ్రీకారం చుట్టింది ఎన్టీయారే! కాకపోతే సినిమా టైటిల్స్‌లో దర్శకుడి పేరు లేకపోవడం మంచి సంప్రదాయం కాదని పి.పుల్లయ్య వంటి పెద్దలు చెప్పడంతో శ్రీకృష్ణ పాండవీయం నుంచి ఎన్టీయార్‌ పేరు వేసుకోవడం మొదలు పెట్టారు. సీతారామకళ్యాణంలో చాలా విశేషాలున్నాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మొదట తీసుకుంది సాలూరి రాజేశ్వరరావుని. కొన్ని పాటలు కూడా రికార్డు అయ్యాక ఎందుకో ఆయన తప్పుకున్నారు. ఆయన స్థానంలో అప్పటికీ పరిశ్రమకు కాస్త దూరంగా వున్న గాలి పెంచలనరసింహారావును తీసుకున్నారు. అంతకు ముందు రోజుల్లో స్టార్‌ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగి ఆర్ధికంగానూ, ఆరోగ్యపరంగాను పూర్తిగా చితికిపోయిన కస్తూరి శివరావుకు ఇందులో చక్కటి వేషాన్ని ఇచ్చారు ఎన్టీయార్‌. ఈ సినిమాలో ట్రిక్‌ ఫోటోగ్రఫీ అద్భుతంగా వున్నా, ఓ చిన్న పొరపాటు జరిగింది. ఇందులో లంకా నగరం కింద నీరు ప్రవహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సాధారణంగా అలలు తీరానికి తగులుతాయి. కానీ సినిమాలో మాత్రం తీరం నుంచి సముద్రం వైపుకు వెళుతున్నట్టు కనిపిస్తాయి. కారణమేమిటంటే లంకను మొదట స్టూడియోలో షూట్‌ చేసి తర్వాత సముద్రాన్ని షూట్‌ చేసి రెండింటిని కలిపారు. అందువల్ల కెరటాలు అటు ఇటు అయ్యాయి. అద్భతమైన కళాఖండాన్ని చూస్తూ మైమరచిపోయిన ప్రేక్షకులకు ఇది అంతగా గుర్తుకురాదు. సీతారామకళ్యాణం సామాన్య ప్రేక్షకులనే కాదు, అప్పటి పీఠాధిపతులను కూడా అమితంగా ఆకట్టుకుంది. పరమ నిష్టాగరిష్టులుగా వుంటూ, సినిమాలకు దూరంగా వుండే పీఠాధిపతులు రావణుడిగా ఎన్టీయార్‌ అభినయం చూసి అచ్చెరువొందారు. కంచి పీఠాధిపతి శ్రీ పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామి ప్రత్యేకంగా సినిమాను వీక్షించారు. నందమూరి నటనకు సంభ్రమాశ్చర్యాలకు లోనై పులకించిపోయారు. ఎన్టీయార్‌ను పిలిపించుకుని ఆశీర్వదించారు. అంతే కాదు..విశ్వ విఖ్యాత నటసార్వభౌమ అని ప్రశంసించారు. అప్పట్నుంచే ఎన్టీయార్‌ విశ్వ విఖ్యాత నటసార్వభౌముడయ్యాడు. శైవ పీఠంలో ఎవరికీ దక్కని గౌవరం ఎన్టీయార్‌ దక్కడం చరిత్రలోనే అపూర్వం. అందుకే 60 ఏళ్లయినా ఇప్పటికీ తెలుగువారు సీతారామకళ్యాణాన్ని అమితంగా ఆదరిస్తున్నారు. ఆదరిస్తూనే వుంటారు. Read More:కలియుగ కర్ణుడికి గుడి…. తెలంగాణలో సోనూసూద్‌కి కోవెల… లక్షలాది మందికి సాయం చేసినందుకే… Read More:‘ఆదిపురుష్’‌ గురించి షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన విలన్ సైఫ్ అలీఖాన్‌, ఓం రౌత్ భలే ప్లాన్ వేశాడుగా !

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం