షోలే@45.. నాలుగున్నర దశాబ్దాల సినిమా

దర్శకులకు అదో మానిఫేస్టో... ఓ మాగ్నకార్ట...నాలుగున్నర దశాబ్దాలవుతున్నా...ఇప్పటికీ కొత్తగానే వుంటుంది...అది స్ర్కీన్‌ప్లే మహత్యం...దర్శకుడి ప్రతిభ...ఫోటోగ్రఫీ గొప్పదనం...నటీనటుల నటనా వైదుష్యం...ఒక్కటేమిటీ...ట్వంటీ ఫోర్‌ ఫ్రేమ్స్‌ గురించి చెప్పుకురావాలి...

షోలే@45.. నాలుగున్నర దశాబ్దాల సినిమా
Follow us

| Edited By: Sanjay Kasula

Updated on: Aug 16, 2020 | 6:38 AM

షోలే….నాలుగున్నర దశాబ్దాల సినిమా

షోలే ఓ ట్రెండ్‌ సెట్టర్‌…

 సినీ టెక్నిషియన్లకు అదో గ్రామర్‌…

మరే సినిమాకు సాటిరాని సినిమా…

గీటురాయి ఈ సినిమా…

యాక్షన్‌…సెంటిమెంట్‌…

మెలో డ్రామా….కాసింత ఎంటర్‌టైన్‌మెంట్‌…

అన్నీ వున్నాయి…అందుకే ఇది చరిత్ర

షోలే ఓ ఎవర్‌గ్రీన్‌…..

షోలే గురించి ఏం చెప్పినా…. ఇది మాకు తెలిసిందేలేవో అనేవాళ్లే ఎక్కువ…నిజమే షోలేని చూడనివాళ్లు… షోలే గురించి కాస్తయిన తెలియని వాళ్లు యాడ్‌మన్‌ అవుట్లే. మూడున్నర గంటల పాటు ప్రేక్షకులను భావోద్వేగాలతో కూర్చొపెట్టగలగడమనేది ఒక్క ఆ సినిమాకే సాధ్యమైంది.  సినిమాలో ఎక్కడా హింస అన్నదే కనబడదు. కానీ సినిమా మొత్తం నివురుగప్పిన నిప్పులా కణకణమంటూనే ఉంటుంది. అదే షోలే సినిమా స్పెషాలిటీ. అందుకే అంత పెద్ద హిట్టు కొట్టింది. ఇండియన్‌ మూవీస్‌పైన ఎవరైనా చరిత్ర రాస్తే…అందులో ఎక్కువ పేజీలు షోలేకే కేటాయించాల్సిందే.

నిర్మాత గోపాల్‌దాస్‌ పరమానంద్‌ సిప్పీ…అదే జీ.పీ.సిప్పీ కుటుంబం దేశ విభజన సమయంలో కరాచీ నుంచి కట్టుబట్టలతో బొంబాయ్‌కొచ్చింది. కొలాబాలో నివాసమేర్పరుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేకుండానే కేవలం తెలివితేటలనే పెట్టుబడిగా పెట్టి చిన్నా చితక వ్యాపారాలు చేశాడు. కాస్త సంపాదించిన తర్వాత బిల్డరయ్యాడు. అప్పుడు నర్గీస్‌కు ఇల్లు కట్టిస్తుండగా సినిమా పట్ల ఆసక్తి పెరిగింది. నిర్మాతయ్యాడు.

మొదట్లో ఇతను తీసిన సినిమాలన్నీ బి గ్రేడ్‌వే! బ్లాక్‌ క్యాట్‌, మిస్టర్‌ ఎక్స్‌… లైట్‌ హౌజ్‌, మిస్టర్‌ ఇండియా ఇలాంటి బాపతు సినిమాలన్నమాట… ఆరో దశకం మధ్య నుంచి పంథా మార్చుకున్నాడు. మేరే సనమ్‌… జోహార్‌ మహమూద్‌ ఇన్‌ గోవా.. బంధన్‌, అందాజ్‌, సీతా ఔర్‌ గీతా వంటి సినిమాలతో నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అందాజ్‌, సీతా ఔర్‌ గీతా, సినిమాలకు కొడుకు రమేష్‌ సిప్పీ దర్శకుడు. అందాజ్‌ తీసేనాటికి అతడి వయసు కేవలం పాతికేళ్లే.. ఆరేళ్ల వయసు నుంచే సినిమాలంటే తెగ పిచ్చి… తండ్రికేమో పెద్ద పెద్ద చదువులు చదివించాలని ఉండేది… అందుకే లండన్‌ కూడా పంపించాడు… సినిమాపై వ్యామోహం పెంచుకున్నవాడికి చదువుకోవాలని ఎలా అనిపిస్తుంది? ఆర్నేల్లు గడవకముందే ఇండియాకు తిరిగొచ్చేశాడు రమేశ్‌… కొడుకే కదా గారాబం చేయలేదు.. ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా పని చేయమన్నాడు… తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టరయ్యాడు..అప్పుడూ కష్టపడ్డాడు.. మేరే మహబూబ్‌ సినిమాకు అసిస్టెంట్‌గా వున్నప్పుడు హీరోయిన్‌ సాధన చెప్పులు పట్టుకుని వెనకే తిరుగుతూ కంటిన్యుటి చూసేవాడు… అంతగా కష్టపడ్డాడు… బేషజాలకు ఎప్పుడు పోలేదు…అలా సినిమాపై పూర్తి అవగాహన సాధించాక అందాజ్‌ సినిమాతో దర్శకుడయ్యాడు… రెండో సినిమా సీతా ఔర్‌ గీతా… మూడో సినిమా కోసం కథను వెతికే బాధ్యతను సిప్పీ ఫిలింస్‌కు స్టోరీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ సతీష్‌ భట్నాగర్‌కు అప్పగించారు. అప్పట్లో ఆయన దగ్గర సలీం జావెద్‌లు పని చేస్తుండేవారు. సీతా ఔర్‌ గీతా రచన వీరిదే. కాకపోతే పబ్లిసిటీలో మాత్రం వాళ్ల పేర్లు రాలేదు..

ఒళ్లుమండిపోయింది ఇద్దరికీ.. కొత్త సినిమాకు నిర్మాత పక్కనే ప్రముఖంగా తమ పేర్లూ రావాలని రమేష్‌తో చెప్పేశారు… వాళ్ల సత్తా ఏమిటో తెలుసు కాబట్టి రమేశ్‌ కూడా సరే అనేశాడు.. ముందు అప్పటికే స్ర్కిప్ట్‌తో సహా సిద్ధంగా వున్న మజ్‌బూర్‌ కథను వినిపించారు… అది జి.పి.సిప్పీకి నచ్చలేదు…అప్పుడు షోలే కథను చెప్పారు… పెద్దాయన ఓకే చెప్పేశాడు… 1973 మార్చి నెలలో షోలే సినిమా స్టోరీ డిస్కషన్స్‌ మొదలయ్యాయి…సినిమాకు మూలం అకిరా కురసోవా సెవెన్‌ సమురాయ్‌ ఆధారం..దీన్నే హాలీవుడ్‌లో ది మాగ్నిఫిషెంట్‌ సెవన్‌గా వచ్చింది…. ఎన్టీయార్‌..ఎఎన్నార్‌..ఎస్వీఆర్‌ నటించిన పల్లెటూరు పిల్ల సినిమా కూడా ఇంచుమించుగా ఇలాగే వుంటుంది…సరే.. రాసుకున్న స్ర్కిప్టుకు అప్పటికే హిందీలో వచ్చిన మేరాగావ్‌ మేరాదేశ్‌..ఖోటేసిక్కే వంటి సినిమాలను కూడా కలిపారు సలీం జావెద్‌లు…కథ రెడీ అయ్యింది… ఇక పాత్రల ఎంపికే మిగిలింది…ప్రధాన పాత్ర ఠాకూర్‌ బలదేవ్‌ సింగ్‌ది… మొదట్లో ఇది మిలటరీ పాత్ర… అయితే కొన్ని ఇబ్బందులు రావడంతో పోలీసుగా మార్చారు… గబ్బర్‌ సింగ్‌ నిజమైన బందిపోటుకు జిరాక్స్‌ కాపీలాంటి వాడు… అయిదో దశకంలో గ్వాలియర్‌ చుట్టుపక్కల గబ్బరంటే హడలెత్తిపోయేవారు…పోలీసులంటే మహాకోపం.. ఖాకీ దుస్తుల్లో ఎవరు కనిపించినా చంపేసేవాడు… సలీం తండ్రి ఇండోర్‌లో పోలీసు ఆఫీసర్‌..ఆయన చెప్పిన కథలన్నీ విని సలీం ఈ పాత్రను రూపొందించాడు…సుర్మా భోపాలి పాత్రేమో జావెద్‌ భోపాల్‌ వున్నప్పుడు అతనికి పరిచయమున్న వ్యక్తి… సలీం కాలేజీ చదువుతున్నప్పుడు జై..వీరూ అని ఇద్దరు ఫ్రెండ్స్‌ వుండేవారు…వారిపేర్లే హీరోలకు పెట్టేశాడు..ఠాకూర్‌ బల్‌దేవ్‌ సింగ్‌ అన్నది అతడి మామగారి పేరు… ఆయన కాశ్మీరీ డోగ్రా…సలీం మతాంతర వివాహాన్ని చేసుకున్నాడు…ఆ తర్వాతే హెలెన్‌ను చేసుకున్నాడు…అలాగే ఫ్రెండ్‌తో చిన్నపాటి వివాదాలను పరిష్కరించుకోడానికి జై జేబులో వున్న కాయిన్‌తో టాస్‌ వేస్తుంటాడు… ఇది గార్డెన్‌ ఆఫ్‌ ఈవిల్‌ అన్న సినిమాల్లోంచి తీసుకున్నది.. మీకు తెలుసా? మొదట జై పాత్రకు శత్రుఘ్న సిన్హాను అనుకున్నారట! రమేష్‌కెందుకో షాట్‌గన్ మీదే మనసు పోయిందట! సలీం జావెద్‌ల పుణ్యమా అని ఆ పాత్ర అమితాబ్‌కు దక్కింది…ఠాకూర్‌ వేషానికి ముందు అనుకున్నది ప్రాణ్‌ను… తర్వాత సంజీవ్‌ కుమార్‌కు ఈ ఛాన్స్‌ వచ్చింది. ఇంకో సంగతేమిటంటే…ధర్మేంద్ర…అమితాబ్‌లు వీరూ..జై పాత్రలు వేశారు కానీ… ధర్మేంద్రకు ఠాకూర్‌ పాత్రపైనే మనసు పారేసుకున్నాడట…అమితాబేమో గబ్బర్‌ సింగ్‌పై…అందుకేనేమో రామ్‌గోపాల్‌ వర్మ తీసిన ఆగ్‌లో అమితాబ్‌ గబ్బర్‌ వేషం వేసింది…

బాలీవుడ్‌లో అంతకు ముందు కనీవినీ ఎరుగని రీతిలో సినిమా చేయాలన్నది సిప్పీల ప్లాన్‌…అందుకే ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడలేదు… వీరూ పాత్రకు ధర్మేంద్ర అని స్ర్కిప్ట్‌ రాస్తున్నప్పుడే డిసైడయ్యారు… హేమామాలిని..ధర్మేంద్ర కాంబినేషన్‌కు అప్పట్లో పిచ్చ క్రేజ్‌ వుండేది… అందుకే బసంతి వేషానికి హేమను ఫిక్స్‌ చేసేశారు..సినిమాలో హేమ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ…రమేష్‌ అడిగాడు కాబట్టి ఒప్పేసుకుంది…జై పాత్రను ఎవరికివ్వాలన్న దగ్గరే పేచి వచ్చింది… శత్రుఘన్‌ సిన్హా కివ్వాలని రమేష్‌ అనుకున్నాడు… సలీం జావెద్‌లు మాత్రం అమితాబ్‌ను ప్రిఫర్‌ చేశారు. అప్పటికే జంజీర్‌లో అమితాబ్‌ చేసివున్నా…అమితాబ్‌ స్టామినా ఇంకా వెలుగులోకి రాని రోజులవి…మరోవైపు షాట్‌గన్‌కేమో బోల్డంత మాస్‌ ఫాలోయింగ్‌…ఎక్కడ ఇగో ప్రాబ్లమ్స్‌ వస్తాయేమో నన్న భయం..పైగా అమితాబ్‌ను పెట్టుకుంటే రాధ పాత్రకు జయాబాధురీ టక్కున ఒప్పేసుకుంటుంది..ఎందుకంటే అప్పటికే వాళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది కాబట్టి…అదీకాకుండఆ ధర్మేంద్ర కూడా అమితాబ్‌కే ఓటు వేశాడు…ఠాకూర్‌ వేషానికి ప్రాణ్‌ అయితే బెటరని కొందరన్నా… సంజీవ్‌ కుమార్‌ మీద రమేష్‌కు మాంచి గురి వుంది…ఇక మిగిలింది గబ్బర్‌ వేషం..ఆ వేషానికి ముందుగా అనుకున్నది డానీని…అందరిని కూర్చొపెట్టుకుని సలీం జావెద్‌లు డైలాగ్‌ టు డైలాగ్‌ వినిపించారు.. స్ర్కిప్టు అంతా విన్నాక ధర్మేంద్రేమో ఠాకూర్‌ వేషం వేస్తానన్నాడు… అమితాబేమో గబ్బర్‌ వేషం కావాలన్నాడు…జి.పి.సిప్పి మాత్రం నోర్మూసుకుని చెప్పింది చేయమన్నాడు…

గబ్బర్‌ సింగ్‌ పాత్రను డానీ చేసుంటే ఏమయ్యేది…. అంజద్‌ఖాన్ చేసివుండకపోతే ఏమైవుండేది…ఇప్పుడనిపిస్తుంది కొన్ని మంచికే జరుగుతాయని….అరే ఓ సాంబా అంటూ అంజద్‌ ఖాన్ పేల్చిన డైలాగులు ఇంటింటా మారుమోగేవా..? జో డర్‌గయా సమ్‌ఝో మర్‌గయా అనేది సామెతై కూర్చొనేదా? అసలు విలన్‌లో ఇంత క్రూయాలిటీ వుంటుందా అని తెలిసివచ్చేదా? కేవలం ఈ ఒక్క సినిమాతోనే అంజద్‌ఖాన్‌ హీరోలకు కూడా దక్కనంతటి క్రేజ్‌ను దక్కించుకున్నాడు..ఎంతగా అంటే అడ్వర్‌టైస్‌మెంట్లలో నటించేటంతగా…హీరోలూ ఉడుక్కునేటంతగా….కో స్టార్లు ఉలిక్కిపడేటంతగా…

నెల రోజుల్లో షూటింగ్‌ మొదలవుతుందన్నప్పుడు డానీ సినిమా నుంచి తప్పుకున్నాడు…కారణం అప్పటికే ఫిరోజ్‌ఖాన్‌ ధర్మాత్మకు డేట్స్‌ ఇచ్చేసి వున్నాడు…షూటింగేమో అఫ్ఘనిస్తాన్‌లో…సర్దుబాటు చేద్దామన్నా కుదరని పరిస్థితి…రమేష్‌కు ఏం చేయాలో పాలు పోలేదు…గబ్బర్‌ పాత్ర కోసం మళ్లీ అన్వేషణ మొదలైంది… రంజిత్‌..ప్రేమ్‌చోప్రా…ప్రేమ్‌నాథ్‌ పేర్లను పరిశీలించారు…కానీ సలీంకు వీళ్లెవరూ నచ్చలేదు.. ఆల్‌రెడీ సలీం మనసులో ఓ నటుడు తిష్టవేసుకూర్చున్నాడు… అతనిల్లు వెతికి మరీ వెంటపెట్టుకు వచ్చాడు…అతడి పేరు అంజద్‌ఖాన్‌…నటుడు జయంత్‌ చిన్నకొడుకు.. ఇంతియాజ్‌ ఖాన్‌కు తమ్ముడు..అప్పటికే అంజద్‌ఖాన్‌ థియేటర్‌ ఆర్ట్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు.. అంజద్‌ ప్రతిభేమిటో రమేష్‌కి కూడా తెలుసు…తన సోదరి సోనీ నటించిన టు దిస్‌ నైట్‌ ఎ డాన్‌ అనే ఇంగ్లీష్‌ నాటకంటో ఆవిడ కొడుకుగా వేసింది అంజదే…నాలుగు రోజుల తర్వాత సిప్పీ ఆఫీసులో గబ్బర్‌ వేషంతో ఫోటో సెషన్‌ జరిగింది…ఫోటోలు అందరికీ నచ్చేశాయి… గబ్బర్‌ వేషం అంజద్‌కు వెళ్లింది… అదే రోజు అంటే 1973, సెప్టెంబర్‌ 20న అంజద్‌కు కొడుకు పుట్టాడు…

సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్‌ కోటి రూపాయలు.. కానీ సినిమామీద ఎందుకో నమ్మకం పెరగసాగింది తండ్రీకొడుకులకు..అందుకే సినిమాస్కోపు అనుకున్న సినిమాను కాస్త 70 ఎంఎం స్టీరియోఫోనిక్‌ సౌండ్‌ సిస్టమ్‌లో తీయాలని డిసైడయ్యారు. అయితే ఇండియాలో అప్పటికీ 70 ఎంఎం కెమెరాలు లేవు.. అంచేత 35 ఎంఎంలో తీసి దాన్ని 70 ఎంఎంలోకి బ్లో అప్‌ చేయిద్దామనుకున్నారు. కెమెరామన్‌ ద్వారకా దివేచా రంగంలోకి దిగాడు.. 35 ఎంఎం కెమెరా లెన్స్‌ ముందు ఓ గాజుపలకను పెట్టి దాని మీద 70 ఎంఎం ఫ్రేమ్‌ మార్జిన్స్‌ మార్క్‌ చేసుకుని ఓ సీన్‌ షూట్‌ చేసి… ఆ టెస్ట్‌ ఫిలింను లండన్‌కు పంపించాడు.. అక్కడ రమేష్‌ సోదరుడు అజిత్‌…దాన్ని 70 ఎంఎంలోకి బ్లోఅప్‌ చేయించి ఆ ప్రింట్లను మళ్లీ ఇండియాకు పంపాడు… రిజల్ట్స్‌ అద్భుతంగా వచ్చాయి…

1974 అక్టోబర్‌ రెండున బెంగుళూరుకు దగ్గర్లోని రామనగరంలో ముహూర్తపు షాట్‌ అనుకున్నారు. అయితే ఆ రోజు కుంభవృష్టి…ముహూర్తం షాట్‌ కాస్త మర్నాడికి పోస్ట్‌పోన్‌ అయింది…ఇనప్పెట్టే తాళాలను రాధకు జై తిరిగి ఇచ్చేసే సన్నివేశాన్ని మొదటి రోజు తీశారు…అమితాబ్‌-జయల పెళ్లయి అప్పటికీ సరిగ్గా నాలుగు నెలలై వుంటుందంతే. పైగా జయ మూడు నెలల ప్రెగ్నెంట్‌… ప్రతి సీన్‌ను 70 ఎంఎం ఫార్మట్‌ను దృష్టిలో పెట్టుకుని తీయడం వల్ల చాలా టైమ్‌ పట్టేది… అందుకే షూటింగ్‌ నెమ్మదిగా సాగింది…

సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ బందిపోట్లకు సంబంధించినది…జనరల్‌గా ఇలాంటి సినిమాలన్నీ రాజస్థాన్‌లో తీసేవారు… కొన్ని వందల సినిమాలు అక్కడ షూటింగ్‌ జరుపుకున్నాయి…షోలే ఆర్ట్‌ డైరెక్టర్‌ రామ్ యేదేకర్‌కు తన రామ్‌ఘడ్‌ను కొత్త ప్లేస్‌కు తీసుకెళ్లాలనుకున్నాడు…అందుకే దక్షిణ భారతమంతా చుట్టాడు..చివరికి బెంగుళూరుకు దగ్గర్లోని రామనగర్‌ను ఎంచుకున్నాడు…కొండలు గుట్టలతో నిండి వున్న ఆ ప్రాంతంలో యేదేకర్‌ మహత్యం వల్ల రెండు నెలలు తిరిగేసరికి నిజంగానే ఓ గ్రామం వెలిసింది…టెలిఫోన్‌ కనెక్షన్లు… డ్రైనేజ్‌ సదుపాయాలు…నీళ్ల పంపులు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ గ్రామానికి లేని సౌకర్యం లేదు…

యే దోసీతీ…హమ్‌ నహీ చోడెంగే పాటను తీయడానికి ఎన్ని రోజులు పట్టి వుంటుంది? మహా అయితే అయిదు రోజులు అనుకుంటున్నారా? మూడు వారాలు పట్టింది… స్టడీకామ్‌లు..అకేలాలు లేని రోజుల్లో తీసిన ఆ పాటను ఇప్పుడు చూడండి… మనం కూడా జై వీరులతో కలిసి ప్రయాణిస్తున్న ఫీలింగ్‌ వస్తుంది…దీని కోసం ద్వారకా దివేచా సొంతంగా ఓ యంత్రాన్ని తయారుచేసుకున్నాడట.. అది రకరకాల యాంగిల్స్‌లో షాట్స్‌ తీసుకునేట్టు చేసేదట…

మళ్లీ పాట దగ్గరకొద్దాం… పాట చివర్లో బైక్‌ పక్కనున్న తొట్టి విడిపోయి …తర్వాత పాట ముగిసే సమయనికి మళ్లీ వచ్చి కలుస్తుంది..తొట్టికి కెమెరాను కట్టి దాన్ని ట్రాలీ మీద వుంచి టైమింగ్‌ను లెక్కకట్టుకుని వదిలిపెట్టారు…ఆ టైమింగ్‌ ప్రకారం అమితాబ్‌ బైక్‌ నడుపుకుంటూ వచ్చి…దాంతో తన బైక్‌ను కలపాలి… విశేషమేమిటంటే… అమితాబ్‌ ఈ షాట్‌ను ఒకే ఒక్క టేక్‌లో ఓకే చేశాడు…యూనిట్‌ అభినందనలను అందుకున్నాడు…

కోయీ హసీనా అనే పాటుంది..ఇందులో రెండో లైనులో స్టేషన్‌ సె గాడీ జబ్‌ ఛూట్‌ జాతీ హైతో ఏక్‌ దో తీన్‌ హో జాతీ హై…అన్న దగ్గర టాంగాలో ధర్మేంద్ర..హేమామాలినితో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో రైలు వెళుతూ కనిపించాలి… రామ్‌నగర్‌లో రోజుకు ఒక్కటంటే ఒక్కటే ట్రైన్‌ వస్తుంది… అది కూడా ఉదయం ఎనిమిది గంటలకు… అదొచ్చినప్పుడే షాట్‌ తీయాలి…యూనిట్‌ అంతా సిద్ధమైంది… లాస్ట్‌ మినిట్‌లో హేమా తల్లో పూలు లేవన్న సంగతి తెలిసింది… పూలు లేకపోతే కంటిన్యుటి దెబ్బ తింటుంది… పోనీ లేకుండా తీద్దామంటేనేమో ప్రేక్షకులు ఈజీగా గుర్తుపట్టేస్తారాయే…పూల కోసం బెంగళూరుకు వెళ్లిన వారి జాడేమో కనిపించడం లేదు…యూనిట్‌లో ఆందోళన… మరో పక్క రైలు వచ్చేస్తోంది…లాస్ట్‌ మినిట్‌లో ప్రొడక్షన్‌ వ్యాను రావడమూ…సెకన్లలో హేమ తల్లో పూలు పెట్టుకోవడము జరిగాయి… నగరాలో పాట వేయడమూ…కెమెరా రన్‌ కావడమూ అన్ని వెంట వెంటనే జరిగాయి.. షాట్‌ అద్భుతంగా వచ్చింది..

గబ్బర్‌ సింగ్‌ ముందు హేమ డాన్స్‌ చేసే సీనుంది… అప్పుడో పాట కూడా వుంది… ఆ పాటను జనవరిలో తీద్దామనుకున్న రమేష్‌ దాన్ని మే నెలకు వాయిదా వేశాడు..ఎందుకంటే హేమ మొహంలో అలసట కనిపించాలనే ఉద్దేశంతో… కాకపోతే రామ్‌నగర్‌లో మే నెలలో కూడా రాత్రంతా వర్షాలు పడేవి… ఉదయాన్నే ఆగిపోయేవి… పెద్ద పెద్ద ఫ్యాన్లు…బ్లోయర్లు తెచ్చి రాళ్ల గుట్టలన్నీ ఆరిపోయేట్టు చేసేవారు…మధ్యాహ్నం నుంచే షూటింగ్‌ మొదలయ్యేది..

షోలే సినిమాలో అయిదు పాటలున్నాయి.. మొదట్లో రికార్డు చేసినప్పుడు మెహబూబా పాట లేదు… అప్పుడు సుర్మా భోపాలి కోసం ఓ ఖవ్వాలీని రికార్డు చేశారు… ఎనిమిది నిమిషాల పాట ఇది…మన్నాడే..కిషోర్‌ కుమార్‌లతో పాటు ఆర్‌డి బర్మన్‌ అసిస్టెంట్‌ భుపిందర్‌…రచయిత ఆనంద్‌బక్షీ పాడారు…సినిమాలో కామెడీ ట్రాక్ కోసం వాడుదామనుకున్నారు…నిడివి ఎక్కువయ్యేసరికి అసలు పాటనే చిత్రీకరించలేదు..తర్వాతే మెహబూబా పాటను రికార్డు చేశారు… ఇదేమో డెమీ రూసో ఆల్బం నుంచి తీసుకున్నారు…ఈ పాట పెట్టడం జావెద్‌కు అస్సలు ఇష్టం లేదు… గబ్బర్‌ ఇలా అమ్మాయిల కోసం కక్కుర్తిపడేరకం కాదని వాదించాడు.. రమేష్‌ వింటేగా…. విచిత్రమేమిటంటే…సినిమా విజయంలో ఈ పాట కూడా తోడవ్వడం…

ఏప్రిల్‌ నెలలో షూటింగ్‌ పూర్తయింది…చివరగా తీసిన సన్నివేశమేమిటంటే…సినిమా బిగినింగ్‌లో కనిపించేది… ఠాకూర్‌ జైలు దగ్గరకొచ్చి వీరు..జైలను తనతో పాటు రమ్మని చెప్పే సీన్‌ అన్నమాట… ఫైనల్‌ ఎడిటింగ్‌కు దాదాపు నెల రోజులు పట్టింది…ఎంఎస్‌ షిండే ఈ సినిమాకు ఎడిటర్‌… అందరూ ఆయన్ని దాదా అంటారు..రమేష్‌ మూడు లక్షల అడుగుల ఫిలిం ఎక్స్‌పోజ్‌ చేశాడు…తీసిన దాంట్లో విపరీతంగా రక్తపాతం వుంది…షిండే కత్తెరకు పదును పెట్టి 21 వేలకు కుదించాడు.. అంటే నాలుగు గంటల సినిమా…ఇందులోనూ హింస పాలు ఎక్కువ.. సినిమాను ట్రిమ్‌ చేసే బాధ్యతను దాదాకే వదిలేశాడు రమేష్‌…ఆఖరికి మూడు గంటల ఇరవై నిమిషాల సినిమాగా తయారైంది…సినిమాలో ఎక్కడా హింస కనిపించదు..అయినా ఏదో తెలియని భయం ప్రేక్షకులను సినిమా చూస్తున్నంత సేపు వెంటాడుతుంటుంది…సౌండ్‌ మిక్సింగ్‌ అంతా లండన్‌లో వున్న ట్విక్కెన్‌హామ్‌ స్టూడియో జరిగింది…

జులైలో సినిమా మొదటి కాపీ వచ్చింది…కోటి రూపాయలు అనుకున్నది కాస్తా మూడు కోట్లయింది..అంతా బాగానే వుంది…చివరి నిమిషంలో సెన్సార్‌ వాళ్లు కొన్ని ఇబ్బందులు పెట్టారు…హింస ఎక్కువగా వుందనేది వాళ్ల అభిప్రాయం..నిజానికి ముందు అనుకున్నది మనం చూసిన షోలే సినిమాలో వున్న క్లయిమాక్స్‌ కాదు. మొదట తీసిందేమిటంటే… గబ్బర్‌ సింగ్‌ను చివరిలో ఠాకూర్‌ చంపేస్తాడు… అయితే అప్పుడు దేశంలో ఎమర్జెన్సీ వుండటంతో సెన్సార్‌ నిబంధనలు చాలా కఠినంగా వుండేవి… ఓ రిటైర్డ్‌ పోలీసు ఆఫీసర్‌ చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటాడు…ఠాట్‌ వీళ్లేదని చెప్పేశారు…క్లయిమాక్స్‌ను మార్చకపోతే అంగీకరించమన్నారు.. ఇది జులై 20న జరిగింది…సినిమానేమో ఆగస్టు 15కి విడుదల చేయాలి…ఎలా…అప్పటికప్పుడు క్లయిమాక్స్‌ని మార్చారు… మాస్కో ఫిలిం ఫెస్టివల్‌లో వున్న సంజీవ్‌ కుమార్‌ని అర్జెంట్‌గా ఇండియాకు రప్పించారు.. అందరూ కలిసి మళ్లీ రామనగరంకి వెళ్లారు… సలీం జావెద్‌లకు ఈ క్లయిమాక్స్‌ ఇష్టం లేకున్నా ఒప్పుకోవాల్సి వచ్చింది..అయితే సెన్సారైన ఈ సన్నివేశాలన్నీ వున్న ఓ ప్రింటు ల్యాబ్‌ నుంచి బయటకు వెళ్లింది…

ఇందులో సచిన్‌ ఇమామ్‌ కొడుకు…గబ్బర్‌ మనుషుల చేతికి చిచ్చి చనిపోతాడు… మొదట తీసిన సీన్‌ చలా భయానకంగా వుంటుంది… పదిహేడు రోజుల పాటు తీశారు ఈ సన్నివేశాన్ని…ఫైనల్‌ ఎడిటింగ్‌లో వీళ్లకే భయం వేసి తీసేశారు… నిజానికి మనం చూసిన సీనే బాగుంటుంది…గబ్బర్‌ తన చేతి మీద పాకుతున్న చీమను ఒక్క దెబ్బతో చంపేస్తాడు..అప్పుడు కెమెరా గబ్బర్‌ మొహం మీద ఫోకస్‌ అవుతుంది…అప్పుడతను చూపించిన ఎక్స్‌ప్రెషనే తర్వాత ఏం జరగబోతుందనేది చెప్పేస్తుంది.. కత్తిరింపుకు గురైన సీన్‌ కూడా బయటకొచ్చేసింది…

అగస్టు 14న బొంబాయ్‌ మినర్వా థియేటర్‌లో ప్రీమియర్‌ షో వేశారు…చూసిన వాళ్లంతా బాగుందన్నారు.. మరుసటి రోజు సినిమా విడుదలైంది… ఫస్ట్‌ టూ వీక్స్‌ రిపోర్ట్‌ వీక్‌గానే వచ్చింది… రమేష్‌కైతే ఏం చేయాలో తెలియని పరిస్థితి…చివరికి అమితాబ్‌ను బతికించి సినిమాను సుఖాంతం చేద్దామనే ఆలోచన కూడా వచ్చింది… సలీం జావెద్‌లకు మాత్రం ఇది ఎంత మాత్రమూ ఇష్టం లేదు..మూడో వారానికి కానీ రమేష్‌కు జరుగుతుందేమిటో అర్థం కాలేదు… చూసిన వాళ్లంతా గంభీరంగా..నిశ్శబ్దంగా ఇంటికెళుతున్నారు… ఆ నిశ్శబ్దం వెనుక ఏదో తెలియని భావోద్వేగం దాగి వుంది…అది దేశమంతా ఆవరించింది…నాలుగో వారం దాటాక కానీ ప్రేక్షకులు మాట్లాడటం మొదలు పెట్టలేదు… అంతే …ఎక్కడ చూసినా షోలేనే…టికెట్లు దొరక్క ప్రేక్షకులు అల్లాడిపోయే పరిస్థితి… హైదరాబాద్‌ రామకృష్ణ 70 ఎంఎం థియేటర్‌లో మాత్రమే 70 ఎంఎం ప్రింట్‌ను ప్రదర్శించారు…మిగతా చోట్ల 35 ఎంఎం ఫార్మటే! విజయవాడ నవరంగ్‌లో కూడా సినిమా దున్నేసింది…గుంటూరు లీలామహల్‌లో కూడా రెండు వందల రోజులాడింది…దేశం మొత్తం మీద మొదటి రన్‌లో 35 కోట్ల రూపాయలను వసూలు చేసింది…బొంబాయ్‌ మినర్వాలోఅయితే ఐదేళ్లు ఆడిందీ సినిమా…ఐదేళ్ల తర్వాత రమేష్‌ తన షాన్‌ కోసమే ఈ సినిమాను తీయాల్సి వచ్చిందే తప్ప కలెక్షన్లు లేక కాదు…

ఎప్పుడు షోలే చూసినా ఓ తరం ప్రేక్షకులు పాత రోజులను నెమరేసుకుంటారు… ఆ సినిమా చూడ్డానికి పడ్డ కష్టాలను తల్చుకుని మురిసిపోతుంటారు…సినిమా చూశాక పడిన కష్టాన్ని మర్చిపోయిన అనుభూతిని గుర్తుతెచ్చుకుని ఆనందపడిపోతుంటారు..ధర్మేంద్ర చివరలో కాయిన్‌ను విసిరికొట్టినప్పుడు అది తెర మీద నుంచి మన సీటు కిందే పడినట్టుగా ఫీలైన విషయాన్ని తల్చుకుని నవ్వుకుంటారు…నిజంగా షోలే ఓ వెంటాడే జ్ఞాపకం…షోలే ఓ వ్యాపకం… అదెప్పుడు చూసినా ఆనందమేస్తుంది… ఇప్పుడు సంజీవ్‌ కుమార్‌…అంజద్‌ ఖాన్‌….ఆర్డీ బర్మన్‌….మెక్‌మోహన్‌లు లేనందుకు బాధేస్తుంది.

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్